North Goa
-
ఐదో విజయానికి ఆరాటం
ఫేజ్–3హాట్ సీట్.:: నార్త్ గోవా దక్షిణ భారతంలో ఉన్న బుల్లి రాష్ట్రం గోవా ప్రపంచ ప్రసిద్ధి పొందిన పర్యాటక కేంద్రం. 1961లో పోర్చుగీసు పాలన నుంచి విముక్తి పొందిన గోవాలో ఉన్న రెండు లోక్సభ నియోజకవర్గాల్లో ముఖ్య మైనది ఉత్తర గోవా నియోజకవర్గం. మరొకటి దక్షిణ గోవా నియోజకవర్గం. మూడో దశలో (ఏప్రిల్ 23) పోలింగ్ జరగనున్న ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీదారులు కాంగ్రెస్, బీజేపీ. నార్త్ గోవా నియోజకవర్గాన్ని 1967 వరకు పంజిం నియోజకవర్గంగా పిలిచేవారు. 1971 నుంచి 2004 వరకు పనాజీగా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి అది నార్త్ గోవా అయింది. 1962 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర గోమంతక్ పార్టీ నాలుగు సార్లు, కాంగ్రెస్– బీజేపీ నాలుగు సార్లు చొప్పున విజయం సాధించాయి. 1999లో ఈ నియోజకవర్గంలో బీజేపీ బోణీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా నాలుగు సార్లు ఆ పార్టీయే నెగ్గుతూ వస్తోంది. ఈ నియోజకవర్గం పరిధిలో 20 శాసనసభ స్థానాలున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా గిరీశ్ చొడాంకర్, బీజేపీ తరఫున శ్రీపాద యశో నాయక్, ఆప్ నుంచి ప్రదీప్ పడోంకర్ పోటీ చేస్తున్నారు. వీరుకాక మరో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. పట్టు సాధించాలని కాంగ్రెస్.. హిందువులు మెజారిటీగా ఉన్న ఈ నియోజకవర్గంలో క్రైస్తవులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. రాష్ట్రంలో పూర్వ వైభవం సాధించడం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, బీజేపీ అభ్యర్థి వైఫల్యాలను అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఐరన్ ఓర్ తవ్వకాలను పునరుద్ధరించడంలో కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు విఫలమవడాన్ని, కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పటీకీ నాయక్ ఈ విషయంలో విఫలం కావడాన్ని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఐరన్ ఓర్ తవ్వకాలు నిలిచిపోవడంతో ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. వారంతా తమకు ఓటేస్తారని కాంగ్రెస్ ఆశిస్తోంది. 52 ఏళ్ల చొడాంకర్ దక్షిణ గోవాకు చెందిన వారు. ఆయన ఉత్తర గోవా ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తారన్నది అనుమానమే. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో చొడాంకర్ పారికర్పై పోటీ చేసి ఓడిపోయారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీకి ఫిరాయింపులు తలనొప్పిగా మారాయి. గత ఏడాది నుంచి పలువురు నేతలు బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. పారికర్ సానుభూతిపై ఆశలు.. గత నాలుగు ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో జెండా ఎగరేసిన బీజేపీ ఐదోసారి విజయం కోసం తపిస్తోంది. సిట్టింగ్ ఎంపీ శ్రీపాద నాయక్ (66) ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఐదోసారి. రాష్ట్రంలో బీజేపీకి పెద్దదిక్కుగా ఉన్న పారికర్ లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. ఇంత వరకు ఇక్కడ బీజేపీ విజయానికి పారికరే కారణమన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన లేకపోయినా, ఆ సానుభూతితో గెలవవచ్చని కమలనాథులు ఆశిస్తున్నారు. అయితే, నాలుగుసార్లు ఎంపీగా చేసినా నాయక్ రాష్ట్రానికి ఏమీ చేయలేదన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. నాయక్పై పారికర్ మేనల్లుడే స్వయంగా విమర్శలు చేస్తున్నారు. పారికర్ వర్గీయులు నాయక్పై వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నాయక్ గెలుపు అంత సులభం కాదని ఎన్నికల విశ్లేషకుల అంచనా. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి స్థానికుడు కాకపోవడాన్ని అవకాశంగా తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది. నార్త్ గోవాలో కాంగ్రెస్కు సరైన అభ్యర్థే దొరకలేదని, అందుకే దక్షిణ గోవా నుంచి అరువు తెచ్చుకుందని ప్రచారం చేస్తోంది. ఇక బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ప్రదీప్ పడోంకర్కు కూడా నియోజకవర్గంలో కొద్దో గొప్పో పరపతి ఉంది. ఈయన కాంగ్రెస్ ఓట్లను గణనీయంగా చీల్చే అవకాశం ఉందని పరిశీలకుల భావన. మొత్తం ఓటర్లు 5,15,441 మహిళలు 2,59,571 పురుషులు 2,55,870 గత ఎన్నికల్లో పోలైన ఓట్లు 4,06,945 సిట్టింగ్ ఎంపీ శ్రీపాద యశోనాయక్ (బీజేపీ) బీజేపీకి వచ్చిన ఓట్లు 2,37,903 రెండో స్థానం రవి నాయక్ (కాంగ్రెస్) కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు 1,32,304 -
హరిత గ్రామ కథ
మండోవి నది మధ్య ఉందీసెయింట్ ఎస్తేవం. ఉత్తర గోవాలోని ఆ గ్రామం చూడముచ్చటగా ఉంటుంది. పొట్టకొచ్చిన వరి పైరు ఇప్పుడు ఆ ఊరికి సరికొత్త శోభనిస్తోంది. చర్చి ఫాదర్ ప్రభాత ప్రవచనాల్లో పంట చేల తాలూకూ తాజా విశేషాల్ని భాగం చేస్తున్నారు. 30 ఏళ్ల తర్వాత ఆ ఊరి పంట పండబోతోంది.అక్టోబర్లో వరి పంట చేతికి రాబోతోంది. మరి ఇన్నాళ్లూ పంటలకు వారు ఎందుకు దూరంగా ఉన్నట్లు? రియల్ ఎస్టేట్ వద్దు.. రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా గోవాలో వరి సాగు బాగా క్షీణించింది. సెయింట్ ఎస్తేవం అంతటా బీడు భూములే. ఊళ్లో సగం మంది విదేశాల్లో స్థిరపడ్డారు. లేదంటే ఓడల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అనేక కుటుంబాలకు (నిన్న మొన్నటి వరకు) తమ పొలాలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఆ భూములకు వారు మూడో తరం వారసులు. తమ చిన్న చిన్న కమతాలను వదిలేస్తే అవి ‘రియల్’ వ్యాపారుల పరమవుతాయనే భయం వారిని ఆలోచింపచేసింది. ఆ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే హరిత గ్రామ సంఘం (గ్రీన్ విలేజ్ క్లబ్) ప్రాజెక్టు. సమష్టి వ్యవసాయ ఆలోచన. ఊరి జనం ఈ ప్రాజెక్టుకు మొదట అంగీకరించలేదు. భూములు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారనే వదంతులు వ్యాపించాయి. జనవరిలో జరిగిన మొదటి సమావేశంలో వ్యవసాయదారులు, భూ యజమానులు సమష్టి వ్యవసాయాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత కొంత కాలానికి చర్చలు జరిగాయి. చివరికి సంసిద్ధత వ్యక్తమైంది. భూ సమీకరణ మొదలైంది. 50 హెక్టార్లలో వరి వేశారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులకు అనువైన గోవా ధన్–1 రకాన్ని సాగు చేస్తున్నారు. 