సాక్షి, హైదరాబాద్: సరైన సమయంలో బీసీ పార్టీ ఏర్పాటుపై స్పష్టతనిస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో జరిగిన సంఘం సమావేశంలో ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయినా తెలుగు రాష్ట్రాల్లో బీసీలు సీఎం కాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ణాటక, తమిళనాడు, కేరళ, యూపీ, రాజస్తాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బీసీలు సీఎంలు అయ్యారన్నారు. టీఆర్‌ఎస్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో బీసీలు 20 మందే ఉన్నారని, ఇటు కాంగ్రెస్ లీకులిస్తోన్న జాబి తాల్లోనూ బీసీలకు పెద్దగా ప్రాధాన్యం కన్పించడం లేదని ఆరోపించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే, బీసీలకు రాజ్యాధికారమే ఏకైక మార్గమని తెలిపారు.
మాతో కలసి రండి: బీఎల్‌ఎఫ్
బీసీల ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే ఓ ప్రత్యేక పార్టీ ఉండాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) కన్వీనర్ తమ్మినేని వీరభద్రం, అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ చెప్పారు. అప్పుడే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. కృష్ణయ్య తమతో కలసి రావాలని.. తమ కూటమి తరఫున కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ, కృష్ణయ్యను కూటమి సీఎం అభ్యర్థిగా బలపరుస్తామని, అధిష్టానంతో ప్రకటనకు కృషి చేస్తామని తెలిపారు. అయితే దీనిపై కృష్ణయ్య ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు. తన అనుచరులతో సమావేశమైన తర్వాత తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశంలో టీజేఎస్ నేత విశ్వేశ్వర్, పీసీసీ అధికార ప్రతినిధి మహేశ్‌కుమార్, బీసీ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ నేతలు మల్లయ్య, రాజలింగం తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment