లోక్‌సభలో మాట్లాడుతున్న పర్వేశ్ వర్మ, లోక్‌సభలో మాట్లాడుతున్న ఆధిర్ చౌధరి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక నిరసనలపై, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సోమవారం నాటి లోక్‌సభ సమావేశాలు దద్ధరిల్లాయి. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే కాంగ్రెస్, డీఎంకే సభ్యులు సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నారీల వ్యతిరేక నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. బుల్లెట్లతో ప్రజల గొంతుకను అణచేయలేరని కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధరి వ్యాఖ్యానించారు. ‘మీరు నకిలీ హిందువులు’ అని అధికార పక్షాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో సీఏఏ వ్యతిరేక నిరసనకారులను ఉద్దేశించి ‘ద్రోహులను కాల్చి చంపండి’ అని మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు మండిపడ్డారు. ‘మీ తూటాలెక్కడ?’ అని ప్రశ్నించారు. సప్లిమెంటరీ ప్రశ్నలకు జవాబిచ్చేందుకు ఠాకూర్ ప్రయత్నించిన ప్రతీసారి నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ప్రారంభించేందుకు బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ లేచినపుడు.. ‘సిగ్గు పడు’ అని విపక్ష సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. ‘సీఏఏ నిరసనకారులు మీ ఇళ్లల్లోకి వచ్చి, మీ మహిళలపై అత్యాచారం చేస్తారు’ అని వర్మ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు
వర్మ ప్రసంగం ప్రారంభించగానే.. నిరసనగా కాంగ్రెస్, డీఎంకే సహా విపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం వర్మ మాట్లాడుతూ.. సీఏఏను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని, అది దేశ సమగ్రతకు సంబంధించిన విషయమని తేల్చిచెప్పారు. ‘ఇది రాజీవ్ ఫిరోజ్ ఖాన్ ప్రభుత్వం కాదు.. ఇది మోదీ ప్రభుత్వం’ అని ఇందిరా గాంధీ కుటుంబం ముస్లింలేనని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘షహీన్‌బాగ్ నిరసనలు సీఏఏను వ్యతిరేకిస్తూ చేస్తున్నవి కావు. అక్కడి నిరసనకారులు పాకిస్తాన్ జిందాబాద్ అని, కశ్మీర్‌ను, అస్సాంను భారత్ నుంచి విడగొట్టాలి అని అంటున్నారు’ అని వర్మ పేర్కొన్నారు. మానవత్వ సందేశం ఇచ్చిన రాముడికి కాంగ్రెస్ మతం రంగు పులిమిందని విమర్శించారు. ‘ఇప్పటికైనా ప్రతిపక్ష సభ్యులు జై శ్రీరాం అని నినదిస్తే వారి పాపాలు తొలగిపోతాయి’ అన్నారు.
రాజ్యాంగం తొలి ప్రతుల నుంచి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడి చిత్రాలను కాంగ్రెస్ తొలగించిందని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఆర్టికల్ 370 లాంటి సమస్యలను కాంగ్రెస్ పెంచి పోషించిందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే అనధికార కాలనీల ప్రజలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. వర్మ ప్రసంగంపై టీఎంసీ స్పందిస్తూ.. అది ఢిల్లీ ఎన్నికల ప్రచార ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. జామియా మిలియా యూనివర్సిటీలో సీఏఏ నిరసనకారులను దారుణంగా కొట్టారని గుర్తు చేశారు. ఒక విద్యార్థిని తన కన్ను కూడా కోల్పోయిందన్నారు. ‘అమ్మాయిలను దారుణంగా కొట్టారు. పిల్లలపై తూటాలు ప్రయోగించారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యసభలోనూ...
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు సోమవారం రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ పలుమార్లు వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా బీజేపీ సభ్యుడు భూపేందర్ యాదవ్‌ను అడ్డుకున్నారు. సీఏఏ వ్యతిరేక నిరసనలపై కాల్పులు జరిపిన ఘటనలను కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీ తదితర విపక్ష పార్టీల సభ్యులు తీవ్రంగా ఖండించారు. సభ్యులను శాంతపర్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో డెప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment