సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/కామారెడ్డి/రంగారెడ్డి: ‘రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఒకవైపు మజ్లిస్ కాళ్ల దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన కేసీఆర్.. మరోవైపు పాక్ సైనాధ్యక్షుడిని ఆలింగనం చేసుకున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూను వెనకేసుకొస్తున్న కాంగ్రెస్, ఈ రెండు పార్టీలకు భిన్నంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని దేశ భక్తుల బృందం బరిలో నిలిచింది. ఆ రెండు పార్టీలకు బుద్ధి చెబుతూ దేశ భక్తుల బృందానికి ఆశీర్వాదాలు అందించండి’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ ప్రజలను కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆది వారం మహబూబ్‌నగర్ జిల్లా నారా యణపేట, కామారెడ్డి జిల్లా కేంద్రం, రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లో ‘మార్పు కోసం బీజేపీ’ పేరిట నిర్వ హించిన బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలపై విరుచుకుపడ్డారు.
డబుల్ బెడ్రూం ఇళ్లేవీ..?
నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా సీఎం కేసీఆర్ అబద్ధాల సీఎంగా మిగిలారని అమిత్ షా ఆరోపించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని చెప్పి ప్రజలను మోసగించారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా కేంద్రం 2 కోట్ల ఇళ్లు నిర్మిస్తే తెలంగాణలో ఒక్క ఇల్లు కూడా కేసీఆర్ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. పేద కుటుంబాలకు ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథ కాన్ని కేసీఆర్ తన స్వార్థం కోసం తెలంగాణలో అమ లు చేయకుండా అడ్డుకున్నారన్నారు. పార్లమెంటుతోపాటు అసెంబ్లీకి కూడా ఒకేసారి ఎన్నికలు జరిగితే మోదీ చరిష్మా కారణంగా టీఆర్‌ఎస్ ఓడిపోతుందనే భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, తద్వారా రాష్ట్ర ప్రజలపై రూ. వందల కోట్ల భారం మోపారని అమిత్ షా విమర్శించారు. ప్రజలపై అదనపు భారం మోపిన కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అమరులను విస్మరించిన కేసీఆర్..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలకంగా వ్యవహరించి ప్రాణత్యాగం చేసిన అమరులను కేసీ ఆర్ విస్మరించారని అమిత్‌షా విమర్శించారు. అధికారంలోకి వచ్చాక 800 అమరుల కుటుంబాలకు ఉద్యో గ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారన్నారు. అలాగే దళితుడిని సీఎం చేస్తానని మాటిచ్చి.. తీరా ఆయనే ఆ కుర్చీలో కూర్చున్నారని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకుండా రజాకార్ల వారసులైన మజ్లిస్ నేతల కాళ్ల మీద పడుతున్నారని విమర్శించారు. మజ్లిస్ ఆగడాలను ఎదురించేది బీజేపీ ఒక్కటేనని పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతుందని తెలిపారు. కేసీఆర్ అలుసు చూసుకొనే మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ ‘ఎవరు సీఎం అయినా మా కాళ్ల వద్ద ఉండాల్సిందే’ అని అం టున్నారని చెప్పారు. ‘ముస్లింలకు 12 శాతం రిజర్వే షన్లు ఇస్తానంటున్న కేసీఆర్‌కు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తెలియదా?’అని ప్రశ్నించారు. మతపరమైన రిజర్వేషన్ల ను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేదిలేదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో 4,500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అమిత్ షా పేర్కొన్నారు. సీఎం నియోజకవర్గమైన గజ్వేల్‌లోనే 131 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఖమ్మంలో మద్దతు ధర ఇవ్వాలని అడిగిన రైతుల చేతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని ఎద్దేవా చేశారు.
మల్కాజిగిరిలో రోడ్ షో...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరిలో ఆదివారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో అమిత్ షా పాల్గొన్నారు. ఓల్డ్ సఫీల్‌గూడ నుంచి కృపా కాంప్లెక్స్ వరకు ఈ కార్యక్రమం సాగింది. అయితే సమయం తక్కువగా ఉండటంతో అమిత్ షా ప్రజలకు కేవలం అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆయన ఏమి మాట్లాడకపోవడంతో నాయకులు, కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి, ఉప్పల్ బీజేపీ అభ్యర్థులు రాంచందర్‌రావు, ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌వి విచిత్ర హామీలు..
కాంగ్రెస్ పార్టీ విచిత్రమైన హామీలు గుప్పిస్తోందని అమిత్ షా విమర్శించారు. ‘అధికారంలోకి వస్తే ముస్లింలకు కాంట్రాక్టుల కోసం కోటా, ముస్లింల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రి, చర్చిలు, మసీదులకు ఉచిత కరెంట్, విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే ముస్లింలకు రూ. 20 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామంటోంది. మరి హిందువులు ఏం అన్యాయం చేశారని వారికి ప్రకటించడం లేదు’అని అమిత్ షా ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ముస్లింల ఓటు బ్యాంకు కోసమే పాకులాడుతున్నాయని ఆరోపించారు. కాగా, ఆయా సభల్లో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, నారాయణపేట, దేవరకద్ర, కొడంగల్, మక్తల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కల్వకుర్తి బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment