
ఫేజ్–3హాట్ సీట్.:: నార్త్ గోవా
దక్షిణ భారతంలో ఉన్న బుల్లి రాష్ట్రం గోవా ప్రపంచ ప్రసిద్ధి పొందిన పర్యాటక కేంద్రం. 1961లో పోర్చుగీసు పాలన నుంచి విముక్తి పొందిన గోవాలో ఉన్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో ముఖ్య మైనది ఉత్తర గోవా నియోజకవర్గం. మరొకటి దక్షిణ గోవా నియోజకవర్గం. మూడో దశలో (ఏప్రిల్ 23) పోలింగ్ జరగనున్న ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీదారులు కాంగ్రెస్, బీజేపీ. నార్త్ గోవా నియోజకవర్గాన్ని 1967 వరకు పంజిం నియోజకవర్గంగా పిలిచేవారు. 1971 నుంచి 2004 వరకు పనాజీగా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి అది నార్త్ గోవా అయింది. 1962 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర గోమంతక్ పార్టీ నాలుగు సార్లు, కాంగ్రెస్– బీజేపీ నాలుగు సార్లు చొప్పున విజయం సాధించాయి. 1999లో ఈ నియోజకవర్గంలో బీజేపీ బోణీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా నాలుగు సార్లు ఆ పార్టీయే నెగ్గుతూ వస్తోంది. ఈ నియోజకవర్గం పరిధిలో 20 శాసనసభ స్థానాలున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా గిరీశ్ చొడాంకర్, బీజేపీ తరఫున శ్రీపాద యశో నాయక్, ఆప్ నుంచి ప్రదీప్ పడోంకర్ పోటీ చేస్తున్నారు. వీరుకాక మరో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
పట్టు సాధించాలని కాంగ్రెస్..
హిందువులు మెజారిటీగా ఉన్న ఈ నియోజకవర్గంలో క్రైస్తవులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. రాష్ట్రంలో పూర్వ వైభవం సాధించడం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, బీజేపీ అభ్యర్థి వైఫల్యాలను అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఐరన్ ఓర్ తవ్వకాలను పునరుద్ధరించడంలో కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు విఫలమవడాన్ని, కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పటీకీ నాయక్ ఈ విషయంలో విఫలం కావడాన్ని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఐరన్ ఓర్ తవ్వకాలు నిలిచిపోవడంతో ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. వారంతా తమకు ఓటేస్తారని కాంగ్రెస్ ఆశిస్తోంది. 52 ఏళ్ల చొడాంకర్ దక్షిణ గోవాకు చెందిన వారు. ఆయన ఉత్తర గోవా ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తారన్నది అనుమానమే. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో చొడాంకర్ పారికర్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీకి ఫిరాయింపులు తలనొప్పిగా మారాయి. గత ఏడాది నుంచి పలువురు నేతలు బీజేపీలోకి వెళ్లిపోతున్నారు.
పారికర్ సానుభూతిపై ఆశలు..
గత నాలుగు ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో జెండా ఎగరేసిన బీజేపీ ఐదోసారి విజయం కోసం తపిస్తోంది. సిట్టింగ్ ఎంపీ శ్రీపాద నాయక్ (66) ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఐదోసారి. రాష్ట్రంలో బీజేపీకి పెద్దదిక్కుగా ఉన్న పారికర్ లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. ఇంత వరకు ఇక్కడ బీజేపీ విజయానికి పారికరే కారణమన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన లేకపోయినా, ఆ సానుభూతితో గెలవవచ్చని కమలనాథులు ఆశిస్తున్నారు. అయితే, నాలుగుసార్లు ఎంపీగా చేసినా నాయక్ రాష్ట్రానికి ఏమీ చేయలేదన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. నాయక్‌పై పారికర్ మేనల్లుడే స్వయంగా విమర్శలు చేస్తున్నారు. పారికర్ వర్గీయులు నాయక్‌పై వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నాయక్ గెలుపు అంత సులభం కాదని ఎన్నికల విశ్లేషకుల అంచనా. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి స్థానికుడు కాకపోవడాన్ని అవకాశంగా తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది. నార్త్ గోవాలో కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థే దొరకలేదని, అందుకే దక్షిణ గోవా నుంచి అరువు తెచ్చుకుందని ప్రచారం చేస్తోంది. ఇక బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ప్రదీప్ పడోంకర్‌కు కూడా నియోజకవర్గంలో కొద్దో గొప్పో పరపతి ఉంది. ఈయన కాంగ్రెస్ ఓట్లను గణనీయంగా చీల్చే అవకాశం ఉందని పరిశీలకుల భావన.
మొత్తం ఓటర్లు 5,15,441
మహిళలు 2,59,571
పురుషులు 2,55,870
గత ఎన్నికల్లో పోలైన ఓట్లు 4,06,945
సిట్టింగ్ ఎంపీ శ్రీపాద యశోనాయక్ (బీజేపీ)
బీజేపీకి వచ్చిన ఓట్లు 2,37,903
రెండో స్థానం రవి నాయక్ (కాంగ్రెస్)
కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 1,32,304
Comments
Please login to add a commentAdd a comment