ఏ బంధం లేకున్నా ... బలమైన అనుబంధమేదో కలిపింది వీరందరినీ. వాజ్‌పేయితో వ్యక్తిగత అనుబంధం లేకపోవచ్చు. ఆయన్నసలు చూసి కూడా ఉండకపోవచ్చు. కానీ ఆయన చేసిన పనులేవో వారిని తట్టిలేపాయి. ఆయన మాటలేవో వారి మదిని కదిలించాయి. అందుకే జనం తరలి వచ్చారు. కడసారి ఆ మహానేతను చూసిపోదామని వచ్చిన బహుదూరపు బాటసారులెందరో వాజ్‌పేయి ఇంటిముందు బారులు తీరారు. ఎక్కడ నుంచో తరలి వచ్చిన పీహెచ్‌డీ విద్యార్థి ఒకరు.. రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో పనిచేసే రోడ్డు నిర్మాణ కార్మికుడొకరు.. బీహార్ నుంచి వచ్చిన ఓ సివిల్ సర్వీసెస్ విద్యార్థి, ఒక న్యాయవాది..ఉత్తరప్రదేశ్‌నుంచి వచ్చిన వలస కార్మికుడొకరు. వాజ్‌పేయి ఎదిగివచ్చిన సమాజం ఒకవైపూ, వాజ్‌పేయి స్ఫూర్తినొందిన సిద్ధాంతాన్ని విశ్వసించిన ప్రజలు మరోవైపూ, ఏ సంబంధమూ లేని వీరందరినీ 6–ఎ క్రిష్ణ మీనన్ మార్గ్..దగ్గరికి చేర్చేందుకు కారణమయ్యారు అటల్ బిహారి వాజ్‌పేయి. ఒకరికొకరు సంబంధంలేని వేనవేల ప్రజానీకం ఆఖరి చూపుకోసం, తన ప్రియతమ నేత మహాభినిష్క్రమణం వేళ అశ్రునివాళులర్పించేందుకు శుక్రవారం వరకు అక్కడే వేచి ఉన్నారు.
ఆఖరిచూపు కోసం
సైనిక పటాలాలు, సెక్యూరిటీ సిబ్బంది, వ్యక్తిగత రక్షక సిబ్బంది, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ మధ్య 6–ఎ, క్రిష్ణ మీనన్ మార్గ్ వద్ద జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ నుంచి వచ్చిన 52 ఏళ్ళ యోగేశ్ కుమార్, ఆయనతో సహా అనేక మంది 500 కిలోమీటర్ల సుదూర తీరాలనుంచి ప్రయాణించి వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు తెల్లవారేసరికి వాజ్‌పేయి ఇంటి వద్దకు చేరుకున్నారు.
గంగాజలం తెచ్చాను..
‘‘1984లో వాజ్‌పేయి ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ నుంచి గంగోత్రి వెళుతుండగా మార్గం మధ్యలో మొదటిసారి వాజ్‌పేయిని కలిసాను. మళ్లీ రెండేళ్ల తరువాత 1986లో ఉత్తరకాశీలో రెండోసారి వాజ్‌పేయిని చూశానంటూ వాజ్‌పేయితో దిగిన ఫొటోని చూపిస్తూ కనిపించారు యోగేష్ కుమార్. తనతో పాటు గంగోత్రి నుంచి గంగాజలాన్ని తెచ్చాననీ, ఒక్కసారి వాజ్‌పేయి పార్థివ దేహాన్ని చూసే అవకాశం వస్తే చాలన్నారు.
అందరూ ఆయన ఆరాధికులే
‘‘హిందువా, ముస్లిమా అన్నది చర్చనీయాంశం కాదు. ఏ మతానికి చెందిన వారైనా అందరికీ ఆయనపై విశ్వాసం ఉంది. ఆయన జాతిజనులకోసం పరిశ్రమించారు’’అని బిహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి వచ్చిన 49 ఏళ్ళ న్యాయవాది సుధీర్‌కుమార్ ఝా పేర్కొన్నారు.
వార్తల్లో చూసి...
‘‘వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉందన్న వార్త విని నా స్నేహితుడూ, నేనూ కడసారి ఆయన చూడాలని పట్నా నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చాము’’అని ఆశీష్ ఉపాధ్యాయ అనే ఇంజనీర్ తెలిపారు. జామియా మిలియా ఇస్లామియాలో పీహెచ్‌డీ చదువుతున్న దీన్‌నాథ్ గుప్తా అనే విద్యార్థి తాను మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఉన్నాననీ, మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టు తెలిసి తన రీసెర్చ్‌పనిని విడిచి ఎయిమ్స్‌కి వచ్చినట్టు తెలిపారు.
ఆయన కవిత్వమే నాకు స్ఫూర్తి
వాజ్‌పేయే కవిత్వమే తనకు స్ఫూర్తి అని సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న రాహుల్ అహ్వద్ అంటారు. 2013, 2015లో రెండుసార్లు వాజ్‌పేయిని చూశానంటారు. అప్పుడు కూడా ఆయన ఆరోగ్యంగా లేరని, చివరిసారిగా ఆ మహానేతని ఒకసారి చూడాలని వచ్చినట్లు చెప్పారు. ‘‘వాజ్‌పేయి అన్ని పార్టీలతో సత్సంబంధాలు నెలకొల్పారు. అందరి మన్ననలూ అందుకున్నారు’’అన్నారు రాహుల్ అహ్వద్.
ఓ మంచి మనిషి...
‘‘నేను స్కూల్లోనూ, కాలేజీలోనూ చదువుకునేటప్పుడు వాజ్‌పేయి గురించి తెలుసుకున్నానని, ఆయన్ని గురించి చదివానని చెప్పిన 19 ఏళ్ళ బిపిన్ కుమార్ ‘‘వాజ్‌పేయి ఓ మంచి మనిషి’’అంటారు. అసంఘటిత రంగ కార్మికుడి నుంచి సంఘటిత ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల వరకూ అందరూ తమ అధినేతకు అశ్రునివాళులు అర్పించామన్న సంతృప్తితో వెనుదిరిగారు. వాజ్‌పేయి మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. వాజ్‌పేయితో కలసి పనిచేయడం మరిచిపోలేని అనుభవం. దేశ ప్రజలంతా అమితంగా ఆరాధించే మాజీ ప్రధాని, విభిన్న జాతీయ నేత, ఆధునిక భారత రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయి. స్వాతంత్య్ర సమరయోధుడిగా, రచయితగా, కవిగా, ఎంపీగా, పరిపాలకుడిగా, చివరకు ప్రధానిగా ప్రజా జీవితంలో ఆయన ఎన్నో పాత్రలు పోషించారు. ఆయన మరణం దేశానికే కాదు ప్రపంచమంతటికీ లోటు
– రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
వాజ్‌పేయి అస్తమయంతో ఒక శకం ముగిసిందని అందరూ అంటున్నారు. అయితే నేను మాత్రం భావించడం లేదు. ఆయనతో పాటు మరికొందరు వేసిన పునాదిపై నిర్మితమైన ఆ శకం కొనసాగింపుగా నేను భావిస్తున్నాను. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మొదటి కొన్ని దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యమే కొనసాగింది. దానికి ముగింపు పలుకుతూ వాజ్‌పేయి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపారు. అడ్వాణీతో కలిసి కేంద్ర, రాష్ట్రాల్లో రెండో తరం నేతల్ని తయారు చేసిన ఘనత వాజ్‌పేయిదే.
– కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ
వాజ్‌పేయి మరణంతో దేశం ఒక మహాపురుషుడిని కోల్పోయింది. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా దేశ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. మానవత్వానికి ప్రతీక అటల్ జీ. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నా.
– గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్
దేశాభివృద్ధికి, జాతీయ సమస్యల పరిష్కారానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చూపిన బాట నేటికికూడా అనుసరణీయమే. 1975లో నేను కరీంనగర్ జన్‌సంఘ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాజ్‌పేయితో ఏర్పడిన బంధం ఆయన మంత్రివర్గంలో చోటు దక్కేస్థాయికి చేరింది. నా కూతురి వివాహానికి హాజరై ఆశీర్వదించారు. మనం స్నేహితులను మార్చుకోవచ్చుకానీ పక్కింటివారిని మార్చుకోలేమని అనేవారు. ఆ దృక్పథంతోనే పాక్ విషయంలో ఆయన నిర్ణయాలు తీసుకున్నారు.
– మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు
దేశంలో మలిదశ సంస్కరణలకు ఆద్యుడు వాజ్‌పేయి. టెలికమ్యూనికేషన్స్ రంగంలో, జాతీయ రహదారులు, హరిత విమానాశ్రయాలు, సూక్ష్మ నీటిపారుదల రంగాల్లో వాజ్‌పేయి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎంతో హుం దాగా నడుపుతూ మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయనకు ఆయనే సాటి. ఆయన వ్యక్తిత్వం, విలువలు ఎవరికీ లేవు.
– ఏపీ సీఎం చంద్రబాబు
అజాత శత్రువు అయిన వాజ్‌పేయి మరణం దేశానికి తీరని లోటు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎంతో సమర్థవంతంగా వాజ్‌పేయి నడపగలిగారు. ఎవరినీ శత్రువులా చూడకుండా అన్ని పార్టీల అభిమానాన్ని ఆయన సంపాదించగలిగారు.
– టీఆర్‌ఎస్ ఎంపీలు కేకే, జితేందర్‌రెడ్డి
రాజకీయ విలువలను కాపాడుతూ వాజ్‌పేయి తీసుకున్న నిర్ణయాలు నేటి తరానికి ఆదర్శం. వాజ్‌పేయి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.
– దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్
ఏ బంధమో...
Published Sat, Aug 18 2018 4:56 AM | Last Updated on Sat, Aug 18 2018 5:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment