amalapuram parliament constituency
-
2022లో జమిలి ఎన్నికలు: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ నాయకులతో ఆయన ఆన్లైన్లో మాట్లాడారు. చంద్రబాబు ఏమన్నారంటే.. ►కరోనా పోయిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలందరిని కలిసి కష్టాలను తీర్చేందుకు నడుం బిగిస్తా. ►పార్టీకి కొత్త రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంది. పార్టీలో కమిటీలన్నింటిని పూర్తిచేస్తున్నాం. యువతకు ప్రాధాన్యమిస్తున్నాం. సమర్థమైన నాయకత్వాన్ని ముందుకు తీసుకువస్తున్నాం. ►పార్టీలో కష్టపడి పనిచేసేవారికి పెద్దపీట వేస్తాం. నూతన నాయకత్వాన్ని గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చాం. అందుకే తెలంగాణ కేబినెట్ అంతా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు. ►టీడీపీ నాయకులను తీసుకుని మనపైనే విమర్శలు చేయిస్తున్నారు. ►ఉపాధి హామీ పథకం బిల్లుల బకాయిలు 24 శాతం వడ్డీతో çఇప్పించే బాధ్యత నాది. ►ఏడాదిన్నరపాటు నామీద అనేక ఆరోపణలు చేశారు. కొండను తవ్వి ఎలుక వెంట్రుక కూడా పట్టుకోలేకపోయారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్ నేడు చేతగాని పాలనతో చేతులెత్తేశారు. ►రాజోలులో జనసేన నుంచి గెలిచిన వ్యక్తి వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్ పెడితే కుట్ర పూరితంగా జగన్ బీసీల్లో చీలికలు తీసుకువచ్చారు. నేడు బహిరంగంగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వమని చెబుతున్నారు. ►కోర్టులపైనే ఇష్టానుసారంగా జగన్ వర్గం వ్యాఖ్యలు చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు శాశ్వతం కాదు, లా అండ్ అర్డర్ ఎక్కడ తప్పినా కోర్టులు కలుగజేసుకుంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. మేము లేకపోతే దేశంలో అరాచకం వస్తుందని హైకోర్టు చెప్పింది. ►దేశంలో మహిళలపై ఎక్కువ దాడులు ఏపీలో జరగటం జగన్ రాక్షస పాలనకు అద్దం పడుతుంది. ►కరోనా నుంచి కాపాడుకోవడానికివెబ్సైట్ ప్రారంభిస్తున్నాం. -
నాన్న ఆశయం.. జగనన్న ప్రోత్సాహం
సాక్షి, అమలాపురం : ‘కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో రాణించి ప్రజా సేవ చేయాలనేది మా నాన్న చింతా కృష్ణమూర్తి చివరి కోరిక. రాజకీయాలపై ఆసక్తితో డీజీఎం స్థాయి ఉద్యోగాన్ని వదులుకుని నాన్న రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆయన ఆకాంక్షను గుర్తించిన జగనన్న వైఎస్సార్సీపీ అమలాపురం పార్లమెంట్ కో ఆర్డినేటర్‌గా నియమించారు. అదే సమయంలో నాన్న అనారోగ్యం పాలయ్యారు. అయితే చివరివరకూ రాజకీయాలు వదిలిపెట్టలేదు. దురదృష్టవశాత్తూ ఆయన మరణించారు. నాన్న కోరిక తీర్చేందుకు జగనన్న ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చాను. పేదల కోసం ఎంతో చేయాలనే వైఎస్ జగన్ తపన నన్ను ఆయన వెంట నడిచేలా చేసింది. మా ప్రాంతంలో ఏడాదికి మూడు పంటలు పండించే డెల్టా రైతులు నష్టాల పాలై సాగుకు దూరమవుతున్నారని తెలిసి ఆవేదన చెందాను. కోట్ల విలువైన చమురు, సహజ వాయువులను తరలించుకుపోతున్నారని.. స్థానికంగా ఉపాధి లేదని నిరుద్యోగ యువత చెబుతున్నారు. అర్హులైనా తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం జగనన్న ముఖ్యమంత్రి కావడమే’ అంటున్నారు అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చింతా అనూరాధ. ఎన్నికల నేప థ్యంలో తన అంతరంగాన్ని ఆమె ఇలా ఆవిష్కరించారు. ‘నాన్న పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా కోనసీమలో రెండేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. రాజకీయాల్లోకి వస్తే మరింత మందికి మేలు చేసినట్టవుతుందని నేను బలంగా నమ్మాను. పైగా నాన్న కోరిక కూడా మేం రాజకీయాల్లో రాణించాలనేదే. కోనసీమలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నా అభివృద్ధి లేదు. రూ.కోట్ల విలువైన ఉత్పత్తులు తరలించుకుపోతున్నా యువతకు ఉపాధి కల్పించడం లేదు. వీరందరికీ న్యాయం చేయాలనే బలమైన సంకల్పంతో ఉన్నాను. సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం వైఎస్ జగన్ వల్లనే సాధ్యమని వైఎస్సార్సీపీలో చేరాను. మహిళల అభ్యున్నతికి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారు. ఆయన ప్రకటించిన సంక్షేమ పథకాల్లో మహిళలకు పట్టంగట్టడమే అందుకు ఉదాహరణ. రాజకీయంగాను సీట్ల కేటాయింపులో మహిళలకు సమున్నత స్థానాన్ని కట్టబెట్టారు. మా తూర్పుగోదావరి జిల్లాలో మూడు ఎంపీ స్థానాలుంటే ఇద్దరు మహిళలకు అవకాశమిచ్చారు. కాకినాడ నుంచి వంగా గీత, అమలాపురం నుంచి నేను వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థులుగా పోటీచేస్తున్నాం. డెల్టాలో సాగుకు భరోసా కల్పిస్తా మా కోనసీమలో నీరెక్కువై ఒకసారి.. నీరు లేక మరోసారి.. ఇలా రెండు పంటలూ రైతులు నష్టపోతున్నారు. గతంలో రైతులు 90 వేల ఎకరాల్లో ‘సాగు సమ్మె’ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితి దేశానికి మంచిది కాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డెల్టా ఆధునికీకరణకు నిధులిస్తే.. టీడీపీ ప్రభుత్వం పనులు చేయించలేదు. రైతులకు కనీస మద్దతు ధర రావడం లేదు. పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. వీటన్నింటిని పరిష్కరిస్తానని జగనన్న హామీనిచ్చారు. వైఎస్సార్ భరోసా ద్వారా రైతుకు ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లపాటు రూ.50 వేలు ఇస్తామని ప్రకటించారు. మద్దతు ధర తగ్గకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. వైఎస్సార్ చేపట్టిన డెల్టా ఆధునికీకరణను పూర్తి చేస్తారు. కొబ్బరి పరిశ్రమలు ఏర్పాటు చేసి 70 వేల మందికి ఉపాధి, రైతుకు లాభసాటి ధర వచ్చేలా చేయాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఎంతో మేలు జరిగేది. హోదా రావాలంటే జగనన్న రావాల్సిందే.. హోదా కోసం తొలినుంచీ పోరాటం చేస్తుంది ఆయనే. మా నియోజకవర్గంలో చమురు సంస్థలున్నాయి. కానీ.. స్థానికంగా సరైన ఉపాధి అవకాశాలు లేవు. చమురు సంస్థల అనుబంధ పరిశ్రమలు మరిన్ని వచ్చేలా, ఇప్పుడున్న సంస్థల్లో స్థానికులకు ఉపాధి లభించేలా కృషి చేస్తాను. చమురు సంస్థల నుంచి మనకు ఎంత శాతం నిధులు రావాలి? ఎంత వస్తోందనే లెక్కలు ఎవరూ చెప్పడం లేదు. రావల్సిన నిధులను సాధించి వాటిని స్థానికాభివృద్ధికి వినియోగించేలా కృషి చేస్తాను. ‘పసుపు–కుంకుమ’ పేరిట మోసాన్ని మహిళలు గుర్తించారు మహిళలే కాదు అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు అందాలంటే జగన్ కావాలి.. జగన్ రావాలి అంటున్నారు. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలోని సంక్షేమ పాలన జగనన్నతోనే సాధ్యం. ఇదే విషయాన్ని నేను ఎన్నికల ప్రచారంలో చెబుతున్నాను. పవిత్రమైన పసుపు–కుంకుమ పేరిట ఎన్నికల సమయంలో చంద్రబాబు చేస్తున్న మోసాన్ని మా ప్రాంత మహిళలంతా గుర్తించారు. జగన్ వస్తేనే మహిళ ఇంటికి మహరాణి అవుతుందని నమ్ముతున్నారు. –నిమ్మకాయల సతీష్‌బాబు, అమలాపురం -
72 ఏళ్లలో నాలుగో నారి
సాక్షి, అమలాపురం టౌన్: అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో గత 72 ఏళ్లలో జరిగిన 15 ఎన్నికల్లో (వీటిలో ఒకటి ఉప ఎన్నిక) మహిళా అభ్యర్థులు ఇప్పటి వరకూ ముగ్గురే పోటీ చేశారు. నాలుగో మహిళా అభ్యర్థిగా ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి చింతా అనురాధ పోటీ చేస్తున్నారు. 1980లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జనతా పార్టీ నుంచి ఈశ్వరీబాయి తొలి మహిళా అభ్యర్థిగా పోటీ చేసి, అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కుసుమ కృష్ణమూర్తి చేతిలో పరాజితులయ్యారు. రెండో మహిళా అభ్యర్థిగా 2003లో ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి భార్య విజయకుమారి టీడీపీ తరఫున పోటీ చేసి ఎంపీ అయ్యారు. 2009 జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపకుడు దివంగత పీవీ రావు భార్య పోతుల ప్రమీలాదేవి పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జీవీ హర్షకుమార్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు నాలుగో మహిళా అభ్యర్థిగా చింతా అనురాధ పోటీ చేస్తున్నారు. ఇప్పటి దాకా పోటీ చేసిన నలుగురు మహిళా అభ్యర్థుల్లో అనురాధే పిన్న వయస్కురాలు. 2009 లో పోటీ చేసిన ప్రమీలాదేవి, ఇప్పుడు పోటీ చేస్తున్న అనురాధ అల్లవరం మండలానికి చెందిన వారే. ఇక్కడ తరుణికి తొలిసారి.. సామర్లకోట (పెద్దాపురం): పెద్దాపురం నియోజకవర్గం ఏర్పడిన తరువాత మొదటిసారిగా ఓ మహిళకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని వైఎస్సార్ సీపీ కల్పించింది. మాజీ మంత్రి, కాకినాడ ఎంపీ తోట నరసింహం భార్య వాణిని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించి తొట్టతొలుతగా ఈ బరిలో మహిళను పోటీకి నిలిపిన ఘనతను సొంతం చేసుకుంది.. పెద్దాపురం నియోజకవర్గం 1952లో ఏర్పడగా మొదటి సారిగా 1955లో ఎన్నికలు జరిగాయి. 2014 వరకూ 13 పర్యాయాలు జనరల్ అభ్యర్థులే పోటీలో ఉన్నారు. బీకాం పూర్తి చేసిన తోట వాణిది రాజకీయ కుటుంబం కావడంతో ఆమె కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో వీరవరం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. వాణి తండ్రి మెట్ల సత్యనారాయణరావు రాష్ట్ర మంత్రిగా పని చేశారు. భర్త తోట నరసింహం ఒక పర్యాయం ఎమ్మెల్యేగా, మరో పర్యాయం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. 2014లో కాకినాడ ఎంపీగా ఎన్నికయ్యారు. -
గొల్లపల్లికి ‘బాబు’ జెల్ల!
అమలాపురం, న్యూస్‌లైన్ : ‘నమ్మిన వారినే మోసగించగలరు’ అంటారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అలా మోసగించే విద్యలో తనకు సాటి లేరంటూ.. ‘నమ్ముకున్న వారినీ’ మోసగిస్తూ పోతున్నారు. అదిగో.. ఆ వరవడిలోనే ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు చంద్రబాబు చేదును చవి చూపించనున్నట్టు పార్టీ వర్గాలే అంటున్నాయి. ‘అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థి గొల్లపల్లే’ నని ఏడాది కింద బాబే స్వయంగా, బహిరంగంగా ప్రకటించారు. ఆ మాటను నమ్మిన గొల్లపల్లి నాటి నుంచీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రచారం చేస్తున్నారు. అయితే.. చాప కింద నీరులా తన ఆశలను వమ్ము చేసే పరిణామాలు చోటు చేసుకుంటున్న వాస్తవాన్ని పసిగట్టలేకపోయారు. ఇచ్చిన మాటకు కట్టుబడడం ఇంటావంటా లేదని చాటుతూ.. చంద్రబాబు ఇప్పుడు అమలాపురం పార్లమెంట్ టిక్కెట్‌ను విశాఖలో సెంట్రల్ కస్టమ్స్‌లో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తూ ఇటీవల వీఆర్ఎస్ తీసుకున్న పండుల రవీంద్రబాబు ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలికి చెందిన రవీంద్రబాబు ఎంబీబీఎస్ తర్వాత ఐపీఎస్ చేసినా అప్పట్లో ఉన్న ఆప్షన్లతో రెవెన్యూ సర్వీసుకు వెళ్లారు. ప్రచారంలో గొల్లపల్లి వెనుకబడ్డారని, పార్టీ ఆశిస్తున్న స్థాయిలో ఖర్చు చేయలేకపోతున్నారని భావించిన అధినేత ఇప్పటికే రవీంద్రబాబుకు టిక్కెట్టు ఖరారు చేశారని తెలుస్తోంది. రవీంద్రబాబు ఉద్యోగానికి రాజీనామా చేసినా సాంకేతిక కారణాలవల్ల ఇంకా ఆమోదం పొందలేదు. ఆ లాంఛనం పూర్తయిన వెంటనే పార్లమెంట్ అభ్యర్థిగా ఆయనను ప్రకటించడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల చంద్రబాబే స్వయంగా గొల్లపల్లికి చెప్పినట్టు సమాచారం. ‘ఆడి తప్పే నేత’ మాట నమ్మడమెలా? ఏడాదిగా ప్రచారం చేస్తున్న తనను పక్కన పెట్టాలన్న నిర్ణయంపై గొల్లపల్లి ఆగ్రహం వ్యక్తం చేయగా, అమలాపురం లేదా రాజోలు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని, పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని బాబు సముదాయించినట్టు తెలిసింది. ‘జనం మధ్యలో పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన దానికే కట్టుబడని బాబు.. వస్తుందో, రాదో తెలియని ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తానంటే నమ్మడమెలా?’ అని గొల్లపల్లి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. గొల్లపల్లి ఎంపిక అనంతరం మిగిలిన నియోజకవర్గాన్ని పొత్తుల్లో బీజేపీకి ఇచ్చే విషయాన్ని పరిశీలించాలనుకుంటున్న సమాచారం. ఇదే జరిగితే అమలాపురం, రాజోలు అసెంబ్లీ స్థానాల నుంచి టిక్కెట్లు తమవేనని నమ్ముతున్న టీడీపీ ఇన్చార్జిలు అయితాబత్తుల ఆనందరావు, బత్తుల రాములకు సైతం మొండిచేయి చూపినట్టవుతుంది. మొత్తం మీద కొత్తవారికి కోరిన వరాలిస్తూ, నమ్ముకున్న వారి నోట కరక్కాయ పెడుతున్న చంద్రబాబు తీరుపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ పరిణామం పార్టీ విజయావకాశాలపై క్రీనీడ కాగలదని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.