కదిరి: డీడీల కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకట ప్రసాద్‌కు బుధవారం నాంపల్లి సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.3లక్షల జరిమానా విధించింది. గతంలో హైదరాబాద్ సనత్‌నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులోనూ రూ.8.29 కోట్ల విలువ చేసే డీడీల కుంభకోణం కేసులో మే 31, 2016లో ఇదే నాంపల్లి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.13లక్షల జరిమానా విధించింది. ఎన్నికల సమయంలో ఐపీసీ 420, 302, 307, 324, 375, 471, 147, 148, 149 సెక్షన్ల కింద 9 కేసులు ఉన్నట్లు తన అఫిడవిట్‌లో కందికుంట స్వయంగా పేర్కొన్నారు. ఇన్ని కేసులుండి, ఆఖరుకు జైలు శిక్ష కూడా పడిన వ్యక్తిని పార్టీలో ఎందుకు కొనసాగిస్తున్నట్లనే విషయం చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మరో ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిలపై కేవలం కేసు నమోదు కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. మరి కందికుంటకు 2+2 గన్‌మ్యాన్‌లను ఇచ్చి, ఎందుకు పార్టీలో కొనసాగిస్తున్నట్లు పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఎక్కడి నుంచి వచ్చాడీయన?
కందికుంట వెంకట ప్రసాద్ స్వస్థలం కదిరి కాదు. ఈయన తండ్రి రఘురామప్ప ఒకానొకప్పుడు పంచాయతీరాజ్ శాఖలో జేఈగా ఉంటూ కదిరికి బదిలీపై వచ్చారు. ఆ సమయంలో వీరు కదిరిలోని కస్తూరిబాయి స్ట్రీట్‌లో వుండేవారు. కందికుంట ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్న సమయంలో ఈయనకు హిందూపురం కూడలిలో సోడాలు అమ్ముకునే సోడా బాలయ్య కుమార్తె యశోదమ్మతో పరిచయయమైంది. ఆ తర్వాత ఇరువురూ ప్రేమ వివాహం చేసుకున్నారు.
పరారై.. మళ్లీ దర్శనం
ధర్మవరంలో ఉండగా కందికుంటకు దివంగత మంత్రి పరిటాల రవి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి ఆ కుటుంబంతో సఖ్యతగా మెలుగుతున్నారు. అప్పట్లో జరిగిన ఓబుళరెడ్డి హత్య కేసులో కందికుంట హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారని తెలిసి బెంగళూరుకు పరారయ్యాడు. అక్కడ ల్యాండ్ సెటిల్‌మెంటల్‌లు చేస్తూ బెంగళూరు ప్రసాద్‌గా చెలామణి అవుతూ బాగా డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో ఎంట్రీ : 2004 ఎన్నికల సమయంలో కందికుంట తిరిగి కదిరి చేరుకున్నారు. అప్పుడు తెలుగుదే«శం పార్టీ తరపున కదిరి ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించారు. అయితే అప్పట్లో పొత్తులో భాగంగా ఈ సీటును చంద్రబాబు నాయుడు బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి బరిలోకి దిగారు. దీన్ని జీర్ణించుకోలేని కందికుంట టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి ఎంఎస్‌ను మూడో స్థానంలోకి పంపి, ఈయన ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. అప్పట్లో ఆయనకు టికెట్ రాకపోవడానికి పార్టీ జిల్లా అద్యక్షుడు బీకే పార్థసారిధి కారణమని భావిస్తూ కందికుంట ఆయనపై చెప్పులతో దాడి చేయించి, పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు.
ఆ తర్వాత ఇక్కడ పార్టీకి ఎవ్వరూ దిక్కులేరంటూ ఈయనపై సస్పెన్షన్ ఎత్తివేశారు. మళ్లీ 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి కదిరి ఎమ్మెల్యేగా గెలచారు. అనంతరం 2014 ఎన్నికల్లో సైతం టీడీపీ తరపున బరిలోకి దిగి స్వల్ప ఓట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాంద్‌బాషా చేతిలో ఓటమి చవి చూశారు. ఈయనపై ఇంకా ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మైనార్టీల వక్ఫ్‌బోర్డు.. క్రిష్టియన్ ఆస్తులను కూడా బినామీ పేర్లతో కబ్జా చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment