
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా నేతృత్వంలోని ప్రత్యేక బృందం సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. ఉమేశ్ సిన్హా రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండగా, ప్రత్యేక బృందంలో ఈవీఎంల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుధీర్ జైన్‌తోపాటు మరికొందరు ఈవీఎంల నిపుణులు ఉన్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రధాన పార్టీలతోపాటు 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎం–3 రకం అధునాతన ఈవీఎంలు అవసరమవుతాయని ఎన్నికల సంఘం గుర్తించింది.
అయితే ఈ నెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈఈవీఎంలను సమకూర్చుకోవడంలో ఉండే సాధ్యాసాధ్యాలపై సోమవారం రాత్రి ఎన్నికల సంఘం ప్రత్యేక బృందం చర్చించి, నివేదిక రూపొందించనుంది.మంగళవారం చెన్నైలో జరిగే కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో ఈ నివేదికపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా 11వ తేదీ నాటికి ఈవీఎంలు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేనిపక్షంలో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఎన్నికను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment