![AP Ex Chief Secratary Ajay Kallam Slams Chandrababu In Nellore - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/13/Ajay-Kallam.jpg.webp?itok=5rxdFHNO)
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పాలనపై ప్రభుత్వ మాజీ సీఎస్ అజేయ కల్లాం తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులో సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అజేయ కల్లాం చంద్రబాబు చర్యలను తీవ్రంగా విమర్శించారు. ఏపీలో రాజరికపు ప్రజాస్వామ్యం నడుస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాచరికపు పోకడలు వచ్చాయి.. ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలన పెత్తనం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఒక రోజు ఎమ్మెల్యేగా కూడా చేయని వారు మంత్రులు అవుతున్నారని పరోక్షంగా నారా లోకేష్‌ని ఉద్దేశించి అన్నారు. ప్రజాస్వామ్యంలో రాచరికపు వ్యవస్థలకు ప్రజలే చెక్ పెట్టాలని సూచించారు.
తమిళనాడు పుణ్యమా అని సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడం ఇక్కడా వచ్చిందని అన్నారు. రాజకీయాల్లో ఆదర్శవంతమైన నేతలు ఈరోజుల్లో కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్వవస్థలకు స్వతంత్ర కావాలని కోరారు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అసెంబ్లీ అనుమతి లేకుండా రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. కాగ్ తప్పుబట్టినా ఈ విషయాన్ని ఎవరూ ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వాలు చేస్తున్న వేల కోట్ల రూపాయల అప్పులు ఎవరి కోసం చేస్తున్నారో చెప్పాలని సూటిగా అడిగారు.
ప్రజల అభిప్రాయాలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలే పెత్తనం చేస్తున్నాయని ఆరోపించారు. జిల్లాలో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేశారు. సింగపూర్ విమానం కోసం కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. చనిపోయిన రైతులకు ఆదుకోరు కానీ విమాన ప్రయాణానికి రాయితీలు ఆగమేఘాల మీద చెల్లిస్తారని విమర్శించారు.
తెలంగాణాలో డబుల్ బెడ్‌రూం నిర్మాణంలో భాగంగా చదరపు అడుగుకు రూ.800 ఖర్చు అవుతుంటే...ఏపీలో మాత్రం చదరపు అడుగుకు రూ.2700 అయినట్లు ఖర్చు చూపిస్తున్నారని, ఈ విషయంలోనే చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏవిధంగా దోచుకుంటున్నారో అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడానికా ప్రభుత్వం ఉంది అని అజేయ్ కల్లాం సూటిగా అడిగారు.
Comments
Please login to add a commentAdd a comment