సాక్షి, హైదరాబాద్ : సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, సీఎం చంద్రబాబు నాయుడుల కుట్ర బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్సార్ కుటుంబం మీద కుట్రలు జరుగుతున్న క్రమంలో వైఎస్సార్‌సీపీ పార్టీ పుట్టుకొచ్చిందన్నారు. ఎన్ని కష్టాలు, కుట్రలు ఎదురైనా.. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రజలకు అండగా నిలిచిందన్నారు.
ఇక జేడీ లక్ష్మీ నారాయణ టీడీపీ తరఫున భీమిలీ నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అనుకూల మీడియాలో వచ్చిందని, దీంతో చంద్రబాబు, జేడీల కుట్ర బయటపడిందన్నారు. జేడీ లక్ష్మీనారాయణ అక్కడ ఐజీగా ఉంటూ ఇక్కడ విచారణ జరిపారని, లోటస్ పాండ్‌లో అణువణువు వెతికి ఇక్కడ అనేక గదులు, లగ్జరీ సౌకర్యాలున్నాయని అసత్య ప్రచారం చేశారన్నారు. చంద్రబాబు ఏది చెబితే అది జేడీ చేశారని ఆరోపించారు. ఈ ఇద్దరు ఒక్కటేనని, రహస్యంగా మాట్లాడుకుంటున్నారని, వారి కాల్‌డేటా బయటకు తీయాలని ఆ రోజుల్లోనే తమ పార్టీ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనంతో జేడీ-చంద్రబాబుల కుట్ర బయటపడిందని, ప్రజలంతా గమనించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీని అంతమొందించాలని చాలా ప్రయత్నించారని, చంద్రబాబు, జేడీ తోడు దొంగల్లా వ్యవహరించారని మండిపడ్డారు. ఓటు ద్వారా ప్రజలు వీరిని శిక్షించాలని ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment