నటించొద్దు.. పోరాటం చేయండి: అమిత్‌ షా | Amit Shah Launches BJP Membership Drive In Telangana | Sakshi
Sakshi News home page

వచ్చేది మనమే

Published Sun, Jul 7 2019 2:05 AM | Last Updated on Sun, Jul 7 2019 5:13 AM

Amit Shah Launches BJP Membership Drive In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిందేనని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఉద్ఘాటించారు. బీజేపీకి ప్రజాదరణ అనూహ్యంగా పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్నారు. ఇదే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని అమిత్‌షా పిలుపునిచ్చారు. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ జయంతిని పురస్కరిం చుకుని శనివారం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శంషాబాద్‌లోని కేఎల్‌సీసీ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అమిత్‌షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిం చారు. ‘ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చా. రాష్ట్ర ప్రజలు మోదీ నాయకత్వానికి మద్దతు పలికారు. ఇక్కడ 20శాతానికిపైగా ఓట్లు రావడంతో బలమైన పార్టీగా అవతరించింది. రాష్ట్ర ప్రజల బతుకులు బాగుపడాలంటే బీజేపీ గెలుపు అవసరం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యం. ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలి. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది. ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చేస్తున్నందునే ప్రజలంతా మూకుమ్మడిగా మోదీకి మద్దతు ఇచ్చారు’అని అమిత్‌ షా అన్నారు. 
 
పటేల్‌ ఆశయాలతోనే.. 
‘నిజాం చేతుల్లోనుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది. తెలంగాణ నిజమైన అభివృద్ధి బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కుప్పకూలిపోయింది. అసలైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటుంది. విజయాలకు పొంగిపోదు. పరాజయాలకు కుంగిపోదు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరుగుతుండడాన్ని ప్రతిపక్ష పార్టీలు తట్టుకోవడం లేదు. కార్యకర్తలే మన పార్టీకి బలం. సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ప్రతి ఇంటికీ ఎల్‌పీజీ సిలిండర్‌ ఇచ్చాం. పేదలందరికీ కూడు, గూడు కల్పించడమే మాలక్ష్యం’అని షా పేర్కొన్నారు. 
 
కేసీఆర్‌ది హింసాత్మక పాలన: లక్ష్మణ్‌ 
తెలంగాణలో హింసాత్మక పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన పొత్తుల్లేకుండా ఒంటరిగా బరిలోదిగి 4 పార్లమెంటు స్థానాల్లో విజయఢంకా మోగించామన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నారు. టీఆర్‌ఎస్‌ నిరంకుశపాలనను బలంగా ఎదుర్కొంటామన్నారు. సభ్యత్వ నమోదును పెద్ద సంఖ్యలో చేపట్టి ప్రతి పోలింగ్‌బూతుకు ఒక సైనిక దళాన్ని సిద్దం చేస్తామని లక్ష్మణ్‌ అన్నారు. 
 
బీజేపీలో చేరిన మాజీ సీఎం నాదెండ్ల 
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు శనివారం బీజేపీలో చేరారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆయన్ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రామ్మెహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, సినీ నిర్మాత బెల్లంకొండ రమేశ్, రామగుండం డిప్యూటీ మేయర్‌ సత్యప్రసాద్, టీడీపీ నాయకులు కోనేరు సత్యనారాయణ, బుక్కా వేణుగోపాల్, వెంకటేశ్వరరావు, మాజీ ఐఏఎస్‌ అధికారి సి.చంద్రవదన్, మాజీ ఎంపీ చాడ సురేష్‌ రెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. వీరందరికీ అమిత్‌షా బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే రాజాసింగ్, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు లోగోనూ, సభ్యత్వ నమోదు మిస్డ్‌కాల్‌ నంబర్‌ను అమిత్‌షా ఆవిష్కరించారు. కొత్తగా సభ్యత్వం తీసుకున్న పలువురికి ఆయన సభ్యత్వ నమోదు పత్రాలను అందించారు. అంతకుముందు హైదరాబాద్‌ చేరుకున్న కేంద్ర హోంమంత్రికి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు సీఐఎస్‌ఎఫ్, రాష్ట్ర పోలీసు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐఎస్‌ఎఫ్‌ అధికారులతో షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమిత్‌ షా వెంట కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి కూడా ఉన్నారు. 
 
గిరిజన మహిళకు సభ్యత్వంతో షురూ! 
మీర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లిలోని రంగనాయకుల కాలనీకి అమిత్‌షా విచ్చేశారు. స్థానికంగా ఉండే గిరిజన మహిళ సోని ఇంటికి చేరుకుని ఆమెకు బీజేపీ సభ్యత్వాన్ని అందజేశారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడి.. జొన్నరొట్టె, ఉప్మా తిన్నారు. అక్కడి నుంచి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మొక్క నాటారు. అక్కడ పార్టీ కార్యకర్తలతో ముచ్చటించిన అనంతరం అమిత్‌ షా.. దేవేందర్‌నగర్‌ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో మరో మొక్కను నాటారు. అక్కడినుంచి శంషాబాద్‌ కేఎల్‌సీసీ కన్వెన్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభకు తరలి వెళ్లాడు. అమిత్‌షా వెంట పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మహేశ్వరం ఇంచార్జ్‌ అందెల శ్రీరాములు యాదవ్‌ తదితరులు ఉన్నారు. 

 నటించొద్దు.. వీధి పోరాటాలు చేయండి 
తెలంగాణలో బీజేపీని బలపర్చేందుకు ప్రజాసమస్యలపై వీధి పోరాటాలు చేయాలని పార్టీ రాష్ట్ర నేతలకు అమిత్‌ షా దిశానిర్దేశం చేశారు. ఏదో చేస్తున్నట్లు నటించొద్దని హెచ్చరిస్తూనే.. పశ్చిమబెంగాల్‌లో పార్టీ బలపడిన తీరును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శనివారం రాత్రి నగరంలోని ఓ హోటల్‌లో పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌లో 40 జిల్లాల్లో తను రాత్రిబస చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల కోసం ఆలోచించకుండా, 51% ఓటు బ్యాంకు లక్ష్యంగా పనిచేయాలన్నారు. కేసీఆర్‌తో ఎలాంటి దోస్తీ లేదని.. రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న అవినీతిపై కేసులు వేయాలని సూచించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు నెలకోసారి రాష్ట్రానికి వస్తానన్నారు. 19% ఓట్లు వచ్చిన ప్రతి రాష్ట్రంలోనూ తర్వాతి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాల్లో గెలవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement