లక్నో : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కాంగ్రెస్ పార్టీపై వ్యంగాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులతో ‘‘ ఇలు, ఇలు ( ఐ లవ్ యూ అని అర్థం. 1990ల నాటి ప్రసిద్ధ బాలీవుడ్ ప్రేమ గీతం) అంటోందని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులపై బాంబు దాడులు చేయవద్దని, వారితో చర్చలు జరపాలని రాహుల్ బాబా(రాహుల్ గాంధీ) గురువు శాన్ పిడ్రోడా చెప్పారని, కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులపై ప్రేమ చూపిస్తోందంటూ మండిపడ్డారు. ఉగ్రవాదుల తుపాకీ పేలితే మాత్రం తాము బాంబుతోనే సమాధానం చెప్పాల్సివస్తుందని అమిత్‌షా స్పష్టం చేశారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని బాదాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ బాదాన్ అభ్యర్థి సంగమిత్ర మౌర్య తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో ఉగ్రవాదులు భారత జవాన్లను బలితీసుకుంటున్నా ఏనాడూ చర్యలు తీసుకోలేదంటూ మండిపడ్డారు. మౌనీ బాబా(మన్మోహన్‌సింగ్)లా కాకుండా ఉగ్రవాద దాడి(పుల్వామా) జరిగిన 13రోజుల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతీకార చర్యకు దిగి ఉగ్రవాద సిబిరాలను తుడిచిపెట్టిందని చెప్పారు.
మహాకూటమి అధికారంలోకి వస్తే వారంలో ప్రతిరోజూ ఓ కొత్త ప్రధాన మంత్రిని చూడవలసి వస్తుందని ఎద్దేవా చేశారు. దేశాభివృద్ధికోసం పాటు పడుతున్న నరేంద్రమోదీ తమ నాయకుడని, మరోసారి మోదీ ప్రధాని అవుతారని స్పష్టంగా చెబుతానన్నారు. మహాకూటమిలో నాయకుడు ఎవరో చెప్పలేకపోతున్నారని.. సోమవారం మమతాబెనర్జీ, మంగళవారం మాయావతి, బుధవారం చంద్రబాబునాయుడు, గురువారం దేవేగౌడ, శుక్ర, శనివారాల్లో ములాయం సింగ్‌యాదవ్ ఇలా రోజుకో నాయకుడు వెలుగులోకి వస్తుంటారని ఎద్దేవా చేశారు. మహాకూటమి అధికారంలోకి వస్తే దేశ భద్రతకు సంబంధించిన బాధ్యత ఏవరు తీసుకుంటారు?.. ఏ ప్రభుత్వమైనా ఇలా పాలన సాగిస్తుందా అని ప్రశ్నించారు. దేశంలోని ప్రజలందరూ మోదీ మంత్రం జపిస్తున్నారని, మరోసారి నరేంద్రమోదీనే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment