సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను చేసిన డేటా కుంభకోణం బట్టబయలు కావడంతో వారం రోజులుగా తీవ్రంగా క్షోభకు గురవుతూ.. తానేం చేస్తున్నాడో తెలియని వింత పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఉత్తుత్తి హడావుడి చేస్తూ 48 గంటల్లోనే రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను (సిట్‌లను) ఏర్పాటు చేయడమే అందుకు నిదర్శనమని చెప్పారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం బుగ్గన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వ సమాచారాన్ని దొంగిలించారంటూ అందిన ఫిర్యాదుపై విచారణకు రవాణాశాఖ అదనపు డీజీపీ స్థాయి అధికారి బాలసుబ్రమణ్యం నేతృత్వంలో ఒక సిట్‌ను, ఏపీలో అర్హుల ఓట్ల గల్లంతుకు కుట్ర పన్నారనే నెపంతో వారిని గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం మరో సిట్‌ను నియమించిందన్నారు. ఫారమ్-7 అంటే ఎన్నికల అధికారులకు అందించే అర్జీ అని మాత్రమే అర్థమని, ఓటు నమోదు సమయంలో ఆ వ్యక్తి అర్హుడు కాదని తెలపడం, ఆయనకు ఓటు ఉండరాదని చెప్పేందుకు చేసే దరఖాస్తే ఫారమ్-7 అని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఏపీలో లక్షల్లో బోగస్ ఓట్లు నమోదయ్యాయని, దొంగ ఓట్లు ఉన్నాయని తమ పార్టీ ముందు నుంచీ చెబుతోందని.. అలాగే డూప్లికేట్ ఓట్లు మరిన్ని లక్షల్లో ఉన్నాయని అన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించాలని చెప్పి పలువురు ఫారమ్-7ను అప్‌లోడ్ చేస్తున్నారని చెప్పారు. ఫారమ్-7 ఇవ్వడం తప్పు కానే కాదని ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓ వైపు చెబుతూంటే.. మరో వైపు చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఫారమ్-7 ఇచ్చిన వారిపై 322 కేసులను నమోదు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారమ్-7 దాఖలు చేస్తున్న వారిపై చీటింగ్ కేసు (సెక్షన్-419) తప్పుడు సమాచారం అందించారన్న నేరం(సెక్షన్-182), ఐటీ చట్టం-66-డి సెక్షన్‌లో ఉపయోగిస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్ రాకుండా ఉండేందుకే ఐటీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారని తప్పుడు ఆలోచనతో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసు కేసులు పెట్టేలా చూస్తున్నారన్నారు.
చంద్రబాబు ఎక్కడుంటే అక్కడకు కేసులు బదిలీ చేయాలా?
ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా తాను దొరికి పోయినపుడు తెలంగాణ పోలీసులు కేసు పెడితే అది తెలంగాణ పరిధిలోకి రాదని, ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని చంద్రబాబు ఆనాడు వాదనలు వినిపించిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబుకు ఒక చట్టం, మరొకరికైతే మరో చట్టమా? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డేటా స్కాం విచారణకు తెలంగాణ ప్రభుత్వం 9 మందితో సిట్ వేస్తే చంద్రబాబు కూడా 9 మందితో సిట్‌ను ఏర్పాటు చేశారని, తెలంగాణ ప్రభుత్వం ఒక సిట్‌ను వేస్తే పోటీ పడి చంద్రబాబు రెండు సిట్‌లను వేసి పోటా పోటీగా వ్యవహరిస్తున్నారని అన్నారు. స్కాంకు పాల్పడిన ఐటీ గ్రిడ్స్ కంపెనీపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తే..దానిని అమరావతికి బదిలీ చేయాలని చంద్రబాబు అనడం ఏమిటన్నారు. అంటే దేశంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎక్కడ ఏ ఘటన జరిగినా ఆ కేసును అమరావతికి బదిలీ చేయాలనేది చంద్రబాబు వాదనా? తనకు నచ్చిన పోలీసులతో.. తనకు నచ్చిన విధంగా డీజీపీతో దర్యాప్తు చేయించాలన్న ఆలోచనా?అని ఆయన ప్రశ్నించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు ఫిర్యాదు చూస్తే ఆశ్చర్యమనిపిస్తోందన్నారు. గత నెల 23న డేటా స్కాంపై హైదరాబాద్ పోలీసులు విచారణ ప్రారంభించారని.. అదే రోజు గుంటూరు, తుళ్లూరులో ఐటీ గ్రిడ్స్, టీడీపీలకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని కళా ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు.
సేవామిత్ర యాప్‌ను ఎందుకు మార్చారు?
ఏపీకి చెందిన డేటా కనుక ఏపీ పోలీసులే విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ వాదనగా ఉందని, అసలు సమస్య డేటా ఏ ప్రభుత్వ పరిధిలోనిది అనేది కాదని, ప్రజలకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే ప్రజల డేటాను దొంగతనం చేసిందనేది ఇక్కడ కేసని ఆయన తెలిపారు. టీడీపీ సర్కారే తన రాజకీయ ప్రయోజనాల కోసం డేటాను రెండు ఐటీ కంపెనీలకు ఇచ్చిందన్నారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్‌నాయుడు పరిధిలోనే డేటా స్కాం చోటు చేసుకుంటే ఆయనెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. స్కాం బయట పడగానే సేవామిత్ర యాప్‌ను మార్చారని, ఫొటోలను ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు. టీడీపీ సర్కారు డేటా స్కాం వింటేనే ఒళ్లు జలదరిస్తోందని ఓ వ్యక్తి ఫోన్‌లో చేసిన వ్యాఖ్యలను బుగ్గన మీడియాకు వినిపించారు.
ఐటీ గ్రిడ్ సీఈవో దాకవరపు అశోక్‌ను ఎందుకు టీడీపీ సర్కారు దాచేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం 2017-18 మధ్య కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన లక్షలాది ఓట్లను తొలగించిందని చెప్పారు. ఉదాహరణకు చంద్రగిరి నియోజకవర్గంలో రెండు దశల్లో మొత్తం ఏడు వేల ఓట్లు తొలగించారని.. వాటికి సంబంధించిన వెరిఫికేషన్ నివేదికలున్నాయా? అని అడిగారు. 175 నియోజకవర్గాల్లో ఇలా..ఇంకెన్ని ఓట్లను తొలగించారోననే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. డేటా స్కాంకు చంద్రబాబు పాల్పడింది చాలక దీన్ని రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నారని, తన పాపాలను అందరికీ అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని బుగ్గన మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా ఇసుక, మట్టి, మందు, కబ్జాలు, పర్సంటేజీలు, భూఆక్రమణలు ఇలా పంచ భూతాలను దోపిడీ చేసిన చంద్రబాబు తాజాగా సైబర్‌క్రైంకు సైతం పాల్పడ్డారన్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదల అవుతోందని భావించి ఒకే రోజున వంద జీవోలు జారీ చేశారనీ ఆయన విమర్శించారు.
ఆ సినిమాలు రెండూ పోయాయి..
ఎన్నికలకు ముందు తీసిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో చంద్రబాబును మంచి వ్యక్తిగా చిత్రీకరించారని అందుకే ఆ రెండూ దారుణంగా బాక్సాఫీసు దగ్గర బోల్తాపడ్డాయని బుగ్గన అన్నారు. దివంగత ఎన్టీ రామారావే ఈ రెండు చిత్రాల్లో కథా వస్తువే అయినా చంద్రబాబును మంచి వ్యక్తిగా చూపించినందువల్ల ప్రజలు ఆ రెండు చిత్రాలను తిరస్కరించారన్నారు. ప్రజలకు మంచి చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి చెందిన ‘యాత్ర’ చిత్రం ప్రజల్లో మంచి ఆదరణ పొందిందన్నారు. దీనిని బట్టే రాష్ట్ర ప్రజల మూడ్ ఏ విధంగా ఉందో అర్థం అవుతోందన్నారు. చంద్రబాబు గురించి టీడీపీ నేతలకు పూర్తిగా తెలిసిపోవడంతో ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
ఇవి చదవండి :
సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..!
Comments
Please login to add a commentAdd a comment