సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ బీసీ నేతలు
సాక్షి, హైదరాబాద్ : ‘రాష్ట్రంలో 52 శాతం జనాభా మాదే. మా వర్గాలకు చెందిన కార్యకర్తలే పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. పార్టీ జెండాను తరాల నుంచి మో స్తున్న మాకు తగిన ప్రాధాన్యం కల్పించాలి.పీసీసీ అధ్యక్షులుగా బీసీ నేతలున్నప్పుడే పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తించాలి. పీసీసీ అధ్యక్ష పదవితో పాటు ఏఐసీసీ కమిటీల్లో తెలంగాణకు చెందిన బీసీ నేతలకు అవకాశమివ్వాలి. అన్ని పార్టీ కమిటీల్లోనూ మాకు జనాభా ప్రాతిపదికన పదవు లు కేటాయించాలి. తద్వారా బీసీల పక్షాన కాంగ్రెస్ నిలబడుతుందని రాష్ట్రంలోని ఆ వర్గం ప్రజలకు భరోసా ఇవ్వాలి.’అని రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలు డిమాండ్ చేశారు.
మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో 100 మందికి పైగా బీసీ నేతలు భేటీ అయ్యారు. ఏఐసీసీ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు డాక్టర్. పులిజాల వినయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్. దాసోజు శ్రావణ్‌కుమార్, కాసాని జ్ఞానేశ్వర్‌లతో పాటు పీసీసీ కార్యవర్గ స భ్యులు, పలువురు డీసీసీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు.
సమావేశంలో భాగంగా పూలేకు నివాళులర్పించిన అనంతరం రాష్ట్ర కాంగ్రెస్‌లో బీసీలకు సాధి కారత అనే అంశంపైనే ఎక్కువగా చర్చిం చారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ బీసీలకు ఏదో చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోందని, కొందరికి మంత్రి పదవులు, ఎంపీలుగా అవకాశాలిస్తోందని, బీజేపీ కూడా బీసీ నేతను రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడంతో పాటు జాతీయ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసి బీసీ వర్గాలను ఆకర్షితులను చేసుకునే ప్రయత్నం జరుగుతోందని, ఇలాంటి సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ కూడా బీసీలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది.
వారి సమస్యలపై పార్టీ పక్షాన ప్రభు త్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని, పార్టీ కార్యక్రమాల్లో బీసీలను విస్తృతంగా భాగస్వాములు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. అనంతరం పార్టీని అధికారంలోకి తీ సుకురావాలంటే బీసీ లకు సాధికారత ఇవ్వాలని, టీపీసీసీ అధ్యక్ష పదవితో పాటు అన్ని పార్టీ పదవుల్లో వారికి ప్రాధాన్యం కల్పించాలని, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాలని, బీసీ క్రీమీలేయర్ ఎత్తివేయాలని, సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సమావేశం తీర్మానించింది.
Comments
Please login to add a commentAdd a comment