సాక్షి, కర్నూలు(కొండారెడ్డి పోర్టు) : ‘తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయాలన్నది జగన్ లక్ష్యం. అందుకోసం ఆయన ఎంత కష్టమైన, నష్టాన్నైనా భరిస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మరణించాక.. ఆయనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజల కోసం నాడు దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ సోనియాగాంధీని ఎదురించి ఓదార్పు యాత్ర చేపట్టారు. వైఎస్ మరణంతో అసువులు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. నేను ఉన్నాను అని ఓదార్పు ఇచ్చారు.
ఆగ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం చివరకు ఆయనను జైల్లో పెట్టింది. అయినా గుండె ధైర్యంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి 9 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలపై అనేక నిరసనలు, దీక్షలు, ర్యాలీలు, బంద్‌లు చేపట్టారు. చివరకు ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. ఆయన ధైర్యం, పోరాట పటిమ నాకు నచ్చింది.
పేదల సమస్యలు తెలుసుకోవడం కోసం ఎంతదూరమైనా వెళ్లే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడవాలని నిశ్చయించుకున్నాను. ఆయన బాటలో ప్రజా సేవ చేయడానికి వచ్చాను. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాకు ఎంపీ టికెట్ ఇచ్చి ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు’ అని కర్నూలు ఎంపీ అభ్యర్థి డాక్టర్ సంజీవకుమార్ తన మనసులోని మాట వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే..
ప్రజావాణిని పార్లమెంట్‌లో వినిపిస్తా..
రాయలు ఏలిన సీమ రతనాల సీమ. ఇది చెప్పేందుకు.. వినేందుకు బాగానే ఉంటుంది. కానీ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 72 ఏళ్లు గడచినా.. నేటికీ రాయలసీమలో కనీస సదుపాయాలు లేవు. తాగడానికి నీళ్లు లేవు. బతకడానికి పనుల్లేవు. వర్షాలు రాక.. పంటలు పండక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు అందక చాలామంది అప్పుల పాలవుతున్నారు.
బతకడానికి పుట్టిన ప్రాంతాన్ని వదిలి 50 ఎకరాల రైతు కూడా గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు వెళుతున్నారు. ఎకరం కౌలుకు తీసుకున్న రైతు దగ్గర పనికి ఉంటున్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంత పరిధిలోని సమస్యలన్నింటికీ తాగు, సాగునీరు అందించడమే పరిష్కారం. ఇది ఎవరో సాయం చేస్తేనో.. ఎవరో ఇస్తేనో పరిష్కారం అయ్యే పనికాదు. కేవలం ప్రభుత్వాలు తలుచుకుంటేనే పని అవుతుందనేది నా భావన. ఇందుకు బలమైన రాజకీయ వేదిక కావాలి. అది వైఎస్సార్ సీపీ అవుతుందని భావించా.
అందుకనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాటలో నడిచేందుకు సిద్ధమయ్యా. ఆయన నాకు అందించిన సహకారం అంతాఇంతా కాదు. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని నాకు ఏకంగా ఎంపీ టికెట్ ఇచ్చారు. అందులోనూ వెనుకబడిన తరగతికి చెందిన నాలాంటి వ్యక్తికి సీటు ఇవ్వడం ఆషామాషీ విషయం కాదు. వైఎస్ జగన్ బాటలో పయనించేందుకు 25 ఏళ్లుగా చేస్తున్న వైద్య వృత్తిని వదిలేసి వచ్చా. పశ్చిమ ప్రాంత సమస్యలన్నింటికీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో పరిష్కారం చూపుతా. వేదవతి, గుండ్రేవుల, హంద్రీనీవా, ఎల్‌ఎల్‌సీ కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని వచ్చేలా చేస్తాను. కుటుంబ పాలనతో కరువు ప్రాంతం ఎంత నష్టపోయిందో ప్రజలకు తెలియజేస్తా.
యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తా..
కర్నూలు పార్లమెంటరీ పరిధిలో ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి. నిత్యం ఏదో గ్రామంలో చంపడాలు, దొంగతనాలు, దౌర్జన్యాలు జరిగేవి. దీంతో ఫ్యాక్షన్‌కు సంబంధం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ఇబ్బంది పడేవారు. బాధలు అనుభవించేవారు. కాలానుగుణంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో చాలామంది ఎవరికీ వారే కక్షలు, కార్పణ్యాలకు దూరమై తమ పిల్లలను విద్యావంతుల్ని చేశారు. ఎంతోమంది డిగ్రీ, పీజీలు, డిప్లొమా కోర్సులు చదువుకున్నారు.
వారికి స్థానికంగా ఎలాంటి ఉపాధి, ఉద్యోగావకాశాలు లేవు. ఇక్కడ వ్యవసాయం చేసుకుని బతుకుదామనుకున్నా వర్షాలు రావడం లేదు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో వరుస కరువులే. చదువుకున్న డిగ్రీలు పని చూపడం లేదు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన పొలాలు కూడు పెట్టడం లేదు. దీంతో యువత దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇలాగే కొనసాగితే మళ్లీ పాత రోజులు వచ్చే అవకాశం ఉంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
కర్నూలు ఎంపీగా ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే మొదటి ప్రాధాన్యతగా ఇక్కడకు పరిశ్రమలను రప్పిస్తాను . తద్వారా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నది నా దృఢ సంకల్పం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందుతుందని నా ప్రగాఢ విశ్వాసం. ప్రజలు వైఎస్సార్ సీపీకి ఓటు వేసి అభివృద్ధిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.
పేదల గుండె చప్పుడు వినాలన్నదే ఆశయం
నా చుట్టూ ఉన్న ప్రజలు సంతోషంగా ఉండాలన్న మనస్తత్వం నాది. కులాలు, ఆర్థిక స్థోమతలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలను ఆదుకోవాలన్న లక్ష్యంతో పాతికేళ్లుగా చేస్తున్న వైద్య వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చాను. నిరుపేదల గుండె చప్పుడు వినాలన్నదే నా ఆశయం. అన్యాయాలను అరికట్టేందుకు.. దగాపడ్డ చెల్లెమ్మలకు చేయూతనిచ్చి ఆదుకునేందుకు.. దేశానికి వెన్నెముక అయిన రైతన్నను రాజును చేయడం కోసం రాజకీయాలు ఊతమిస్తాయి. పేదల క్షేమం కోసం పనిచేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి స్ఫూర్తి పొందాను. ఆయన బాటలో నడిస్తే సేవా కార్యక్రమాలను విస్తృతం చేయవచ్చని, సామాన్యుడి గొంతును చట్టసభల్లో వినిపించవచ్చని రాజకీయాల్లోకి వచ్చా.
– మూల శివశంకర్, కర్నూలు(కొండారెడ్డి పోర్టు)
Comments
Please login to add a commentAdd a comment