ప్రధాని కావాలనే కోరిక లేదు.. | I Have No Desire To Become A PM Says KCR | Sakshi
Sakshi News home page

ప్రధాని కావాలనే కోరిక లేదు..

Published Wed, Apr 3 2019 12:48 AM | Last Updated on Wed, Apr 3 2019 8:44 AM

I Have No Desire To Become A PM Says KCR - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/భువనగిరి : భారత ప్రధాని కావాలన్న కోరిక తనకు లేదని.. అయితే ఎన్నికల్లో పార్టీలు కాకుండా ప్రజల అభీష్టం గెలవాలని టీఆర్‌ఎస్‌ చీఫ్, సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. వరంగల్‌ అజాంజాహీ మిల్లు మైదానంలో మంగళవారం ఏర్పాటు చేసిన లోక్‌సభ ఎన్నికల భారీ బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. కేంద్రంలోనూ ప్రాంతీయ పార్టీల పెత్తనం ఉంటేనే రాష్ట్రాల సమస్యలు తీరుతాయన్న కేసీఆర్‌.. రాహుల్‌గాంధీ, ప్రధాని మోదీపై మండిపడ్డారు. 73 ఏళ్ల స్వతంత్ర భారతంలో 66 ఏళ్లు కాంగ్రెస్, బీజేపీలే పరిపాలించాయని, అయినా దేశంలోని సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ వినియోగించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. దేశంలోని వనరులన్నీ ప్రజాసంక్షేమం కోసం వినియోగంలోకి తేలేని దద్దమ్మలు.. ఎన్నికలొచ్చే సరికి ఒకరి మీద ఒకరు పెడబొబ్బలు పెడుతున్నారని విమర్శించారు.

రాహుల్, మోదీల కొట్లాట వెనుక..
‘రాహుల్‌ గాంధీ, నరేంద్ర మోదీల కొట్లాట వెనుక కిటుకుంది. ఇవాళ వీరిద్దరూ మాట్లాడేవి వింటే మీకే అర్థమవుతుంది. నువ్వు ఆ చోర్‌ అంటే.. నువ్వు పక్కా చోర్‌ అని కొట్లాడు తున్నరు. మనం ఆగం కావాలనేదే వారి కిటుకు. దయచేసి మీరు శాంతంగా ఆలోచించండి. ఇన్నేండ్లు దేశాన్ని పరిపాలించింది ఆ రెండు పార్టీలే కదా. మరి దేశాన్ని ఎవడో పాలించినట్టు, దానికి జిమ్మేదారీ వేరేవాడన్నట్టు మాట్లాడుతున్నరు. వీళ్లకు వీళ్లే తూ కిత్తా.. మై కిత్తా అనుకోవాలి.. మనం బఫూన్‌గాళ్లలాగా ఇద్దర్లో ఎవరికో ఒకరికి ఓటు గుద్దాలి. మళ్లా ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి, ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి.. ఎవడో ఒకడు అధికారంలోకి రావాలి, అంతేనా? అది కాదు మిత్రులారా.. ఆ ఇద్దరు సన్నాసులు మనకు వద్దే వద్దే’అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘వచ్చే ఎన్నికల్లో మోదీని దించుతం. రాహుల్‌ను ఎక్కిస్తం కావచ్చు ప్రజలకు ఏమి వస్తది.

దేశానికి ఏం వస్తది. ఏం మార్తది. దీన్‌దయాళ్, శ్యాంప్రసాద్‌ముఖర్జీ పేర్లుపోయి. మళ్లా ఈ గాంధీ.. ఆ గాంధీ అని పేర్లు వస్తయి. అంతకు మించి మన ప్రజలకు ఏం రాదు’అన్ని ఆయన అన్నారు. కాంగ్రెసోడితోని, బీజేపీ వాడితోని పంచాయితీ ఎందుకని తను అనుకుంటే.. భరతం పడతా అని ఒకరు.. నీ కథ గురించి విప్పుతా అని ఇంకొకరు బెదిరిస్తున్నారని, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని సీఎం అన్నారు. వాళ్ల తాటాకు బెదిరింపులకా మనం భయపడేది అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతల విమర్శలపై కేసీఆర్‌ ఘాటుగా స్పందించారు. ‘2001ల నేను కూడా ఎందుకు ఈ పంచాయితీ అనుకుంటే. తెలంగాణ రాష్ట్రం రాకపోవు. ఎవడో ఒకడు నోరు తెరవాలి కాబట్టి నేను తెరిచిన. గులాబీ జెండా ఎగరేసిన. మీరంతా జమైండ్రు. గుద్దుడు గుద్దితే తెలంగాణ వచ్చింది. అట్లనే దేశం కూడా మారాలి. దేశంలో ప్రబలమైన గుణాత్మకమైన రాజకీయ మార్పురావాలి. వరంగల్‌ జిల్లా చైతన్యవంతమైన జిల్లా. ఉద్యమంలో ప్రాధాన పాత్ర పోషించిన జిల్లా. ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నట్లు గెలుపులో అగ్రభాగానా ఉండాలే. వరంగల్‌ ప్రజలకు కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదు’’అని సీఎం అన్నారు.
 
మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘ఓవైపు ప్రధాని నరేంద్రమోదీ, మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రానికి వచ్చి రూ.35వేల కోట్లు ఇచ్చినమని ప్రగల్భాలు పలుకుతున్నారు.. ఎవరి డబ్బుతో ఎవరు బతుకుతున్నారో బీజేపీ సమాధానం చెప్పాలి. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. జీఎస్టీ, ఆదాయపన్ను అన్నీ కలిపి కేంద్రానికి రూ.లక్ష కోట్లు ఇస్తున్నం. ఇందులో ముష్టి రూ.24 వేల కోట్లు మాత్రమే ఢిల్లీ నుంచి మనకు వస్తున్నయ్‌. వాస్తవాలు కప్పిపుచ్చి ఇక్కడికి వచ్చి అవాక్కులు, చెవాక్కులు పేలుతున్నరు. అబద్దాలు ఆడుతున్న నరేంద్రమోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’అంటూ కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.

ఢిల్లీ మనల్ని సాదడం లేదని, మనమే ఢిల్లీని సాదుతున్నామని, చిన్న చిన్న సమస్యల పరిష్కారం కూడా కేంద్రం దగ్గరే ఉన్నాయని, గడ్డివాము దగ్గర కుక్కలాగా, వాళ్లు చేయరు.. మనల్ని చేయనీయరని సీఎం ధ్వజమెత్తారు. ఈసారి దేశంలో కాంగ్రెస్, బీజేపీ లేని కూటమి రావాలన్నారు. కాంగ్రెసేతర, భాజపాయేతర కూటమే కేంద్రంలో అధికారంలోకి రానుందని జాతీయ ఛానెళ్లు చెబుతున్నాయని.. 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే దేశ దశదిశను మార్చే రాజకీయాలు చేస్తామన్నారు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పేద దళితులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి అభ్యున్నతి కోసం కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమి లేదన్నారు. ఏ,బీ,సీ,డీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో మూడుసార్లు ఆమోదం తెలిపితే కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.
 
ఒక్క తెలంగాణలోనే 24 గంటల విద్యుత్‌
విద్యుత్‌ తలసరి వినియోగంలో తెలంగాణయే నంబర్‌ వన్‌ అని కేసీఆర్‌ అన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో వ్యవసాయానికి 24గంటలు ఉచితంగా విద్యుత్‌ ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. ఒక్క విద్యుత్‌ విషయంలోనే కాదు అనేక అంశాల్లో మనమే అగ్రస్థానంలో ఉన్నామన్నారు. వరంగల్‌కు ఆరోగ్య విశ్వవిద్యాలయం తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు. అలాగే దేవాదుల ద్వారా 75టీఎంసీల నీళ్లు వస్తున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా భూ సంస్కరణలు అమలు చేశామన్నారు. సంక్షేమ రంగంలో దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని, వచ్చే నెల నుంచి రెట్టింపు పింఛన్లు ఇస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు జూలై మాసానికల్లా పూర్తవుతుందని, ఆ ప్రాజెక్టు పూర్తయితే కాళేశ్వరం దగ్గర బటన్‌ ఆన్‌చేస్తే ఎస్సారెస్పీ కాలువల్లో ఏడాదంతా నీళ్లుంటాయని అన్నారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు 95–98% పూర్తయ్యిందని, ఏప్రిల్‌ నెలాఖరు నాటికి ఇంటింటికి నల్లా ద్వారా రక్షిత మంచినీరు సరఫరా అవుతుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

వరంగల్‌ జిల్లాకు 70 టీఎంసీల నీరు ఆందుబాటులో ఉండే విధంగా బ్యారేజీలు పూర్తయ్యాయని, దేవాదుల ప్రాజెక్టు సైతం పూర్తి కావొస్తుందని అన్నారు. ‘తెలంగాణలో 16ఎంపీ సీట్లు గెలుచుకోవాలే. ప్రాంతీయ పార్టీలే దేశాన్ని పాలించాలే. ఢిల్లీని మనమే శాసించాలే’అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతారావు, బండ ప్రకాష్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌ భాస్కర్, డాక్టర్‌ తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్, మాజీ మంత్రి బస్వరాజ్‌ సారయ్య, జెడ్పీ చైర్మన్‌ గద్దల పద్మ, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మ, గుండు సుధారాణి పాల్గొన్నారు.
 
 పాకిస్తాన్‌ను కంట్రోల్‌ చేసే దమ్ములేదు!
‘పాకిస్తాన్‌ను కంట్రోల్‌ చేసే దమ్ము లేదు. జల విధానం బాగా లేదు. విద్యుత్, వ్యవసాయ, ఆర్థిక విధానం లేదు’అని భువనగిరి సభలో కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఈ దేశం గతి మార్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఈ దేశం బాగుపడటం కోసం వైతాళికుడు రావాలి. 16సీట్లు గెలిస్తే ఢిల్లీ గద్దెను శాసించే బాధ్యత నాది’అని ఓటర్లను అభ్యర్థించారు. రామ జన్మభూమి, కంస జన్మభూమి, రావణ జన్మభూమి, సూర్పణక జన్మభూమి, సీతమ్మవారి జన్మభూమి మాట్లాడటానికి వీరెవరని బీజేపీని దుయ్యబట్టారు. వాటిని చూసుకోవడానికి శంకారాచార్యులు, జీయర్‌స్వామి, పీఠాధిపతులు, మఠాధిపతులు ఉన్నారన్నారు. నేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, రైతుల సమస్యలను రాజకీయ నాయకులు పట్టించుకోవాలన్నారు. ప్రధానమంత్రి హోదాను మరిచి సర్పంచ్‌ స్థాయికి దిగజారి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారన్నారు.

దేశంలో 50% పైగా ఉన్న బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరితే చేయలేకపోయారన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ యువ సంపద ఉన్నా.. దాన్ని వినియోగించుకోవడంలో విఫలమయ్యారన్నారు. చైనా వారి దేశ యువత మేధాశక్తిని ఉపయోగించుకోవడం ద్వారానే అభివృద్ధి చెందిన దేశాల్లో రెండోస్థానంలో ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులు గెలిస్తే ఢిల్లీలో గులాంలు, బానిసలుగా ఉంటారే తప్ప ప్రజలకు చేసేది ఏమీ ఉండదన్నారు. మన బతుకులు మారాలని.. తాను పెట్టిన పోలికేకతో ఢిల్లీ పీఠాలు కదులుతున్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీల దరిద్రం దేశానికి పోవాలన్నారు. ఇద్దరు సన్నాసులు లేని ఇండియా కావాలన్నారు. ఐదేళ్లలో తెలంగాణలో చేసిన అభివృద్ధిపై దమ్ముంటే భువనగిరి చౌరస్తాలోకి చర్చించుకోవడానికి రావాలని కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. పదేళ్ల దాకా అందరికీ రైతుబంధు ఇస్తామన్నారు. ప్రధానికి సంకల్పం ఉంటే రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పెట్టలేరా అని ప్రశ్నించారు. ఈదేశం గతిని మార్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఎక్కడో పిడికిలి ఎత్తితే తప్ప చైతన్యం వచ్చే పరిస్థితి లేదన్నారు.

ప్రాంతీయ పార్టీల కూటమి ఈదేశంలో అధికారంలోకి రావాలన్నారు. విద్యావంతుడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్, నల్లగొండ అభ్యర్థి వేంరెడ్డి నర్సింహారెడ్డిలను గెలిపించాలన్నారు. ఈసభలో విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర సమన్వయకర్త గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, గాదరి కిశోర్, ముత్తిరెడ్డి యాదిరెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement