ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు అంధ ఓటర్లకు విషమ పరీక్ష పెట్టబోతున్నాయి. రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)కు 12 బ్యాలెట్ యూనిట్లతో అనుసంధానం చేసి ఎన్నికలు నిర్వహించనున్నారు. సాధారణ భాషలతో పాటు బ్రెయిలీ లిపిలో ముద్రించిన బ్యాలెట్ పత్రాలను బ్యాలెట్ యూనిట్లలో పొందుపరిచి ఎన్నికలు నిర్వహిస్తున్నా కూడా అంధ ఓటర్లకు కష్టాలు తప్పేలా లేవు.
ఒక్కో బ్యాలెట్ యూనిట్‌లో 16 మంది చొప్పున 12 బ్యాలెట్ యూనిట్లలో 185 మంది అభ్యర్థుల పేర్లు, వారికి సంబంధించిన ఎన్నికల చిహ్నాలు పొందుపరిచి ఉంటాయి. నిజామాబాద్ లోక్‌సభ స్థానంలోని పోలింగ్ కేంద్రాల్లో ఆంగ్ల అక్షరం ‘ఎల్’(ఔ) ఆకారంలో బ్యాలెట్ యూనిట్లను పేర్చి ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. రహస్య ఓటింగ్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో కంపార్ట్‌మెంట్‌లోకి ఓటరును మాత్రమే అనుమతిస్తారు.
అంధ ఓటర్లు కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాక ఒక్కో బ్యాలెట్ యూనిట్‌ను చేతితో స్పృశిస్తూ అభ్యర్థుల పేర్లను చదివి చివరకు తాము ఓటు వేయాలనుకున్న అభ్యర్థిని గుర్తించాల్సి ఉంటుంది. ఇలా ఏకంగా 12 బ్యాలెట్ యూనిట్లపై ఉండే 185 అభ్యర్థుల పేర్లు, ఆ తర్వాత ఉండే నోటా ఆప్షన్‌ను బ్రెయిలీ లిపి ద్వారానే గుర్తించాలి. ఈ ప్రక్రియలో కొంచెం పొరపాటు జరిగినా కూడా ఓటేయాలనుకున్న అభ్యర్థికి కాకుండా వేరే వారికి ఓటు పడే ప్రమాదం ఉంది.
ఇదే జరిగితే చాలా మంది అంధ ఓటర్ల ఓట్లు తారుమారు అవుతాయి. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 4,215 మంది అంధ ఓటర్లున్నట్లు గుర్తించారు. అంధ ఓటరుకు సహాయకుడిగా వెళ్లిన వ్యక్తి ఓటు రహస్యాన్ని కాపాడుతానని మాట ఇవ్వాల్సి ఉంటుంది. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా అంధ ఓటర్లకు తోడుగా సహాయకులను అనుమతించాలని ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే పోలింగ్ రోజు ఈ నిబంధనను ఎన్నికల సిబ్బంది అమలు చేసే అవకాశముంది. లేదంటే ప్రిసైడింగ్ అధికారులు సహాయకులను అనుమతించడానికి నిరాకరించే ప్రమాదముంది.
Comments
Please login to add a commentAdd a comment