సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పొత్తులు లేకుండా సొంతంగా ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం ఎప్పుడూ చేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు పొత్తుల్లేకుండా ఒంటరిగా పోటీచేసి అధికారంలోకి వచ్చిన దాఖలాల్లేవని ఆయన గుర్తుచేశారు. 46సార్లు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే 23చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయన్నారు. కానీ, వైఎస్సార్‌సీపీ మాత్రం వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే కాదు.. ఏ పార్టీతోనూ వైఎస్సార్‌సీపీకి పొత్తు ఉండదని స్పష్టంచేశారు. ప్రజలు వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారని, అలాంటప్పుడు తమకు పొత్తులు అవసరంలేదన్నారు.
విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి దాదాపు అన్ని రాజకీయ పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ఆయన అవసరం తీరాక వారితో తెగదెంపులు చేసుకుని ప్రస్తుతం కొత్త పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉందని.. అయితే, టీడీపీకి పొత్తులు పెట్టుకోవడమే సిద్ధాంతమని విమర్శించారు. చంద్రబాబు ఎంత గగ్గోలు పెట్టినా పొత్తు కోసం ఎవరూ ముందుకు రారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం పెద్దఎత్తున సహాయ సహకారాలు అందించిందని గతంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడేమో నవ నిర్మాణ దీక్షల పేరిట కేవలం బీజేపీ పార్టీ మోసం చేసిందని తిట్టడం తప్ప సాధించేది ఏమీలేదని విమర్శించారు.
ఫ్యూచర్ గ్రూపు, రిలయన్స్‌తో కొత్త కుంభకోణం
రాష్ట్రంలో ఇన్నాళ్లూ మట్టి, ఇసుక, రాజధానిలో భూములు అమ్ముకున్న చంద్రబాబు ఇప్పుడు ఫ్యూచర్ గ్రూపు, రిలయన్స్‌ను అడ్డం పెట్టుకుని మరో కొత్త కుంభకోణానికి తెరతీశారని అంబటి విమర్శించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆయా సంస్థలను తీసుకొచ్చి తద్వారా దోపిడీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆఖరుకు దేవుళ్లకు కూడా కులాలను అంటగట్టే దుస్థితికి టీడీపీ నేతలు వచ్చారంటే పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment