సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి లోక్‌సభ సెగ్మెంట్ల ప్రచార ప్రక్రియను వేగవంతం చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో వారి సెగ్మెంట్లలో భారీ ఆధిక్యం వచ్చేలా వ్యూహం అమలు చేయాలి.
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం ఖాయమని, 16 లోక్‌సభ స్థానాల్లో తమ అభ్యర్థులు గెలుస్తారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ విజయం నమోదు చేస్తామన్నారు. పోలింగ్ నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ఓటింగ్ శాతం పెరిగేలా చూస్తే మంచి ఆధిక్యంతో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని అన్నారు. ఉగాది పండుగ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం, శనివారం ఎలాంటి ప్రచార కార్యక్రమాలను పెట్టుకోలేదు. ప్రచారానికి విరామం ఇచ్చిన కేసీఆర్ శుక్రవారం కొద్దిసేపు టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లొచ్చారు. అంతకుముందు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల ప్రచార వ్యూహంపై పలువురు ముఖ్యనేతలతో సమీక్షించారు.
సెగ్మెంట్ల వారీగా..
నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితులు, ఓటర్ల వైఖరి, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల పరిస్థితి.. ఇతర పార్టీల బలా బలాలు ఏమిటనే విషయంపై నిర్వహించిన సర్వేల నివేదికలను పరిశీలించారు. లోక్‌సభ సెగ్మెంట్ల ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులతో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలింగ్ నిర్వహణ విషయంలో అసెంబ్లీ ఎన్నికల తరహా విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ముందుగా అనుకున్న ప్రకారం రాష్ట్రంలోని.. 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుస్తున్నారని చెప్పారు. మెదక్, వరంగల్,
కరీంనగర్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్ గెలుస్తుందని.. మిగిలిన పది స్థానాల్లోనూ చెప్పుకోదగని ఆధిక్యం వస్తుందని తెలిపారు. 16 స్థానాల్లో గెలుపుపై ఎలాంటి సందేహాలు లేవని, అయితే పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి అలసత్వం వద్దని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రులు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇంచార్జీలకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ బాధ్యులు సమన్వయంతో పని చేసి భారీ ఆధిక్యం వచ్చేలా చూసుకోవాలని సూచించారు.
గ్రేటర్‌లో జోరు పెంచాలి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్, చేవేళ్ల, మల్కాజ్‌గిరి లోక్‌సభ సెగ్మెంట్ల ప్రచారం ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. నగర ప్రాంతాలు కావడం వల్ల అందరు ఓటర్లను స్వయంగా కలిసే అవకాశం ఉండదని, వీలైనంత వేగంగా ప్రచారం చేయడం వల్ల ఎక్కువ మందిని చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో వారి సెగ్మెంట్లలో భారీ ఆధిక్యం వచ్చేలా వ్యూహం అమలు చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ సోమవారం ప్రచారం నిర్వహించనున్నారు. చేవేళ్ల లోక్‌సభ సెగ్మెంట్ ఎన్నికల ప్రచారసభ సోమవారం వికారాబాద్‌లో జరగనుంది. భారీ స్థాయిలో ఈ సభ నిర్వహించేలా టీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేస్తోంది.
ఆదిలాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ సీఎం కేసీఆర్ ప్రచార బహిరంగసభ నిర్వహణపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. చివరిరోజు ఆదిలాబాద్ సెగ్మెంట్‌లో సభ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారమే ఈ సెగ్మెంట్‌లోనూ సభ ఉంటుందని ఆ జిల్లా ముఖ్యనేతలు చెబుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ ఏరోజు సీఎం కేసీఆర్ ఆదిలాబాద్ సెగ్మెంట్‌లో ప్రచారం నిర్వహిస్తారు. అయితే దీనిపై టీఆర్‌ఎస్ అధిష్టానం అధికారిక ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment