సమావేశంలో మాట్లాడుతున్న లేళ్ల అప్పిరెడ్డి, జంగాల అజయ్‌కుమార్, నళినీకాంత్, రోహిత్ తదితరులు
కొరిటెపాడు(గుంటూరు): ప్రత్యేక హోదా సాధనలో భాగంగా 24వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు విద్యుత్ నిలిపివేసి అన్ని వర్గాల ప్రజలు తమ నిరసన వ్యక్తం చేసి, బ్లాక్ డేను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, జనసేన, ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం అనేక రూపాల్లో ఉద్యమాలు నిర్వహించినట్టు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ప్రధాన మంత్రి మోదీ, తేవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరిని మభ్యపెట్టడానికి దీక్షలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఊపిరి ఉన్నంతవరకు హోదా సాధన లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
కపట నాటకాలు కట్టిపెట్టి ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ కలసి రావాలని, లేనిపక్షంలో చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ అంకితభావంతో అందరూ బ్లాక్ డేలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బ్లాక్ డే విజయవంతానికి గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో ప్రచార కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సీపీఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షలు చేసి కాలయాపన చేసేదానికన్నా మోదీపై పోరాటం చేయాలని సూచించారు. అవసరమైతే సకల జనుల సమ్మెకు కూడా వెనుకాడబోమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు సవరం రోహిత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధిపత్య పోరుతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నాయకుడు బేతంచర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ హోదా సాధన కోసం జరిగే కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని కోరారు. ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకుడు తోట కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశారని మండిపడ్డారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు సీపీఐ నాయకులు కోట మాల్యాద్రి, కె.నాగేశ్వరరావు, వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సీపీఎం నాయకుడు ఎన్.భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment