మహానాడు వేదికగా అసత్య ప్రచారం | Ambati Rambabu Comments on TDP Mahanadu | Sakshi
Sakshi News home page

మహానాడు వేదికగా అసత్య ప్రచారం

Published Thu, May 31 2018 3:20 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Ambati Rambabu Comments on TDP Mahanadu - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ మహానాడులో ఒక్క నాయకుడు కూడా నిజాలు చెప్పకుండా అబద్ధాలు ప్రచారం చేశారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. బుధవారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారే మహానాడులో ఆయన్ను పొగడటం విడ్డూరంగా ఉందన్నారు. యూ ట్యూబ్‌లో ఎన్టీఆర్‌ ఇంటర్వూను తిలకిస్తే చంద్రబాబు నిజ స్వరూపం ఏమిటో తెలుస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహానాడు నిర్వహిస్తారని చెప్పిన మరుక్షణమే అమెరికాలోని డల్లాస్‌లో తెలుగు వారు నల్ల చొక్కాలు ధరించి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని గుర్తు చేశారు. 

ప్యాకేజీ అద్భుతమని గత మహానాడులో తీర్మానం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని, కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అద్భుతంగా ఉందని గత ఏడాది మహానాడులో టీడీపీ తీర్మానం చేసిందని అంబటి తెలిపారు. ఇప్పుడు హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు నటిస్తూ చంద్రబాబు మోసగిస్తున్నారని మండిపడ్డారు. చెంచాలాగా వ్యవహరిస్తున్న జేసీ దివాకర్‌రెడ్డి లాంటి వాళ్లు  అధికారం కోల్పోయాక చంద్రబాబును తిడతారని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 25 ఎంపీ స్థానాలు కట్టబెడితే ప్రత్యేక హోదా సాధిస్తానని చంద్రబాబు పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 25 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అవుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ అడ్డగోలుగా విభజిస్తే బీజేపీ, టీడీపీలు సర్వనాశనం చేశాయన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామని, మిగిలిన 2 శాతం హామీలు అమలు చేయకపోవడానికి ప్రతిపక్ష పార్టీ, ప్రధాని మోదీ కారణమని చంద్రబాబు ఆరోపించటం దారుణం అన్నారు. 

మోత్కుపల్లికి జవాబిచ్చే ధైర్యం ఉందా?
చంద్రబాబునుద్దేశించి తెలంగాణ టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై ఒక్క దానికైనా సమాధానం చెప్పే ధైర్యం ఉందా? అని అంబటి సూటిగా  ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ప్రధాని మోదీతో కలిసి తిరిగిన చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై ఆరోపణలు చేస్తూ కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement