మా చెయ్యి చూస్తారా! | Astrologers Demand in Lok Sabha Election | Sakshi
Sakshi News home page

మా చెయ్యి చూస్తారా!

Published Fri, Mar 22 2019 11:29 AM | Last Updated on Fri, Mar 22 2019 2:24 PM

Astrologers Demand in Lok Sabha Election - Sakshi

దేశమంతటా ఎన్నికల హడావుడి హోరెత్తుతోంది. ఎలాగైనా గెలవాలని కలలుగంటోన్న బిహార్‌ రాజకీయ నేతల కోలాహలమంతా జాతక మహారాజుల ఇళ్ల ముందుంది. రానున్న ఎన్నికల్లో తమ జాతకం ఎలా రాసిపెట్టి ఉందో తెలుసుకునేందుకు వీరంతా జ్యోతిష్యుల చుట్టూ తిరుగుతున్నారు. రాశి ఫలం, పేరు బలాన్ని బట్టి మంచిచెడులను, లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. కొన్ని వారాలుగా రాజకీయ పండితులూ, రాజకీయ విశ్లేషకులూ ప్రజల నోళ్లలో నానుతూ వచ్చారు. అయితే  ఇప్పుడు వారి స్థానాన్ని జ్యోతిష్యులు ఆక్రమించారు. రాజకీయ నేతల భవిష్యత్తుని ముందుగానే నిర్ణయించే పనిలో వీరు బిజీ అయిపోయారు.

ఎన్నికల తేదీలను ప్రకటించినప్పటికీ అనేక మంది ఆశావహులైన రాజకీయ నాయకులు పొత్తులెలా ఉంటాయోనని ఆందోళనలో గడిపారు. దీన్ని ఆసరాగా చేసుకొని జ్యోతిష్యులూ, హస్తసాముద్రికులూ, భవిష్యవాణిని వినిపించేవారూ ఏ అభ్యర్థి విజయావకాశాలు ఎలా ఉన్నాయో చెబుతూ రాజకీయ నాయకుల్లో ఉన్న ఆందోళనని, భయాన్నీ సొమ్ము చేసుకుంటున్నారు. లోక్‌సభలోకి ప్రవేశించాలని కలలుగనే అభ్యర్థులెందరో వీరిని ఆశ్రయిస్తున్నారు. వారి జయాపజయాలను బేరీజు వేసి, ఆశావహులను మెప్పిస్తున్నారు.

అందరూ వారి చుట్టూనే..
ఈ ఎన్నికల్లో ఎవరికి టికెట్లు వస్తాయి? పార్టీ గుర్తులూ, ఎన్నికల ఒప్పందాలూ, గెలిచే వారెవరు, ఓటమి పాలయ్యేదెవరు? అనే విషయాలపైనే రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే  ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్‌ ఎంపీలు తమ స్థానాలు తమకు దక్కుతాయా? వేరే స్థానాలకు వెళ్లాల్సి వస్తుందా? కొత్త నియోజకవర్గాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలా? అనే విషయాలపైనే తర్జనభర్జన పడుతున్నారు. పట్నాలోని బైద్యనాథ్‌ ఝా శాస్త్రి అనే జ్యోతిష్యుడు ‘ఇప్పుడు తమ దగ్గరికి పలువురు రాజకీయ నాయకులు వస్తున్నారనీ, వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు తమ వైపే ఉండేలా ఏం చేయాలో చెప్పండని మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు’’ అనీ చెప్పారు. ఈ పరిస్థితుల్లో నవగ్రహాలకు పూజలు చేయటమే ముఖ్యమైన కర్తవ్యమని జ్యోతిష్యుడు బైద్యనాథ్‌ వారికి సెలవిస్తున్నారు.

‘‘అన్ని సందర్భాల్లోనూ ఇది అవసరం లేదు. అవసరాన్నీ, సందర్భాన్నీ బట్టి కనీసం సూర్యగ్రహం, గురుగ్రహం లాంటి రెండు మూడు గ్రహాలను సంతృప్తి పరచాలని’’ ఆయన చెబుతున్నారు. అయితే ఈ పూజలకు కనీసం వారం సమయం పడుతుందని, ప్రత్యేక మంత్రోచ్ఛరణలతో ఈ కార్యక్రమం చేపట్టాలనేది ఆయన మాట. కోరుకున్న ఫలితాలను ‘భగలాముఖి’ అనే పూజతో సాధించవచ్చునని ఆయన అంటున్నారు. ప్రత్యర్థిని ఓడించి, తమ కర్తవ్యాన్ని నెరవేర్చుకోవడానికి ఈ పూజ అద్భుతంగా పనిచేస్తుందని, పాట్నా నగరంలో పేరున్న శుక్లా యజుర్వేద అనే వేద పాఠశాల ఉపాధ్యాయుడు అక్షయ్‌ తివారీ అన్నారు. ఈ పూజ పది రోజుల తంతు అనీ, ఖరీదుతో కూడుకున్నదనీ, భారీగా పూజా సామగ్రి అవసరమని ఆయన చెప్పారు. ప్రముఖ రాజకీయ నాయకులెందరో తమ వద్దకు వస్తున్నారనీ, అయితే వారి పేర్లను మాత్రం బయటపెట్టబోమని జ్యోతిష్యులు అంటున్నారు. ఇది తమకు, వారికి మధ్య విశ్వాసానికి సంబంధించిన విషయమని స్పష్టం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement