సిహోర్(మధ్యప్రదేశ్): పుల్వామా ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ హస్తం ఉందని మిజోరం మాజీ గవర్నర్, కాంగ్రెస్ నేత అజీజ్ ఖురేషీ సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పుల్వామా దాడికి మోదీ ప్లాన్ చేశారని వ్యాఖ్యానించారు. మోదీ కుట్రకు ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. మధ్యప్రదేశ్‌లో అత్యధిక లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. 27 స్థానాల్లో 20కిపైగా సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. భోపాల్‌లో దిగ్విజయ్ సింగ్‌పై పోటీకి బీజేపీకి అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఓటమి ఖాయమన్న భయంతో ఇక్కడ బీజేపీ వెనుకడుగు వేస్తోందన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ఓటు అడిగే హక్కు కమలనాథులకు లేదన్నారు. బీజేపీ పాలనలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని, దీంతో నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ మధ్య ‘మ్యాచ్ ఫిక్సింగ్’లో భాగంగానే పుల్వామా దాడి జరిగిందని కాంగ్రెస్ నాయకుడు బీకే హరిప్రసాద్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లితోపొరా ప్రాంతంలో ఆత్మాహుతి దాడి చేయడంతో 40 మంది సీఆర్ఫీఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే-ఈ-మహ్మద్ ప్రకటించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment