
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగాన్ని మారుస్తామంటూ మాట్లాడిన కేంద్రమంత్రి అనంత్‌కుమార్ విచ్ఛిన్నకర శక్తి, దేశద్రోహి అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. గాంధీభవన్‌లో గురువారం మాట్లాడుతూ జాతికి పునాదులేసిన అంబేడ్కర్ ఆలోచనా విధానం ప్రశ్నార్థకంగా తయారైందని పేర్కొన్నారు. అనంత్‌కుమార్‌ను కేంద్రమంత్రి వర్గం నుంచి తప్పించాలన్నారు. అన్ని కులాలను, మతాలను ఏకతాటిపైకి తెచ్చి, మార్పు దిశగా నడిపించే శక్తి ఒక్క కాంగ్రెస్ మాత్రమేనన్నారు.
సామాజిక మార్పు కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. లౌకికవాదమనే బలమైన పునాదులతో కాంగ్రెస్ నిర్మాణం జరిగిందని చెప్పారు. జాతి సమగ్రతను కోరుకునే వారందరికీ కాంగ్రెస్ పుట్టిన రోజు ఓ పండుగ అన్నారు. అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా భిన్నత్వంలో ఏకత్వం కోసం కాంగ్రెస్ పాటుపడుతోందని పేర్కొన్నారు. రాజకీయ విలువలతో పాటు సామాజికంగా, ఆర్థికంగా తీసుకువెళ్తున్న పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు.
అనేకరకాల పేదరిక, కులం, మతం వంటి ఎన్నో సామాజిక రుగ్మతలపై పోరాడిన చరిత్ర అని వివరించారు. బెనర్జీ నేతృత్వంలో ప్రారంభమై మహాత్మా గాంధీ, నెహ్రూ, నేతాజీ, లజపతిరాయ్, తిలక్, ఇందిరా వంటివారి ఆలోచనలను పుణికిపుచ్చుకున్న రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. పోలీసుల వలయంలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యం, శాంతిభద్రతలు లేవకపోవడంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పెట్టుబడిదారులు భయపడుతున్నారని చెప్పారు. ఏ లక్ష్యాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో వాటికి వ్యతిరేకంగా పాలన ఉందని విమర్శించారు. ఓయూలోకి వెళ్లి మాట్లాడటానికి భయపడటం వల్లే అక్కడ నిర్వహించాల్సిన సైన్స్ కాంగ్రెస్‌ను రద్దు చేశారని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, నేతలు కమలాకర్‌రావు, కుసుమకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment