సీఈసీ ఆదేశాలు బేఖాతరు | AP Government Controversial Decision Over CEC Orders | Sakshi
Sakshi News home page

సీఈసీ ఆదేశాలు బేఖాతరు

Published Thu, Mar 28 2019 1:54 AM | Last Updated on Thu, Mar 28 2019 9:50 AM

AP Government Controversial Decision Over CEC Orders - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆయనను ఐబీ చీఫ్‌గా తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తున్నట్లు మంగళవారం జీవో (నంబర్‌ 716) ఇచ్చిన ప్రభుత్వం.. మరునాడే ఆ జీవోను రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం జీవో నం బరు 720 జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉన్నతా ధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను ధిక్కరించి మరీ.. ఇంత బాహాటంగా ఒక అధికారిని వెనకేసుకు రావాల్సిన అవసరం ఏముం దనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అధికారుల మాదిరి కాకుండా, అధికార పార్టీకి కొమ్ముకాస్తూ టీడీపీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటూ అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, వైఎస్సార్‌ జిల్లాల ఎస్పీలు ఎ.వెంకటరత్నం, రాహుల్‌ దేవ్‌ శర్మను తక్షణమే బదిలీ చేసి డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేయాలని, వారిని ఎలాంటి ఎన్నికల విధులకు వినియోగించరాదని సీఈసీ ఆదేశించింది.

దీంతో తక్షణమే తదుపరి సీనియర్లకు బాధ్యతలు అప్పగించి విధుల నుంచి తప్పుకుని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ ఆ ముగ్గుర్నీ ఆదేశించారు ఈ మేరకు బదిలీ ఉత్తర్వులు (జీవో నెంబరు 716) జారీ చేశారు. అయితే ఈసీ ఆదేశాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు మింగుడుపడలేదు. ఎన్నికల ప్రక్రియలో టీడీపీ తరఫున అన్నీ తానై వ్యవహరిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావును తప్పిస్తే ఎన్నికల్లో తనకు చాలా ఇబ్బంది కలుగుతుందని చంద్రబాబు భావించారు. ఏం చేయాలనే దానిపై చర్చోపచర్చలు జరిపారు. అప్పటికే బదిలీ ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌ పరువు పోయినా సరే.. వెంకటేశ్వరరావు బదిలీ ఉత్తర్వులను మాత్రం రద్దు చేయాలని, ఆయనను అదే పదవిలో కొనసాగించాలని ముఖ్యమంత్రి హోదాలో అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గిన సీఎస్‌.. ఇంటెలిజెన్స్‌ డీజీ బదిలీని రద్దు చేసి, మిగిలిన ఇద్దరు ఎస్పీల బదిలీలను కొనసాగిస్తున్నట్లుగా పేర్కొంటూ బుధవారం జీవో (నంబరు 720) జారీ చేశారు. 

కొత్త వ్యూహం .. కొత్త జీవో
ఇంటెలిజెన్స్‌ డీజీకి ఎన్నికల విధులతో సంబంధం ఉండదని, ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి రారనే కొత్త వాదనను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. డీజీపీతో, టీడీపీకి చెందిన కొందరు న్యాయవాదులతో మంగళవారం రాత్రి సుదీర్ఘ చర్చలు జరిపిన ముఖ్యమంత్రి సీఈసీ ఆదేశాలను కోర్టులో సవాల్‌ చేయించారు. తమ వాదనను బలపర్చుకోవడం కోసం..అప్పటికప్పుడు వ్యూహరచన చేసి పలానా పోలీసు అధికారులు ఎన్నికల విధుల్లో భాగస్వాములవుతారని, సీఈసీ అజమాయిషీలోకి వస్తారంటూ బుధవారం జీవో నంబరు 721 జారీ చేయించారు. ఈ జీవోలో ఇంటెలిజెన్స్‌ విభాగం ప్రస్తావన లేకుండా చూశారు. అంటే ఇంటెలిజెన్స్‌ డీజీ వెంకటేశ్వరరావు ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి రారని రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ద్వారా కొత్త భాష్యం చెప్పిందన్నమాట. ‘ఎవరెవరు ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వస్తారు? ఎవరు ఎన్నికల విధుల నిర్వహణ కింద ఉంటారనే జీవో ఇంతకాలం ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికల నిబంధనావళి ఈనెల పదో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్నోసార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి. మరి ఎన్నికల నిబంధనలు వచ్చిన వెంటనే గానీ, ముందుగానీ జీవో ఇవ్వని సర్కారు.. ఇప్పుడు ఐబీ చీఫ్‌ వెంకటేశ్వరరావును ఆ బాధ్యతల నుంచి తప్పించాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసిన తర్వాతే ఎందుకు ఇచ్చినట్లు? ఇది ఉద్దేశపూర్వక చర్యే..’ అని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. 

ఆ విషయం సీఈసీకి తెలియదా?
‘‘ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావును తప్పించి పోలీస్‌ హెడ్‌క్వార్టరుకు అటాచ్‌ చేయాలని, ఎన్నికల విధులు అప్పగించవద్దని ఆదేశించిన కేంద్ర ఎన్నికల కమిషన్‌కు.. ఆయన ఎన్నికల పరిధిలోకి వస్తారా? రారా? అనే విషయం తెలియదా? ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్, సీఎస్‌ పునేఠకు తెలిసిన మేరకు ఎన్నికల నిబంధనావళి సీఈసీకి తెలియదా? అసలు వెంకటేశ్వరరావు ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి రారని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే మంగళవారం ఆయన్ను రిలీవ్‌ చేస్తూ ఎలా ఉత్తర్వులు జారీ చేసింది? జీవో ఇచ్చిందంటే సీఈసీ ఆదేశాలు పాటించాల్సిందేనని అనుకున్నట్టే కదా? తెల్లారేసరికల్లా నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారో, సీఈసీ ఆదేశాలను ఎందుకు ధిక్కరించారో ప్రజలందరికీ తెలిసిపోతూనే ఉంది..’ అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

అప్పుడలా .. ఇప్పుడిలా..!
‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి పోలీస్‌ బాస్‌ (డీజీపీ) ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ను తప్పించాలని ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీందో కమిషన్‌ ఆయనను తప్పించి ఏకే మహంతికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. తక్షణమే అప్పటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ మేరకు జీవో జారీ చేసింది. అలాంటిది.. ఇప్పుడు చంద్రబాబు తమ పరిధిలోకి రానివారిని ఎన్నికల కమిషన్‌ ఎలా బదిలీ చేస్తుందనే వాదన తేవడం విచిత్రం. ఎన్నికల విధుల్లో ఉన్న వారినే కాదు. ఎన్నికలను ప్రభావితం చేసే, ఏకపక్షంగా వ్యవహరించే ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు అటెండర్‌ వరకూ) తొలగించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుంది..’ అని మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వివరించారు.

డీజీపీ, సీఎస్‌ ఇద్దరూ ఇరుక్కుంటారు
‘సీఎస్‌ పునేఠ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తు.చ. పాటిస్తూ మంగళవారం ముగ్గురు పోలీసు అధికారులను విధుల నుంచి తప్పించి బదిలీ చేస్తూ జీవో 716 ఇచ్చారు. కానీ చంద్రబాబు ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ‘ఎన్నికల విధుల్లో ఎవరెవరు ఉంటారో డీజీపీ నోట్‌ పంపుతారు. దాని ప్రకారం జీవో జారీచేసి ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలి’ అని కరాఖండిగా చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో సీఎస్‌ జీవో ఇచ్చారు. దీనివల్ల డీజీపీ, సీఎస్‌ ఇద్దరూ ఇరుక్కోక తప్పుదు. ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వారి సర్వీసులో ఇది రిమార్కుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది’ అని ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు వ్యాఖ్యానించారు. గతంలో విశాఖపట్నం కలెక్టరుగా ఉన్న సమయంలో తమకు చెప్పకుండా ఉద్యోగులను బదిలీ చేశారనే ఆగ్రహంతో ప్రవీణ్‌ ప్రకాష్‌ను ఎన్నికల కమిషన్‌ ఎన్నికల విధుల నుంచి తప్పించిన విషయం గమనార్హం. ఆయనపై ఇప్పటికీ ఆ మచ్చపోలేదని మరో అధికారి గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అటెండరు వరకూ ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వస్తారని ఆయన స్పష్టం చేశారు. 

సాక్ష్యాధారాలన్నీ పరిశీలించాకే సీఈసీ చర్య
ఏబీ వెంకటేశ్వరరావుకు పచ్చ చొక్కాపై పోలీసు యూనిఫామ్‌ వేసుకున్న అధికారి అనే పేరుంది. ‘టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నానంటూ నాపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారు అక్కసు వెళ్లగక్కుతున్నారు. మీరు ప్రభుత్వానికి అనుకూలంగా నేను చెప్పే ఆదేశాలను పాటించాలి...’ అని జిల్లా ఎస్పీలు, కలెక్టర్ల సదస్సులోనే ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా ఆయన టీడీపీ నాయకుడిలా పనిచేస్తున్నారని రాష్ట్రంలో ప్రతి అధికారికీ తెలుసు. ఎన్నికల హడావుడి మొదలయ్యాక అది మరింత తీవ్రమయ్యింది. చాలామందితో చర్చలు సాగించి టీడీపీలో చేర్పించారని, కొందరు నాయకులను టీడీపీకి మద్దతు ఇవ్వాలంటూ బెదిరించారని తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు ఉన్నాయి. తన కార్యాలయాన్ని టీడీపీ ఆఫీసుగా మార్చేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. పార్టీ సమర్పించిన సాక్ష్యాధారాలన్నీ పరిశీలించి, ఆయన తప్పు చేసినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఆయన్ను ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా తప్పించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. దీనిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని అధికార వర్గాలు అంటున్నాయి. 

జీవో రద్దు చేయడం తప్పు
ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఎన్నికల కమిషన్‌ అనుమతి లేకుండా రద్దు చేయడం సమంజసం కాదు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు దాని అనుమతి తీసుకోకుండా బదిలీని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం తొందరపాటు చర్య అవుతుంది. ఎన్నికల విధుల్లో ఎవరెవరు ఉంటారు? ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి ఏయే పోలీసు అధికారులు వస్తారనే అంశంపై ముందుగా జీవో ఇస్తే ఇవ్వవచ్చు. అయితే ముగ్గురు అధికారులను బాధ్యతల నుంచి తప్పించి డీజీపీకి అటాచ్‌ చేయాలని ఆదేశాలు జారీ అయిన తర్వాత ఇలా ఎన్నికల విధులపై జీవో ఇవ్వడం సరికాదనేది నా అభిప్రాయం. జీవో ఇచ్చిన సమయం కూడా అనుమానాలకు తావిస్తోంది.
– ఐవైఆర్‌ కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement