
సాక్షి, గుంటూరు: ప్రధాని నరేంద్ర మోదీ సహా ఆయన భార్యపై సైతం విమర్శలు చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును భవిష్యత్తులో కూడా తమ దగ్గరకు రానివ్వమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యమూర్తి అన్నారు. టీడీపీతో కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. చచ్చిపోయిన పార్టీని బతికించుకోవటానికే చంద్రబాబు ఇప్పుడు మోదీపై ప్రశంసలు కురిపిస్తూ నాటకాలకు తెరతీశారని దుయ్యబట్టారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నవంబరులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా టీడీపీకి చెందిన పలువురు నేతలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారని పేర్కొన్నారు. భారీ చేరికల భయంతోనే చంద్రబాబు ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కాగా 2019 ఎన్నికలకు ముందు తాను కేంద్రంతో(పార్టీ పేరు ఎత్తకుండానే) విభేదించామని, ఇదంతా ప్రజల కోసమే చేశామని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రజలు బాగానే ఉన్నారు గానీ.. తాము మాత్రం నాశనమయ్యామని ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా బీజేపీతో పొత్తుకు సిద్ధమనేలా సంకేతాలు వెలువరించారు.
బాబు ప్రస్ట్రేషన్‌లో ఉన్నారు..
ప్రతిపక్ష నేత చంద్రబాబు వీధి రౌడీల భాష మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ఘోర ఓటమితో నైరాశ్యంలో మునిగిపోయిన బాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసు అధికారులను సైతం ఇష్టారీతిన బెదిరిస్తున్నారని... ఆయనపై కేసు పెట్టాలని పేర్కొన్నారు. అధికారంలో ఉండగా ఒకరకంగా.. లేకపోతే ఇంకోలా మాట్లాడటం చంద్రబాబుకు మాత్రమే చెల్లిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment