
బీదర్ ర్యాలీలో ప్రసంగిస్తున్న అమిత్ షా
సాక్షి, బెంగళూరు : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బీదర్‌లో నిర్వహించిన ర్యాలీలో షా ప్రసంగించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ గొంతును అనుకరిస్తూ షా మిమిక్రీ చేశారు.
‘‘రాహుల్ బాబాను కదిలిస్తే చాలూ ‘ ప్రధాని గారూ.. ఈ నాలుగేళ్లలో మీరు దేశానికి ఏం చేశారు?’ అని ప్రశ్నిస్తున్నాడు’’ అంటూ రాహుల్ గొంతును షా అనుకరించారు. (దీంతో సభకు హాజరైన వారంతా నవ్వుకున్నారు). ‘కానీ, రాహుల్ బాబా నువ్వు అంతలా ఎందుకు అరుస్తున్నావ్?. పదే పదే ఏం చేశారని మోదీని ఎందుకు ప్రశ్నిస్తున్నావ్? కానీ, ప్రజలు మీ నాలుగు తరాల(కాంగ్రెస్ పాలన)లతో జరిగిన నష్టం వల్లే ఎక్కువ బాధపడ్డారు. ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నారు. మా ప్రభుత్వం ఆ తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కర్ణాటకలో ఈసారి అధికారం బీజేపీదే. ముందు నువ్వు అది తెలుసుకో’ అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి షా పేర్కొన్నారు.
కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నీరవ్ మోదల్, రఫెల్ ఒప్పందం తదితర విషయాల్లో మోదీ మౌనంగా ఉన్నారంటూ రాహుల్ విమర్శలు గుప్పించారు. అంతే కాదు అవినీతి పరులను పక్కనపెట్టుకుని మోదీ అవినీతిపై యుద్ధం అంటూ మాట్లాడం హాస్యాస్పదంగా ఉందంటూ చురకలు అంటించారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన బీజేపీ చీఫ్ అమిత్ షా గత రెండు రోజులుగా ర్యాలీల్లో పాల్గొంటూ కాంగ్రెస్‌కు కౌంటర్ ఇస్తున్నారు.
ఏప్రిల్ 15లోపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన... ఈసీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఏప్రిల్ 15వ తేదీలోపు ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఓం ప్రకాశ్ రావత్ వెల్లడించారు. ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఏప్రిల్ మొదటి వారంలో ఈసీ బృందం పర్యటిస్తుందని.. పరిస్థితులను సమీక్షించి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని తెలిపారు. విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ తెలిపారు. కాగా, మే 28వ తేదీతో కర్ణాటక ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment