సాక్షి, హైదరాబాద్: పదహారు లోక్‌సభ సెగ్మెంట్లలో గెలుపే లక్ష్యంగా ప్రచార వ్యూహం అమలు చేస్తున్న టీఆర్‌ఎస్.. అన్ని స్థానాల్లోనూ భారీ మెజారిటీ సాధించాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 88 స్థానాలను గెలుచుకుంది. అధిక శాతం స్థానాల్లో భారీ మెజారిటీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసిన పటిష్టమైన వ్యూహాన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో అన్ని సెగ్మెంట్లను భారీ మెజారిటీతో గెలుచుకోవా లని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సం క్షేమ పథకాలతోపాటు.. కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తామనే నినాదాలతో టీఆర్‌ఎస్ ప్రజలలోకి వెళ్లింది. పోలింగ్ తేదీ దగ్గరపడిన నేపథ్యంలో పటిష్టమైన ఎన్నికల వ్యూహం అమలుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం, పోలింగ్‌పై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శనివారం పలువురు మంత్రులతో ఫోన్‌లో సమీక్షించారు. లోక్‌సభ స్థానాల వారీగా పార్టీల పరిస్థితిని వివరించారు. ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాన్ని వారికి తెలియజేశారు. అనుకున్నట్లుగానే టీఆర్‌ఎస్ 16 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్‌కు పరిస్థితి అంతా అనుకూలంగా ఉందంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ ఇచ్చే పరిస్థితుల్లోనే లేదని చెప్పారు. అన్ని సెగ్మెంట్లలో విజయం ఖాయమని.. మెజారిటీ కోసం ఐదారు సెగ్మెంట్లలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. టీఆర్‌ఎస్ వరుసగా గెలుస్తున్న నియోజకవర్గాల్లో రికార్డు మెజారిటీ సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలని ఆదేశించారు.
ఎక్కడెక్కడ.. ఎలా ఉంది?
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 11 చోట్ల గెలిచింది. నాగర్‌కర్నూల్, నల్లగొండ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. సికింద్రాబాద్‌లో బీజేపీ, హైదరాబాద్‌లో మజ్లిస్, ఖమ్మంలో వైఎస్సార్‌సీపీ, మల్కాజ్‌గిరిలో టీడీపీ గెలిచాయి. మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్ రెండో స్థానంలో నిలిచింది. నల్లగొండలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి మూడో స్థానం దక్కింది. ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాల్లో టీఆర్‌ఎస్ నాలుగో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నాగర్‌కర్నూల్‌లో 16,676 ఓట్లతో, మల్కాజ్‌గిరిలో 28,166 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఈ రెండు సెగ్మెంట్లను ఈసారి మంచి ఆధిక్యంతో గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగానే ఎన్నిక వ్యూహం అమలు చేస్తోంది. గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన నల్లగొండపైనా ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. నాలుగో స్థానానికే పరిమితమైన ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాలను టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఖమ్మం స్థానాన్ని గెలుచుకుంటేనే టీఆర్‌ఎస్ విజయం పరిపూర్ణమవుతుందని టీఆర్‌ఎస్ భావిస్తోంది.
నేడు నిర్మల్.. రేపు వికారాబాద్
సీఎం కేసీఆర్ ఆదివారం నుంచి మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉగాది పండగ కారణంగా శుక్రవారం, శనివారం ప్రచారానికి విరామం ఇచ్చారు. ఆదిలాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌లోని నిర్మల్‌లో ప్రచారసభలో ఆయన పాల్గొననున్నారు. చేవేళ్ల లోక్‌సభ సెగ్మెంట్ ఎన్నికల ప్రచారసభ సోమవారం వికారాబాద్‌లో జరగనుంది. ఈ సభను భారీస్థాయిలో నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ సభతో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముగించే అవకాశం ఉంది. ప్రచార గడువు ముగిసే చివరిరోజైన మంగళవారం సీఎం కేసీఆర్ కార్యక్రమాల షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.
2014లో టీఆర్‌ఎస్ గెలిచిన స్థానాల్లో మెజారిటీ
లోక్‌సభ మెజారిటీ
మెదక్ 3,97,029
వరంగల్ 3,92,574
పెద్దపల్లి 2,91,158
కరీంనగర్ 2,04,652
ఆదిలాబాద్ 1,71,290
నిజామాబాద్ 1,67,184
జహీరాబాద్ 1,44,631
చేవెళ్ల 73,023
మహబూబాబాద్ 34,992
భువనగిరి 30,544
మహబూబ్‌నగర్ 2,590
Comments
Please login to add a commentAdd a comment