
మీడియాతో మాట్లాడుతున్న అంబటి రాంబాబు (ఫైల్ ఫొటో)
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుష్టపాలనకు చరమగీతం పాడే విధంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర సాగతోందని ఆపార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అని అంబటి పేర్కొన్నారు. నేడు వైఎస్ జగన్ వేస్తున్న ప్రతి అడుగు వైఎస్సార్‌సీపీ విజయాన్ని తెలియచేస్తుందని అన్నారు. ఈ నెల 14,15న అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల పాదయాత్రలు, 16న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చారని అంబటి అన్నారు. గతంలో చంద్రబాబు మాట్లాడుతూ తన శరీరంలో 70 శాతం కాంగ్రెస్ రక్తం ఉంటుందని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలను అహంకారంతో ఇస్తున్నారా? లేక ప్రజలతో మమేకమై ఇస్తున్నారా అని అంబటి నిలదీశారు. నాలుగేళ్లలో చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను పట్టాలెక్కించారు తప్పితే రాష్ట్ర పాలనను కాదని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించాలన్నదే చరిత్రాత్మక అవసరం అని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 650 హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు.
15ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తామని అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదా అని అంబటి చంద్రబాబును నిలదీశారు. రోజుకో మాట మార్చడం చంద్రబాబు నైజం అని మండిపడ్డారు. చంద్రబాబుకు అంతరాత్మ ఉందా..? మాట మీద నిలబడే అలవాటు ఉందా ? అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను అన్యాయంగా తీసుకున్నారని విమర్శించారు. టీడీపీని భూస్థాపితం చేయాల్సిన అవసరం ప్రజలపై ఉందని, దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment