
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రధాని నరేంద్ర మోదీ కన్నీటి వీడ్కోలు తెలిపారు. వాజ్‌పేయి వంటి అసాధారణ వ్యక్తి ప్రతి భారతీయుడి గుండెల్లో చిరకాలం నిలిచే ఉంటారని ఆయన పేర్కొన్నారు. ‘దేశాన్ని మహోన్నతంగా మార్చడంలో జీవితాన్నే త్యాగం చేసిన వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు సరైన పదాలే లేవు. నేడు దేశం నలుమూలల నుంచి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ అరుదైన వ్యక్తికి నివాళులర్పించేందుకు ఢిల్లీ వచ్చారు. అటల్ జీ దేశం మీకు సెల్యూట్ చేస్తోంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఉదయం తన బ్లాగ్‌లోనూ ‘స్ఫూర్తి, సుహృద్భావం, అద్భుతమైన వాక్చాతుర్యం కలబోసిన మహనీయుడిని దేశం నేతగా ఎంచుకుంది.
దేశం సమస్యల్లో ఉన్నప్పుడు నీతిమంతమైన, స్ఫూర్తిదాయకమైన దీర్ఘదృష్టి గల నేతగా ప్రజలకు సరైన మార్గదర్శనం చేశారు’ అని పేర్కొన్నారు. 1990వ దశకంలో దేశంలో, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక దుర్భర పరిస్థితులున్న సమయంలోనూ.. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడుకొచ్చిన గొప్ప వ్యక్తి, రెండు దశాబ్దాలుగా మనం అనుభవిస్తున్న ఆర్థిక ఫలాలకు ఆయన వేసిన బీజాలే కారణం. వాజ్‌పేయి దృష్టిలో అభివృద్ధి అంటే పేద, బడుగు, బలహీన వర్గాలకు సాధికారత దక్కడమే. ఆయన ఆలోచనలతోనే మా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించుకుని ముందు కెళ్తోంది’ అని పేర్కొన్నారు.
భారతదేశాన్ని అణుశక్తిగా మార్చేందుకు ఎవరినీ లెక్కచేయని ధైర్యవంతుడని కొనియాడారు. ‘వ్యక్తిగతంగా ఆయన నా ఆదర్శం, నా గురువు, నాలో స్ఫూర్తి రగిలించిన అసాధారణ మహనీయుడు. 2001 అక్టోబర్‌లో ఓ రోజు నన్ను పిలిచి.. గుజరాత్ ముఖ్యమంత్రిగా వెళ్లమన్నారు. వ్యవస్థ పరంగా పనిచేశానని.. పరిపాలనలో అనుభవం లేదని చెప్పాను. అయినా నాలో ధైర్యాన్ని నింపి ప్రజల ఆకాంక్షలను పూర్తిచేయాలని చెప్పి పంపించారు. నాపై ఆ నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞుడిని. అందుకే ఆయన చూపిన బాటలో.. ఆయన నేర్పిన విధానాలతోనే మేం ప్రపంచంతో పోటీపడగలుగు తున్నాం’ అని పేర్కొన్నారు. ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని పరిపాలనలో (గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు) ఆయన ఇచ్చిన సూచనలను మోదీ గుర్తుచేసుకున్నారు.
సిమ్లాలో జాతీయ జెండా అవనతం...
వాజ్‌పేయికి నివాళులర్పిస్తున్న అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, పాక్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక తదితర దేశాల ప్రతినిధులు, సుష్మాస్వరాజ్, భూటాన్ రాజు జిగ్మే