
విశాఖపట్నం: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను కూడా కేంద్రం మీద నెట్టి వేస్తే ఎలా అని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సూటిగా ప్రశ్నించారు. విశాఖలో కన్నా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. మార్చి 1న న్యూ కాలనీ రైల్వే గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తున ‘ ప్రజా చైతన్య యాత్ర- సత్యమేవ జయతే’ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. రాష్ట్రానికి నరేంద్ర మోదీ నాయకత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను బహిరంగసభలో వివరిస్తారని చెప్పారు. 2019లో దేశానికి మోదీ రావాలన్న ఉద్దేశ్యంతో ప్రజలంతా రావాలని పిలుపునిచ్చారు.
విశాఖ రైల్వే జోన్ ఖచ్చితంగా తెస్తామని వ్యాఖ్యానించారు. రైల్వే జోన్ కావాలన్న డిమాండ్‌తో బీజేపీ నేతలంతా రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను రేపు కలుస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టలేదని సూటిగా ప్రశ్నించారు. కేవలం పరిశీలించమని మాత్రమే పెట్టారని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పి ప్రజల ముందుకు రావడం కరెక్ట కాదని అభిప్రాయపడ్డారు. పోలవరం ముంపు ప్రాంతాలను కేబినేట్ ద్వారా నరేంద్ర మోదీ కలపకపోతే పోలవరం రాష్ట్రానికి ఒక కలగా ఉండిపోయేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment