‘పాల్, పావలా పార్ట్‌నర్‌లతో కావట్లేదని.. కొంగ జపాలు’ | Vijayasai Reddy fires on Chandrababunaidu | Sakshi
Sakshi News home page

‘పాల్, పావలా పార్ట్‌నర్‌లతో కావట్లేదని.. కొంగ జపాలు’

Published Sat, Apr 6 2019 12:53 PM | Last Updated on Sat, Apr 6 2019 1:11 PM

Vijayasai Reddy fires on Chandrababunaidu - Sakshi

సాక్షి, అమరావతి : సీఎంగా ఉండి రాష్ట్రమంతా అట్టుడికి పోవాలని పిలుపునిస్తారా? అంటూ చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌ వి.విజయసాయిరెడ్డి మండిపడ్డారు.మీ వాలకం చూస్తుంటే పోలింగ్‌ను కూడా అడ్డుకునేలా ఉన్నారని ట్విటర్‌లో ధ్వజమెత్తారు. 'ఎన్నికల సభలో కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు నడుం మొత్తం వంచి దీనాలాపన చేసిన వీడియో వైరల్‌గా మారింది. డబ్బు, పచ్చ మీడియా, పాల్, పావలా పార్ట్‌నర్‌ల వల్ల గెలవడం సాధ్యం కాదని అర్థమైనట్టుంది. దొంగ నమస్కారాలు, కొంగ జపాలు చేస్తున్నారు. ఆర్నెల్లు స్నేహం చేస్తే వారు వీరవడం అంటే ఇదేనేమో. చంద్రబాబు యూ-టర్నుల అలవాడు ఆయన పార్ట్‌నర్‌కు వచ్చింది. మొన్నేమో తెలంగాణలో ఆంధ్రా వాళ్లని కొట్టి తరుముతున్నారని అన్నాడు. ఇప్పుడేమో తెలంగాణలో పుట్టనందుకు బాధపడుతున్నారట. ఆంధ్రాలో జన్మించి దురదృష్టవంతుడయ్యాడట.

సీఎంగా ఉండి కేంద్ర సంస్థలకు వ్యతిరేకంగా ధర్నాచేయడం సిగ్గనిపించడం లేదా చంద్రబాబూ. రాష్ట్రమంతా అట్టుడికి పోవాలని పిలుపునిస్తారా? ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించమనే గదా? మీ వాలకం చూస్తుంటే పోలింగ్‌ను కూడా అడ్డుకునేలా ఉన్నారు. ఆరి(ఓడి)పోయే దీపం రెపరెపలాడినట్లు ఉన్నాయి మీ చేష్టలు. ఈసీ మీద యుద్ధం ప్రకటించడమంటే చంద్రబాబు ఓటమిని ముందే అంగీకరించినట్టు. ఏబీ వెంకటేశ్వర్‌ రావును తప్పించినప్పటి నుంచి తనపై అంతా కుట్రలు పన్నుతున్నారని విలపిస్తున్నాడు. నిన్నటి వరకు తను మేనేజ్ చేసిన వ్యవస్థలన్నీ తనకే అడ్డం తిరిగాయనేది అసలు బాధ. రాజమండ్రి ఎంపీగా ఐదేళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప చేసిన సేవేమీ లేక పోవడంతో కోడలు ఓడిపోతుందని తెలసిపోయింది. అందుకే వంద కోట్లు వెదజల్లి ప్రజలను వెర్రి పుష్పాలు చేద్దామనుకుంటున్నారు మురళీ మోహన్. మొన్న పట్టుబడిన 2 కోట్లు ఉల్లిపాయ పొట్టే. వందకోట్లు ఇప్పటికే చేరవేశారు' అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు వంగి వంగి నమస్కారాలు పెట్టిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. మార్కెట్లోకి కొత్తరకం వంగడాలు! అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement