మంది మాటలు నమ్మకండి.. ఆగమైతరు: కేసీఆర్‌ | Telangana CM KCR Election Campaign At Nizamabad | Sakshi
Sakshi News home page

మంది మాటలు నమ్మకండి.. ఆగమైతరు: కేసీఆర్‌

Published Tue, Mar 19 2019 8:07 PM | Last Updated on Tue, Mar 19 2019 9:34 PM

Telangana CM KCR Election Campaign At Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: దేశాన్ని 60 ఏళ్లు​కు పైగా పాలించిన కాంగ్రెస్‌, బీజేపీ విధానాల కారణంగా ప్రజలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల కాలంలో సరైన వ్యవస్థను ఏర్పాటుచేయలేకపోయారని గత పాలకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 54 ఏళ్లు కాంగ్రెస్‌, 11 బీజేపీ ఏళ్లు దేశాన్ని పాలించాయని, వారి పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు. ఈ స్థితిలో దేశ వ్యాప్తంగా మార్పు రావాలని, ఆ పులికేక తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభంకావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి మన దేశానికి ఉందని, కానీ వారి దరిద్రపుగొట్టు పాలన కారణంగా యువశక్తిని వినియోగిచుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే చైనా, జర్మనీ, జపాన్‌ వంటి దేశాల గురించే మాట్లాడుకునే పరిస్థితిని గత పాలకులు తీసుకువచ్చారని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఈనెల 21న లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ మంగళవారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త ఆర్థిక వ్యవస్థ, రాజ్యాంగంలో సవరణలు, నీటివిధానంలో సమూలు మార్పులు రావాలని ఆయన స్పష్టం చేశారు. రోజు మైకులు పగిలేలా మాట్లాడే ప్రధాని నరేంద్ర మోదీ, నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో నిందితులుగా ఉన్న రాహుల్‌, సోనియా గాంధీ వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. రామజన్మ భూమిపై టీఆర్‌ఎస్‌ స్టాండ్‌ ఏంటనీ బీజేపీ ప్రశ్నించడంపై కేసీఆర్‌ ఘాటుగా స్పందించారు. బీజేపీ ప్రజల కోసం పనిచేసే పార్టీనా లేక జన్మభూములు, రామమందీరాల పంచాయతీలు చేసే పార్టీనా అని ప్రశ్నించారు. మీరొక్కరే హిందూవులు కాదని.. తామంతా హిందువులమనే చెప్పుకొచ్చారు. 



సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘2001లో తొలిసారి నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరేశారు. జిల్లా పరిషత్‌ స్థానాన్ని కైవసం చేసుకుని.. తెలంగాణ  ఉద్యమాన్ని నిలబెట్టిన గడ్డ ఇది. సమైఖ్య పాలనలో శ్రీరాంసాగర్‌ పూర్తిగా ఆగమైంది. తెలంగాణ ప్రజల కష్టాలను చూసి 1996లో శ్రీరాం సాగర్‌ కట్టమీద కూర్చోని చాలా బాధపడ్డాం. అప్పుడే చెప్పా.. తెలంగాణ ఉద్యమాన్ని నేనే ప్రారంభిస్తా అని. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాం. కొద్దిరోజులుగా జిల్లాలోని ఆర్మూర్‌ ఎర్రజొన్న రైతులు ఆందోళన చేస్తున్నారు. మీ అందరికీ న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎలాంటి ప్రకటన చేయ్యలేకపోతున్నా. మందిమాటలు నమ్మి ఆగంకావొద్దు. ఎన్నికల అయిపోయిన తరువాత అభివృద్ధి చేసేది మన ప్రభుత్వమే. ఎన్నికల కోసం కాంగ్రెసోళ్లు వంద మాటల చెప్తరు. వారి మాటలు నమ్మకండి. ఆగమైతరు. 

ఆర్మూర్‌ నియోజకవర్గంలో కొత్త మండలాలు కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. వాటిని కూడా ఏర్పాటు చేస్తాం. మొన్న కరీంనగర్‌ సభలో నేను మాట్లాడుంటే కాంగ్రెస్‌, బీజేపీ పీఠాలు కదిలిపోత్తున్నాయి. నిజాలు మాట్లాడితే అలానే ఉంటుంది. మహారాష్ట్ర చెందిన కొన్ని గ్రామాల వారు వాళ్లని కూడా తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అర్థం అవుతుంది. మన ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో. దేశంలో 52 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. దానిలో 4 లక్షల మంది మన తెలంగాణలో ఉన్నారు. వారిని ఇన్నేళ్లు ఎవ్వరూ పట్టించుకోలే.. వారిని అందుకున్నది టీఆర్‌ఎస్‌ మాత్రమే’’ అని అన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement