అక్రమాలపై ఆధారాలున్నాయ్‌.. | Amit Shah suggested to the BJP leaders about fight with TDP | Sakshi
Sakshi News home page

అక్రమాలపై ఆధారాలున్నాయ్‌..

Published Tue, Mar 27 2018 1:21 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Amit Shah suggested to the BJP leaders about fight with TDP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి కేంద్ర సాయం విషయంలో బీజేపీని దోషిగా చూపేందుకు చంద్రబాబు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సూచించారు. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పక్కదారి పట్టించింది, ఏ విధంగా అక్రమాలు చేసింది.. అన్న దానిపై పూర్తి ఆధారాలున్నాయని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. టీడీపీపై ఎదురుదాడి చేయాలని, ఏ మాత్రం వెనక్కు తగ్గొద్దని ఆయన సూచించినట్టు సమాచారం. త్వరలో బీజేపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడి నియామకం జరగనున్న నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మాణిక్యాలరావు సోమవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌లతో భేటీ అయ్యారు. ఏప్రిల్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల అనంతరం ఏపీలో పర్యటించేందుకు అమిత్‌ షా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం.

రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం తరువాత జరిగే కార్యవర్గ సమావేశాలకు రాంమాధవ్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీకి కేంద్ర సాయం విషయంలో సీఎం చంద్రబాబుకు అమిత్‌ షా లేఖ రాసిన అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అమిత్‌ షాకు మాణిక్యాలరావు వివరించినట్టు తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడి నియామకం రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో మాణిక్యాలరావు అమిత్‌షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక కార్యవర్గ సమావేశాల సందర్భంగా బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ క్యాడర్‌లో సర్వీస్‌లో ఉన్న ఒక అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి చేరుతారని, అలాగే అసోం క్యాడర్‌కు చెందిన మరో ఐఏఎస్‌ అధికారి బీజేపీలో చేరనున్నారని కొందరు నేతలు వెల్లడిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement