సోలాపూర్: అసెంబ్లీ ఎన్నికల ముందు తమ పార్టీ నేతలను బీజేపీలో అక్రమంగా చేర్చుకుంటున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్, ఎన్సీపీలకు హోం మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చురకలంటించారు. బీజేపీ తలుపులు తెరిస్తే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ తప్ప ఎన్సీపీ, కాంగ్రెస్‌ల్లో ఎవరూ మిగలరన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిన మహాజనాదేశ్ యాత్ర ముగింపు కార్యక్రమంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి ఇటీవల పలువురు నేతలు శివసేన బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
ఆర్టికల్ 370 రద్దుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ ఐరాసలో పిటిషన్ వేయడానికి వాడుకుందని, ఇందుకు ఆ పార్టీ సిగ్గు పడాలని అమిత్ షా అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో హింస పెరిగిందని రాహుల్ వ్యాఖ్యానించారని, కానీ అక్కడ ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదని, ఒక్క ప్రాణం పోలేదని అన్నారు. దేశ హితం కోసం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు గతంలో ప్రతిపక్షాలు సహకరించేవని, కాంగ్రెస్ ఆ సంప్రదాయాన్ని మంట కలిపిందని మండిపడ్డారు. దేశ సమగ్రతను, ఏకత్వాన్ని కాపాడేందుకు పార్టీలకు అతీతంగా తమకు అండగా నిలబడాలని కోరారు. (చదవండి: మోదీపై విమర్శలు.. పాక్ మంత్రికి కరెంట్ షాక్!)
Comments
Please login to add a commentAdd a comment