175 మెట్రిక్ టన్నుల పంట చేతికి రావొచ్చని భావిస్తున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఊళ్లో ఉన్న మొత్తం 250 హెక్టార్ల భూమిని సాగులోకి తేవాలని భావిస్తున్నారు. ఇంటింటికీ తిరిగారు.. ఈ గ్రామంలో నివసించేది ప్రధానంగా నావికులే. వారు వ్యవసాయం గురించి ఆలోచించేలా చేయడం పెద్ద సవాలు. ‘భూమి పత్రాలు, రికార్డులు వెతికి పట్టుకోండి. హక్కుదారులు ఎక్కడున్నారో విచారించండి’ అంటూ ఉదయం సమావేశాల్లో అక్కడి చర్చి ఫాదర్ యుసికో పెరీరా ప్రజలకు నచ్చజెప్పారు. ఎట్టకేలకు ఓ బృందం గ్రామస్తులు, వారి భూముల వివరాలు సేకరించగలిగింది. అశ్విన్ వరేలా అనే 20 ఏళ్ల కుర్రాడు.. భూముల విషయంలో గ్రామస్తులకు చాలా సాయపడ్డాడు. ‘రాత్రి వేళల్లో ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి అన్ని రికార్డులూ డౌన్లోడ్ చేశాం. విషయాలు నిర్ధారించుకోవడం కోసం ప్రతి ఇంటికీ వెళ్లాం. సాయపడ్డాం. మేం తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్లో పెట్టేవాళ్లం. విదేశాల్లో, ఓడల్లో ఉన్న వాళ్లను సంప్రదించేందుకు ఫేస్బుక్ వాడాం’ అని చెబుతున్నాడు అశ్విన్. గోవా వ్యాప్తంగా ఇలాంటి పరిణామం చేసుకోవడం ఇదే తొలిసారంటారు అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు హెడ్ సంజీవ్ మయేకర్. ఇప్పుడు గోవా మొత్తం సెయింట్ ఎస్తేవం వైపు ఆసక్తిగా చూస్తోంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపచేయాలని భావిస్తోంది. అస్తిత్వ పోరాటంలో భాగమే.. తమ అస్తిత్వం, భాష, సంస్కృతి, పండుగలను కాపాడుకునేందుకు గోవావాసులు పోరాడుతున్నారనీ, సెయింట్ ఎస్తేవం పరిణామాల్ని ఈ కోణం నుంచే చూడాలని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో చెబుతున్నారు. ‘వలసదారులను ఆహ్వానిస్తాం. కానీ ఈ భయం కూడా ఒక నిజం’ అంటారాయన. అనేక కుటుంబాలు ఈ ప్రాంతాన్ని వదిలి, తిరిగి రాలేనంత దూరం వెళ్లిపోయాయి. వారు భూముల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అవి వివాదాల్లో చిక్కుకోవచ్చు. లేదంటే కబ్జాకు గురై రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి చిక్కొచ్చు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు ఈ ప్రాజెక్టు అభినందించదగ్గదేనని మౌజో చెబుతున్నారు. -
విదేశీ బాలికపై అత్యాచారం
పనాజీ: గోవాలో దారుణం చోటు చేసుకుంది. ఇస్టోనియా దేశానికి చెందిన టీనేజీ బాలిక అత్యాచారానికి గురైంది. దీంతో బాధితురాలు అంజునా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ముంబైకి చెందిన షమీమ్ పేషిమామ్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అత్యాచారం విషయం ఎవరికైనా వెల్లడిస్తే తల్లిదండ్రులను చంపేస్తామని నిందితుడు బెదిరించాడని ఇస్టోనియా బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం అనంతరం యువతి వద్దనున్న సెల్ఫోన్, నగదు తీసుకుని నిందితుడు పరారైయ్యాడని పోలీసులు తెలిపారు. గోవా రాజధాని పనాజీకి 20 కిలోమీటర్ల దూరంలోని చపోరా గ్రామంలో ఈ అత్యాచారఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఉత్తర గోవాలోని చపోరా గ్రామం నేరాలు, మాదకద్రవ్యాలకు నిలయమని పోలీసులు వెల్లడించారు.