
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలను ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదని, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ల సమ్మతి మేరకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో కూడా తమకు బాగా తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా మంది నాయకులు సిద్ధంగా ఉన్నారని, అయితే ఎవరిని, ఎప్పుడు చేర్చుకోవాలనేది సంప్రదింపుల కమిటీ నిర్ణయిస్తుందన్నారు. ఎన్నికల సమయంలోనే పొత్తులపై చర్చ ఉంటుందని, అప్పటి అవసరాలకు అనుగుణంగా ముందుకు పోతామని ఆయన చెప్పారు.
సోనియా గాంధీని అమ్మా బొమ్మా అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ.. అవగాహన ఉన్నవాళ్లెవరూ అలా మాట్లాడరని, అవసరం ఉన్నంతవరకు అమ్మా అని, తరువాత బొమ్మ అనడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పార్టీకి నష్టం కలిగించకుండా నాయకులందరూ వ్యవహరించాలని సూచించారు. పార్టీ ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగుతుందని, అయితే, బస్సుయాత్ర, పాదయాత్రలు ఎప్పుడు ఎలా ఉంటాయనేది పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా చెప్తారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ జనాల్లోనే ఉంటుందని భట్టి చెప్పారు.
ఆ కాలేజీలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు
విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్న నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని భట్టి ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీలో ఆ కాలేజీల అక్రమాలు బయటపడ్డాయని, వెంటనే ఆ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment