కవిత, మధు యాష్కీ , నామినేషన్ వేసిన ఓ రైతు
వ్యవసాయ ప్రధానమైన నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భారీ మెజారిటీ సాధించే దిశగా టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత, రైతు సమస్యలు తమకు అనుకూలంగా పరిణమిస్తాయని ప్రధాన రాజకీయ పక్షాలు కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎర్రజొన్న, పసుపు రైతులు రికార్డు స్థాయిలో మూకుమ్మడి నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత రెండోసారి నిజామాబాద్ లోక్‌సభ బరిలోకి దిగారు.
గతంలో రెండుసార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మధు యాష్కీ నాలుగోసారి పోటీకి సిద్ధమయ్యారు. గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసి, తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించిన టీఆర్‌ఎస్, ఆ తర్వాత వలసల వ్యూహానికి పదును పెట్టింది. వరుస వలసలతో కుదేలైన కాంగ్రెస్.. అభ్యర్థి ప్రకటన విషయంలో చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణి అవలంబించింది. మరో ప్రధాన రాజకీయ పక్షం బీజేపీకి క్షేత్ర స్థాయి నిర్మాణం కరువైంది. నామినేషన్ల పర్వం కూడా ముగియడంతో మూడు ప్రధాన రాజకీయ పక్షాలు తమ బలాబలాలను పరీక్షించుకునేందుకు ప్రచారపర్వంలో అడుగు పెడుతున్నాయి. ఈ నియోజకవర్గంలోని క్షేత్ర స్థాయి పరిస్థితిపై ‘సాక్షి’ పరిశీలన.. గ్రౌండ్ రిపోర్టు - కల్వల మల్లికార్జున్‌రెడ్డి
నిజామాబాద్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో నిజామాబాద్ లోక్‌సభ స్థానం విస్తరించి ఉంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 1.67 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీచేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు మొత్తంగా 2.17 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. దీంతో ఏప్రిల్ 11న నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి జరిగే ఎన్నికలో విజయం ఖాయమని టీఆర్‌ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారీ మెజారిటీ వస్తుందని టీఆర్‌ఎస్ లెక్కలు వేస్తోంది. బూత్ స్థాయి నుంచే భారీ మెజారిటీ సాధన దిశగా టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే ఎన్నికల ప్రచారపర్వంలోకి అడుగుపెట్టిన టీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమీకరించుకోవడంపై ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నాయి. దీంతో నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల రాజకీయ రణం క్రమంగా వేడెక్కుతోంది.
టీఆర్‌ఎస్: భారీ మెజారిటీ లక్ష్యం
రాష్ట్రంలో మిత్రపక్షం ఎంఐఎం సహా 17 లోక్‌సభ స్థానా ల్లో గెలుపే లక్ష్యంగా నిర్దేశించుకున్న టీఆర్‌ఎస్.. నిజామాబాద్ లోక్‌సభలో భారీ మెజారిటీ లక్ష్యం గా పెట్టుకుంది. పార్టీ అభ్యర్థి కవిత స్వయంగా బరిలోకి దిగడంతో పార్టీ శ్రేణులు భారీ విజ యాన్ని సవాలుగా తీసుకుంటున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి తొలిసారిగా టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కవిత 1.67 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిజా మాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలిచారు. వీరంతా తమ సమీప ప్రత్యర్థులపై మొత్తంగా 2.17 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గాలు, బూత్‌ల వారీగా పోలింగ్ శాతం, వివిధ రాజకీయ పక్షాలు సాధించిన ఓట్ల తీరును టీఆర్‌ఎస్ విశ్లేషించింది. 2014, 2018 ఎన్నికల్లో బూత్‌ల వారీగా ఓట్ల వివరాలను పోలుస్తూ, పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలపై కవిత దృష్టి సారించారు.
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ కేడర్‌తో సమావేశాలు ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. మెరుగైన ఫలితాలు సాధిస్తేనే త్వరలో జరిగే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశమిస్తామనే సందేశాన్ని పార్టీ కేడర్‌కు పంపారు. అసెం బ్లీ ఎన్నికల తర్వాత కూడా ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు ప్రోత్సహించిన టీఆర్‌ఎస్.. ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీ బలాలు, బలహీనతలను అంచనా వేయడంపై దృష్టి పెట్టింది. ఎర్రజొన్న, పసుపు రైతుల మూకుమ్మడి నామినేషన్ల వెనుక రాజకీయ కారణాలున్నాయని టీఆర్‌ఎస్ అనుమానిస్తోంది. ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ పోటీచేసే నియోజకవర్గాల్లోనూ రైతులతో మూకుమ్మడి నామినేషన్లు వేయిం చాలని వ్యూహం సిద్ధం చేస్తోంది. ఫెడరల్ ఫ్రంట్, రాష్ట్రంలో ఐదేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరు, జాతీయ పార్టీల వైఫల్యాలను ప్రచార ఎజెండాగా మార్చే యోచనలో ఉంది.
కాంగ్రెస్: సమన్వయమే సమస్య
వరుస వలసలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం పార్టీ అభ్యర్థి మధు యాష్కీకి సవాలు కానుంది. రెండుసార్లు ఎంపీగా పనిచేసినా పార్టీ నేతలు, కేడర్‌తో సంబంధాలు లేకపోవడం ప్రతికూలంగా కనిపిస్తోంది. ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్నది. క్రియాశీల నాయకులు, కార్యకర్తలు కొద్దిమంది మాత్రమే పార్టీని వెన్నంటి వున్నారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలకు అందుబాటులో లేకపోవడంపై సొంత పార్టీలోనే విమర్శలున్నాయి. భువనగిరి నుంచి టికెట్ ఆశించినా టికెట్ దక్కకపోవడంతో చివరకు నిజామాబాద్ నుంచి పోటీ చేయాల్సి రావడంపై ఇబ్బంది పడుతున్నారు. నామినేషన్ల పర్వం ముగిసినా ఎక్కడా పార్టీ నేతలతో సమన్వయ సమావేశాలు, ప్రచార వ్యూహం ఖరారు కాలేదు. ప్రభుత్వ వ్యతిరేకత, ఎంపీగా తాను సాధించిన అభివృద్ధి, పార్టీ కేడర్ సహకారంతో గట్టెక్కుతాననే ధీమాతో యాష్కీ ఉన్నారు. ప్రస్తుతానికి జగిత్యాల, కోరుట్ల, బోధన్‌లో మాత్రమే ఓ మోస్తరు ఓట్లు సాధించే పరిస్థితి కనిపిస్తోంది.
బీజేపీ: యువతకు గాలం
నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో పార్టీ నిర్మాణం అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ ఫలితంపై మాత్రం భారీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేశారు. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరిన« ధర్మపురి అర్వింద్.. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అర్వింద్ తండ్రి డి.శ్రీనివాస్ టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌లో కీలక నేతగా పనిచేసి, తర్వాతి కాలంలో టీఆర్‌ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. అయితే సీఎం కేసీఆర్‌తో విభేదాల నేపథ్యంలో పార్టీకి దూరంగా ఉంటున్న డీఎస్ ప్రస్తుత ఎన్నికల్లో ఎలాంటి వైఖరి అవలంబిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. రెండేళ్లుగా బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న అర్వింద్ యువత ఓట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని పార్టీ అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపకపోయినా, బీజేపీ అభ్యర్థి విజయంపై ధీమాతో ఉన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల నిజామాబాద్‌లో పార్టీ కేడర్‌తో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. మోదీ ప్రభుత్వ పథకాలు, దేశ రక్షణ అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ బలహీనతలు తనకు అనుకూలంగా మారుతాయని అర్వింద్ భావిస్తున్నారు.
రైతులు: మూకుమ్మడి నామినేషన్లు
వ్యవసాయ ప్రధానమైన నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ఎర్రజొన్న, పసుపు రైతులు మూకుమ్మడి నామినేషన్లు దాఖలు చేయడంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. మొత్తం 245 మంది నామినేషన్లు వేయగా, ఇందులో 200కు పైగా మంది రైతులు ఉన్నారు. ఎర్రజొన్న, పసుపు పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ రైతులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో లోక్‌సభ ఎన్నికలను వేదికగా మలుచుకున్నాయి. గ్రామ అభివృద్ధి కమిటీల పర్యవేక్షణలో రైతుల నామినేషన్లు దాఖలు కాగా, ప్రధాన రాజకీయ పక్షాలు మాత్రం పరస్పరం విమర్శలకు దిగుతున్నాయి. నామినేషన్ల ఉప సంహరణ గడువులోగా రైతులు వెనక్కి తగ్గని పక్షంలో ఎన్నిక వాయిదా వేసి, బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
అన్నింటా.. ‘కారు’దే దూకుడు
నిజామాబాద్ అర్బన్ :ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున బీగాల గణేశ్ గుప్తా వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో నిస్తేజం నెలకొనగా, బీజేపీ ఎంపీ టికెట్‌ను ఆశించిన ధర్మపురి అర్వింద్ మాత్రం ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. పూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ నియోజకవర్గం విస్తరించి ఉంది. పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత పోటీలో ఉండటంతో పార్టీ యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేస్తోంది.
నిజామాబాద్ రూరల్ : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్దన్ (టీఆర్‌ఎస్) వరుసగా రెండోసారి గెలుపొందా రు. అలాగే, కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి (బీజేపీ) ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. దీంతో పార్టీ కేడర్ టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతోంది. ఇక్కడి టీడీపీ శ్రేణులన్నీ కూడా టీఆర్‌ఎస్‌లో చేరాయి.
ఆర్మూరు : పసుపు పంటకు కేంద్రమైన ఈ సెగ్మెంట్ నుంచి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆశన్నగారి జీవన్‌రెడ్డి వరుసగా రెండోసారి గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ ఆకుల లలిత ఫలితాలు వెలువడిన వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతోపాటు గతంలో కాంగ్రెస్‌లో కీలక నేతగా వెలుగొందిన మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, పీఆర్‌పీ తరపున గతం లో పోటీ చేసిన డాక్టర్ మధు టీఆర్‌ఎస్ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్‌కు నియోజకవర్గ స్థాయి లో చెప్పుకోదగ్గ నాయకుడు లేరు. ఈ క్రమంలో నే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ మద్దతుదారులు కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇక్కడ ఏకపక్షంగా ఓట్లు సాధించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ సాగుతోంది.
బాల్కొండ :వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రత్యర్థి పార్టీలపై పై చేయి సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వేముల ప్రశాంత్‌రెడ్డికి రాష్ట్ర కేబినెట్‌లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా చోటు దక్కింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఈరపత్రి అనిల్ ఎన్నికల తర్వాత కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ కేడర్ టీఆర్‌ఎస్‌లో చేరడంతో క్షేత్ర స్థాయిలో రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో క్షేత్ర స్థాయిలో ఉన్న అనుకూలతను అనువుగా మలుచుకుని భారీ మెజారిటీ సాధించాలని టీఆర్‌ఎస్ యోచిస్తోంది.
బోధన్ :మైనారిటీల ప్రాబల్యం గల ఈ నియోజకవర్గంలోనూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి షకీల్ అహ్మద్ వరుసగా రెండోసారి గెలుపొందారు. అయితే, ఈయన కేవలం 8 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించడంతో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే బోధన్‌పై ఎంపీ కవిత దృష్టి పెట్టారు. ఎంపీ కవిత మెట్టినిల్లు పోతంగల్ ఇదే నియోజకవర్గంలోని నవీపేట మండలంలో ఉండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ మద్దతుదారులు చాలామంది టీఆర్‌ఎస్ గూటికి చేరారు. నియోజకవర్గంలో గతంలో గణనీయమైన ఓటు బ్యాంకు కలిగిన టీడీపీ పూర్తిగా కనుమరుగైంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలైన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రస్తుతం ఒంటరి పోరు సాగిస్తున్నారు. ఈ బలహీనతలను టీఆర్‌ఎస్ అనువుగా మార్చుకుంటోంది.
కోరుట్ల :జగిత్యాల జిల్లా పరిధిలోని కోరుట్లలో టీఆర్‌ఎస్ వరుస విజయాలు సాధిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు వరుసగా నాలుగోసారి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జువ్వాది నర్సింగ్‌రావు గణనీయంగా ఓట్లు సాధించారు. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కడం కాంగ్రెస్ శ్రేణుల స్థైర్యాన్ని దెబ్బతీసేదిగా ఉంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధు యాష్కీ తనకు టికెట్ దక్కకుండా చేశారంటూ పార్టీ నేత కొమిరెడ్డి రాములు ఆందోళనకు దిగారు. మధు యాష్కీపై దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుంచి రాములును సస్పెండ్ చేశారు. దీంతో యాష్కీకి ప్రస్తుత ఎన్నికల్లో రాములు వర్గం సహకరించే పరిస్థితి లేదు.
జగిత్యాల : కాంగ్రెస్ పార్టీ కీలక నేత జీవన్‌రెడ్డి సుదీర్ఘకాలం గా ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన అసెంబ్లీ సెగ్మెం ట్ ఇది. ఇక్కడే క్యాంపు ఆఫీస్ ఏర్పాటు చేసుకు న్న కవిత.. అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి ఓటమే లక్ష్యంగా పని చేశారు. సంజయ్ (టీఆర్‌ఎస్) ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ కార్యకలాపాలను కవిత స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జీవన్‌రెడ్డి వెంట బలమైన కేడర్ ఉండటంతో లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా కవిత పావులు కదుపుతున్నారు. లోక్‌సభ ఎన్నిక ల్లో భారీ మెజారిటీ సాధించడం ద్వారా కాంగ్రెస్ శిబిరాన్ని దెబ్బతీయాలనే వ్యూహంతో టీఆర్‌ఎస్ పనిచేస్తోంది. మొత్తంగా ఇక్కడ మాత్రమే కాంగ్రెస్ కొద్ది పోటీనిచ్చే పరిస్థితి ఉంది.
అందుకోసమే..
ఎర్రజొన్నలు, పసుపునకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ గతంలో రాస్తారోకో, ధర్నా, రోడ్లపై వంటావార్పు, హైదరాబాద్ అసెంబ్లీ వరకు రైతుల పాదయాత్ర వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఎన్నోసార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదు. రైతులంతా కలిసి ఐక్యంగా ఉద్యమించినా ఫలితం లేదు. గ్రామంలోని రైతులందరి సమష్టి నిర్ణయంతో ఎంపీగా నాతో పాటు మా గ్రామం నుంచి మరో ముగ్గురం నామినేషన్లు వేశాం. నిరసన తెలపడమే మా నామినేషన్ల లక్ష్యం.– లక్ష్మణ్, రైతు, జక్రాన్‌పల్లి
ఎన్‌ఆర్‌ఐ పాలసీ కావాలి..
విదేశాల్లో పనిచేస్తున్న మన కార్మికుల సంక్షేమానికి ఎన్‌ఆర్‌ఐ పాలసీని రూపొందించి అమలు చేసే వారికే మా మద్దతు. ప్రధానంగా గల్ఫ్ కార్మికుల ప్రయోజనాల కోసం పాటుపడేవారికి మా కుటుంబసభ్యులు, మేం ఓట్లు వేస్తాం. ఈ విషయంలో అన్ని పార్టీలు స్పష్టతనివ్వాలి. ముందస్తు ఎన్నికల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి రూ.500 కోట్ల ప్యాకేజీని ప్రకటించాలి. – గుల్లె రాజేశ్వర్, ఏర్గట్ల (కువైట్ ఎన్‌ఆర్‌ఐ)
టీఆర్‌ఎస్‌కు రుణపడి ఉన్నాం
బీడీ కార్మికులకు జీవనభృతిని ప్రకటించి అమలు చేసింది ఒక్క టీఆర్‌ఎస్ పార్టీయే. గతంలో నెలకు రూ.వెయ్యి భృతి ఇవ్వగా వచ్చే ఏప్రిల్ నుంచి రూ.2వేలు ఇస్తామని ప్రకటించారు. అంతేకాక బీడీ కార్మికులకు ఉన్న పీఎఫ్ ఖాతాల కటాఫ్ తేదీని పెంచారు. దీంతో ఎంతోమంది బీడీ కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. మా మద్దతు టీఆర్‌ఎస్ అభ్యర్థి కవితకే ఉంటుంది.– బొమ్మ శ్యామల, బీడీ కార్మికురాలు, వెంకటాపూర్
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి
పసుపు సాగులో ఏటా పెట్టుబడి వ్యయం పెరిగిపోతోంది. మార్కెట్‌లో విక్రయిస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. 2010లో క్వింటాలు పసుపు ధర రూ.12వేల నుంచి రూ.15వేలు ఉంటే.. ఇప్పుడు రూ.4వేలకు మించి రావడం లేదు. పెట్టుబడి వ్యయం పెరగడంతో ఎకరాకు రూ.30వేలు నష్టపోవాల్సి వస్తోంది. పసుపు విదేశాలకు ఎగుమతి అవుతున్నా మాకు మాత్రం మద్దతు ధర దక్కడం లేదు.
– గంగారం, రైతు, మంథని, ఆర్మూరు మండలం
రైతుబంధుతో ఊరట..
మూడెకరాల పొలం ఉంది. గతంలో సాగు చేసినా పెట్టుబడి, మద్దతు ధర ఇలా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. రైతుబంధు పథకం కింద డబ్బులు రావడం చాలా ఊరటనిస్తోంది. రాష్ట్రంలో కేంద్రంలో రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వం రావాలి. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి. ఎంపీ సీట్లు గెలిపిస్తేనే రాష్ట్రంలో రైతులకు మరింత మేలు జరుగుతుంది. నేనైతే టీఆర్‌ఎస్‌కే మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నా.– దబ్బ పెద్ద గంగారెడ్డి, జగ్గాసాగర్, మెట్‌పల్లి
జీవనభృతితో బతుకులు బాగు
నెల రోజులు బీడీలు చుడితే ఇంతకు ముందు మాకు వేయి రూపాయల నుంచి రూ.1500 వచ్చేవి. కేసీఆర్ ప్రభుత్వం బీడీ కార్మికులకు నెలకు రూ.వేయి చొప్పున జీవనభృతి ఇస్తోంది. బీడీలు చుడితే వచ్చే డబ్బులతో సమానంగా జీవనభృతి కూడా వస్తోంది. గతంలో బీడీ కార్మికుల గురించి ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. మేమైతే టీఆర్‌ఎస్‌కే ఓటేయాలని అనుకుంటున్నం.– సరోజ, బీడీ కార్మికురాలు, కోరుట్ల
రాజకీయాలకు దూరం
ఎర్రజొన్న, పసుపు మద్దతు ధర సమస్య మా గ్రామంలోనూ ఉంది. ఎర్రజొన్నలను గ్రామాభివృద్ధి కమిటీ కొని గోదాములో భారీగా నిలువ చేసింది. మార్కెటింగ్ సమస్యను ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలి. రాజకీయాలకు మేం దూరం.– అంక్సాపూర్ పెద్ద గంగారెడ్డి,వీడీసీ అధ్యక్షులు, అంకాపూర్
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
పురుషులు 6,11,709
స్త్రీలు 6,80,119
ఇతరులు 26
మొత్తం ఓటర్లు 12,91,854
నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు
నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బాల్కొండ, బోధన్, కోరుట్ల, జగిత్యాల
Comments
Please login to add a commentAdd a comment