
ఏ ఇద్దరు మాట్లాడుకున్నా.. ఏ ముగ్గురు ముచ్చటించినా, ఏ నలుగురు కూడినా ఒకటే చర్చ.. ఎవరు గెలుస్తారు.. ఎవరి మెజార్టీ ఎంత.. అధికారం ఎవరిది.. ఎన్నికలు ముగిశాక ఫలితాలకు సుదీర్ఘ సమయం ఉండడంతో అటు పార్టీల నాయకులతోపాటు ప్రజలకూ టెన్షన్ మొదలైంది. ఫలితాలకు సమయం దగ్గర పడడంతో ఇప్పుడు ఆ టెన్షన్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడ్డాక పరిస్థితులు ఏంటి ? ఎక్కడైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉందా ? అనే అంశాలపై పోలీసులు నిఘా పెట్టారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. ఆ గ్రామాల్లో కదలికలపై ఇప్పటి నుంచే ఓ కన్నేశారు. మరో వైపు జిల్లాకు అదనపు బలగాలు కావాలంటూ ఉన్నతాధికారులు లేఖ రాశారు.
సాక్షి, గుంటూరు: ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలతోపాటు గ్రామాల్లో సైతం వేడి రాజుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత గ్రామాల్లో రెండు, మూడు రోజులపాటు గొడవలు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆయా గ్రామాలపై డేగ కన్ను వేశారు. గొడవలు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై స్థానిక పోలీసు అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదనంగా మరి కొంత బలగాలు కావాలంటూ ఇప్పటికే ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత రూరల్ జిల్లా పరిధిలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
పల్నాడు ప్రాంతంపై నిఘా
గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో పోలింగ్ రోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అవాంఛనీయ ఘటనలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసు శాఖపై మచ్చ పడింది. కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆయా ప్రాంతాల్లో గొడవలు జరిగాయని నిర్ధారించుకున్న ఉన్నతాధికారులు ఇప్పటికే వారిపై చర్యలకు సిఫార్సులు చేశారు. రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలే గొడవలు సృష్టించేలా వ్యవహరిస్తున్న తీరు పోలీసులను కలవరపాటుకు గురి చేస్తోంది.
దీనికి తోడు ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉందంటూ సోషల్ మీడియాలో అన్ని రాజకీయ పార్టీల నేతలు, నెటిజన్‌లు సైతం పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్షన్ గ్రామాలు అధికంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎన్నికల ఫలితాలు రాగానే దాడులు చేసేందుకు గ్రామాల్లోని కొన్ని వర్గాలు సిద్ధమవుతున్నాయనే నిఘా వర్గాల హెచ్చరికతో అప్రమత్తమయ్యారు.
అదనపు బలగాలు
ఇప్పటికే జిల్లాలో ఉన్న 13 ఏపీఎస్‌పీ ప్లటూన్లకు తోడు మరో ఎనిమిది ప్లటూన్ల ఏపీఎస్‌పీ బలగాలను పంపాలంటూ గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ రాజశేఖర బాబు ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా కోరినట్లు తెలిసింది. సమస్యాత్మక గ్రామాలపై పూర్తి స్థాయి నిఘా ఉంచడంతోపాటు గొడవలు సృష్టించే వారి వివరాలు సేకరించి వారికి హెచ్చరికలు జారీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఫలితాలు వచ్చిన తరువాత తమకు ఓట్లు పడలేదనే అక్కసుతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలపై దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమేరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
ఈనెల 23న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పట్టణాలతోపాటు, గ్రామాల్లో సైతం 144 సెక్షన్ అమలులోకి తీసుకొచ్చి గుంపులుగా చేరడం, ఊరేగింపులు, ర్యాలీలు చేపట్టకుండా చూసేలా స్థానిక పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల రోజు గొడవలు జరిగిన ప్రాంతంలో ప్రతిదాడులు జరిగే అవకాశాలు ఉండటంతో ఆయా ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ పోలీసు బందోబస్తును సైతం రెట్టింపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ఇరుపార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూసేలా గ్రామాల్లో పోలీసు అధికారులు పర్యటించాలని సూచిస్తున్నారు. గ్రామాల్లో గొడవలు జరిగితే ఎన్నికల సమయంలో బైండోవర్‌లు చేయించుకున్న నేతలపై కేసులు నమోదు అవుతాయంటూ ముందస్తు హెచ్చరికలు చేస్తున్నట్లు సమాచారం.
కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు
గ్రామాల్లో పరిస్థితి ఇలా ఉంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద సైతం అధికార పార్టీ నేతలు బాహాబాహీకి దిగే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాలకు సమీపంలో గుంపులుగా చేరకుండా కౌంటింగ్ కేంద్రాలకు దగ్గర్లో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాట్లు చేసి తనిఖీలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లతోపాటు, అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాత మాత్రమే లోపలకు అనుమతిస్తారు. బాంబు, డాగ్‌స్క్వాడ్‌ల ద్వారా తనిఖీలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదు
ఎన్నికల ఫలితాలు ముందుగాని, తరువాత గానీ గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే ఉపేక్షించం. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలను గుర్తించి నిఘా ఉంచాం. ఫలితాలు వెలువడే రోజు ఆయా గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాజకీయ పార్టీల నాయకులు సమన్వయంతో వ్యవహరించి శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసు శాఖకు సహకరించాలి.– రాజశేఖరబాబు, రూరల్ ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment