సాక్షి, అమలాపురం : ‘కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో రాణించి ప్రజా సేవ చేయాలనేది మా నాన్న చింతా కృష్ణమూర్తి చివరి కోరిక. రాజకీయాలపై ఆసక్తితో డీజీఎం స్థాయి ఉద్యోగాన్ని వదులుకుని నాన్న రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆయన ఆకాంక్షను గుర్తించిన జగనన్న వైఎస్సార్‌సీపీ అమలాపురం పార్లమెంట్ కో ఆర్డినేటర్‌గా నియమించారు. అదే సమయంలో నాన్న అనారోగ్యం పాలయ్యారు. అయితే చివరివరకూ రాజకీయాలు వదిలిపెట్టలేదు. దురదృష్టవశాత్తూ ఆయన మరణించారు.
నాన్న కోరిక తీర్చేందుకు జగనన్న ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చాను. పేదల కోసం ఎంతో చేయాలనే వైఎస్ జగన్ తపన నన్ను ఆయన వెంట నడిచేలా చేసింది. మా ప్రాంతంలో ఏడాదికి మూడు పంటలు పండించే డెల్టా రైతులు నష్టాల పాలై సాగుకు దూరమవుతున్నారని తెలిసి ఆవేదన చెందాను. కోట్ల విలువైన చమురు, సహజ వాయువులను తరలించుకుపోతున్నారని.. స్థానికంగా ఉపాధి లేదని నిరుద్యోగ యువత చెబుతున్నారు. అర్హులైనా తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం జగనన్న ముఖ్యమంత్రి కావడమే’ అంటున్నారు అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చింతా అనూరాధ. ఎన్నికల నేప థ్యంలో తన అంతరంగాన్ని ఆమె ఇలా ఆవిష్కరించారు.
‘నాన్న పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా కోనసీమలో రెండేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. రాజకీయాల్లోకి వస్తే మరింత మందికి మేలు చేసినట్టవుతుందని నేను బలంగా నమ్మాను. పైగా నాన్న కోరిక కూడా మేం రాజకీయాల్లో రాణించాలనేదే. కోనసీమలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నా అభివృద్ధి లేదు. రూ.కోట్ల విలువైన ఉత్పత్తులు తరలించుకుపోతున్నా యువతకు ఉపాధి కల్పించడం లేదు. వీరందరికీ న్యాయం చేయాలనే బలమైన సంకల్పంతో ఉన్నాను.
సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం వైఎస్ జగన్ వల్లనే సాధ్యమని వైఎస్సార్‌సీపీలో చేరాను. మహిళల అభ్యున్నతికి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారు. ఆయన ప్రకటించిన సంక్షేమ పథకాల్లో మహిళలకు పట్టంగట్టడమే అందుకు ఉదాహరణ. రాజకీయంగాను సీట్ల కేటాయింపులో మహిళలకు సమున్నత స్థానాన్ని కట్టబెట్టారు. మా తూర్పుగోదావరి జిల్లాలో మూడు ఎంపీ స్థానాలుంటే ఇద్దరు మహిళలకు అవకాశమిచ్చారు. కాకినాడ నుంచి వంగా గీత, అమలాపురం నుంచి నేను వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థులుగా పోటీచేస్తున్నాం.
డెల్టాలో సాగుకు భరోసా కల్పిస్తా
మా కోనసీమలో నీరెక్కువై ఒకసారి.. నీరు లేక మరోసారి.. ఇలా రెండు పంటలూ రైతులు నష్టపోతున్నారు. గతంలో రైతులు 90 వేల ఎకరాల్లో ‘సాగు సమ్మె’ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితి దేశానికి మంచిది కాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డెల్టా ఆధునికీకరణకు నిధులిస్తే.. టీడీపీ ప్రభుత్వం పనులు చేయించలేదు. రైతులకు కనీస మద్దతు ధర రావడం లేదు.
పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. వీటన్నింటిని పరిష్కరిస్తానని జగనన్న హామీనిచ్చారు. వైఎస్సార్ భరోసా ద్వారా రైతుకు ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లపాటు రూ.50 వేలు ఇస్తామని ప్రకటించారు. మద్దతు ధర తగ్గకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. వైఎస్సార్ చేపట్టిన డెల్టా ఆధునికీకరణను పూర్తి చేస్తారు. కొబ్బరి పరిశ్రమలు ఏర్పాటు చేసి 70 వేల మందికి ఉపాధి, రైతుకు లాభసాటి ధర వచ్చేలా చేయాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను.
మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఎంతో మేలు జరిగేది. హోదా రావాలంటే జగనన్న రావాల్సిందే.. హోదా కోసం తొలినుంచీ పోరాటం చేస్తుంది ఆయనే. మా నియోజకవర్గంలో చమురు సంస్థలున్నాయి. కానీ.. స్థానికంగా సరైన ఉపాధి అవకాశాలు లేవు. చమురు సంస్థల అనుబంధ పరిశ్రమలు మరిన్ని వచ్చేలా, ఇప్పుడున్న సంస్థల్లో స్థానికులకు ఉపాధి లభించేలా కృషి చేస్తాను. చమురు సంస్థల నుంచి మనకు ఎంత శాతం నిధులు రావాలి? ఎంత వస్తోందనే లెక్కలు ఎవరూ చెప్పడం లేదు. రావల్సిన నిధులను సాధించి వాటిని స్థానికాభివృద్ధికి
వినియోగించేలా కృషి చేస్తాను.
‘పసుపు–కుంకుమ’ పేరిట మోసాన్ని మహిళలు గుర్తించారు
మహిళలే కాదు అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు అందాలంటే జగన్ కావాలి.. జగన్ రావాలి అంటున్నారు. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలోని సంక్షేమ పాలన జగనన్నతోనే సాధ్యం. ఇదే విషయాన్ని నేను ఎన్నికల ప్రచారంలో చెబుతున్నాను. పవిత్రమైన పసుపు–కుంకుమ పేరిట ఎన్నికల సమయంలో చంద్రబాబు చేస్తున్న మోసాన్ని మా ప్రాంత మహిళలంతా గుర్తించారు. జగన్ వస్తేనే మహిళ ఇంటికి మహరాణి అవుతుందని నమ్ముతున్నారు.
–నిమ్మకాయల సతీష్‌బాబు, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment