సాక్షి, అమలాపురం టౌన్: అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో గత 72 ఏళ్లలో జరిగిన 15 ఎన్నికల్లో (వీటిలో ఒకటి ఉప ఎన్నిక) మహిళా అభ్యర్థులు ఇప్పటి వరకూ ముగ్గురే పోటీ చేశారు. నాలుగో మహిళా అభ్యర్థిగా ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి చింతా అనురాధ పోటీ చేస్తున్నారు. 1980లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జనతా పార్టీ నుంచి ఈశ్వరీబాయి తొలి మహిళా అభ్యర్థిగా పోటీ చేసి, అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కుసుమ కృష్ణమూర్తి చేతిలో పరాజితులయ్యారు.
రెండో మహిళా అభ్యర్థిగా 2003లో ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి భార్య విజయకుమారి టీడీపీ తరఫున పోటీ చేసి ఎంపీ అయ్యారు. 2009 జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపకుడు దివంగత పీవీ రావు భార్య పోతుల ప్రమీలాదేవి పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జీవీ హర్షకుమార్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు నాలుగో మహిళా అభ్యర్థిగా చింతా అనురాధ పోటీ చేస్తున్నారు. ఇప్పటి దాకా పోటీ చేసిన నలుగురు మహిళా అభ్యర్థుల్లో అనురాధే పిన్న వయస్కురాలు. 2009 లో పోటీ చేసిన ప్రమీలాదేవి, ఇప్పుడు పోటీ చేస్తున్న అనురాధ అల్లవరం మండలానికి చెందిన వారే.
ఇక్కడ తరుణికి తొలిసారి..
సామర్లకోట (పెద్దాపురం): పెద్దాపురం నియోజకవర్గం ఏర్పడిన తరువాత మొదటిసారిగా ఓ మహిళకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని వైఎస్సార్ సీపీ కల్పించింది. మాజీ మంత్రి, కాకినాడ ఎంపీ తోట నరసింహం భార్య వాణిని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించి తొట్టతొలుతగా ఈ బరిలో మహిళను పోటీకి నిలిపిన ఘనతను సొంతం చేసుకుంది.. పెద్దాపురం నియోజకవర్గం 1952లో ఏర్పడగా మొదటి సారిగా 1955లో ఎన్నికలు జరిగాయి. 2014 వరకూ 13 పర్యాయాలు జనరల్ అభ్యర్థులే పోటీలో ఉన్నారు.
బీకాం పూర్తి చేసిన తోట వాణిది రాజకీయ కుటుంబం కావడంతో ఆమె కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో వీరవరం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. వాణి తండ్రి మెట్ల సత్యనారాయణరావు రాష్ట్ర మంత్రిగా పని చేశారు. భర్త తోట నరసింహం ఒక పర్యాయం ఎమ్మెల్యేగా, మరో పర్యాయం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. 2014లో కాకినాడ ఎంపీగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment