అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి తమపార్టీ పూర్తి మెజార్టీతో అధికారం చేపట్టబోతుందని టీఆర్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భిన్నంగా స్పందించారు. ఫలితాలపై వస్తున్న ఊహాగానాలన్నీ అర్థరహితమని కొట్టిపారేశారు. తుది ఫలితాలు వెల్లడయ్యే వరకు వేచి ఉండాలన్నారు. ఇక ప్రజాకూటమిలో భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ ఆహ్వానించడంపై ఇప్పుడేమీ మాట్లాడలేనన్నారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం టీఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
అయితే ఎన్నికల పోలింగ్ ముందు తమ పార్టీ కింగ్ మేకర్ అవుతుందని తెలిపిన ఎంఐఎం.. టీఆర్‌ఎస్ నేతల తాజా వ్యాఖ్యలపై విభిన్నంగా స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టినా.. మరోవైపు హంగ్ వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్.. తమ పార్టీ ప్రభుత్వంలో కీలకం కానుందని, ఎంఐఎం పార్టీని పక్కనబెడితే టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వడానికి తమకు అభ్యంతరం లేదని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ కాంగ్రెస్ పార్టీ.. ఎంఐఎంను పునరాలోచించుకోవాలని సూచించింది. అయితే టీఆర్‌ఎస్ మాత్రం తమ దోస్తీ మజ్లిస్‌తోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఎంఐఎం మాత్రం ఫలితాలను బట్టి అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు ఒవైసీ తాజా వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఏం జరుగుతుందో తెలియాలంటే ఫలితాలు వెలువడే మంగళవారం వరకు వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment