జుయల్ ఒరమ్, సునీతా బిశ్వాల్, జార్జ్ తిర్కీ
ఒడిశా అంటే నవీన్ పట్నాయక్.. నవీన్ పట్నాయక్ అంటే ఒడిశా అన్నట్టుగా 20 ఏళ్లుగా రాజకీయాలు మారిపోయాయి. ఒడిశా ఎన్నికల చరిత్రలో బిజూ జనతాదళ్ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రస్థానం తిరుగులేనిది. ఒడిశా.. రాష్ట్రంగా చూస్తే వెనుకబడిందే.. కానీ ఖనిజ సంపదలో చాలా విలువైనది. ఈ ఖనిజాల చుట్టూ జరిగే వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి నవీన్ పట్నాయక్ గత నాలుగు ఎన్నికల్లోనూ అందలాన్ని అందుకున్నారు. కానీ ఇప్పటివరకు బిజూ జనతాదళ్ అడుగు పెట్టలేకపోయిన ప్రాంతం ఏదైనా ఉందీ అంటే అది సుందర్‌గఢ్. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేడీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. అందుకే ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది.
అటవీ హక్కుల చట్టం అమలే ప్రధానాంశం
ఒడిశాలో సుందరగఢ్ నియోజకవర్గం కీలకమైనది. ఇది ఎస్టీ రిజర్వుడు స్థానం. ప్రతీ ఐదుగురిలో ఒకరు గిరిజనుడే. 2014 ఎన్నికల్లో ఏకైక బీజేపీ ఎంపీగా జుయల్ ఒరమ్ ఇక్కడ గెలుపొంది రికార్డు సృష్టిం చారు. ఆ తర్వాత కేంద్ర గిరిజన మంత్రి పదవినీ అందుకున్నారు. జుయల్ ఒరమ్‌కి విజయం అంత సులభంగా లభించలేదు. చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో అప్పట్లోనే ఒమర్‌కి బీజేడీ అభ్యర్థి దిలీప్ కుమార్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈసారి మోదీ వేవ్ ఆ స్థాయిలో లేకపోగా కేంద్ర గిరిజన మంత్రిగా నియోజకవర్గానికి, ఆదివాసీల సంక్షేమానికి ఆయన చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి. ఆదివాసీలకు భూ యాజమాన్య హక్కుల్ని కల్పిస్తూ 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఫ్రా) తీసుకువచ్చినా వారికి ప్రయోజనం కలగలేదు. ఆ చట్టంలో లొసుగుల ఆధారంగా ఎందరో ఆదివాసీలకు యాజమాన్య హక్కుల్ని తిరస్కరించారు. తమ నియోజకవర్గం ఎంపీ కేంద్రంలో గిరిజనుల మంత్రిగా ఉన్నప్పటికీ తమకు ఒరిగిందేమీ లేదన్న అసంతృప్తి ఆదివాసీల్లో నెలకొంది. ‘ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్రా కీలకపాత్ర పోషిస్తుంది. ఒడిశాలో పార్టీలన్నీ దీనిని సీరియస్‌గా తీసుకున్నాయి. మేనిఫెస్టోల్లో దీనినే ప్రధానంగా ప్రస్తావించాయి’ అని వసుంధర అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన గిరిరావు వ్యాఖ్యానించారు.
జాతీయ సగటు కంటే ఒడిశాలో తక్కువ
జాతీయ స్థాయిలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు అటవీ హక్కుల గుర్తింపు చట్టంపై ఈ మధ్య కాలంలో ఆదివాసీల్లో అవగాహన పెంచుతున్నాయి. దీంతో ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రం కానుంది. ఈ చట్టం అమల్లో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు చాలా తక్కువగా ఉంది. ఈ చట్టం కింద భూ యాజమాన్య హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతించే జాతీయ సగటు రేటు 81 శాతంగా ఉంటే, ఒడిశాలో 71 శాతమే ఉంది. షెడ్యూల్ తెగలు మాత్రమే కాకుండా ఇతర సంప్రదాయ ఆదివాసీలు తవ్వకాల కోసం పెట్టుకున్న అనుమతుల్లో 2 శాతం మాత్రమే ప్రభుత్వం అంగీకరించింది. ఇది కూడా జాతీయ సగటు (13%) కంటే చాలా తక్కువ. కేంద్ర గిరిజన మంత్రిగా ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉన్నప్పటికీ ఫ్రా చట్టం అమలు ఇంత ఘోరంగా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలకు అదే ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది.
త్రిముఖ పోటీ
సుందర్‌గఢ్‌లో ఒక్కసారి కూడా నెగ్గలేకపోవడంతో బీజేడీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 33 శాతం మహిళలకు టికెట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. సుందర్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్ కుమార్తె సునీతా బిశ్వాల్‌కు అవకాశం ఇచ్చారు. ఒడిశాకు మొదటి గిరిజన ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్‌కు మంచి పేరే ఉంది. అదే సునీతా బిశ్వాల్‌కు అనుకూలంగా మారుతుందన్న అంచనాలున్నాయి. ఒడిశా సుందర్‌గఢ్ నియోజకవర్గంలో 2000 సంవత్సరం నుంచి జుయల్ ఒరమ్, హేమానంద బిశ్వాల్ మధ్యే పోటీ ఉంటోంది. బిశ్వాల్ కుమార్తెను రంగంలోకి దింపడం ద్వారా నవీన్ తెలివిగా వ్యవహరించారన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి.
ఇక, బీరమిత్రపూర్ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న జార్జ్ తిర్కీ కాంగ్రెస్ గూటికి చేరుకొని ఈ లోక్‌సభ బరిలో సవాల్ విసురుతున్నారు. సుందర్‌గఢ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 2.6 లక్షల ఓట్లు సంప్రదాయంగా పడుతూ వస్తున్నాయి. దానికి తోడు తనకున్న వ్యక్తిగత ఇమేజ్ ద్వారా లక్ష ఓట్ల వరకు సంపాదించగలరని అంచనా. దీంతో జార్జ్ తిర్కీ బలమైన అభ్యర్థిగానే మారారు. అయితే అన్ని పార్టీల్లోనూ రెబెల్స్ బెడద ఉండటంతో ఈసారి వీరు ఏ పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీస్తారోనన్న ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని సాధించడం కోసం పార్టీ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా చాలామంది నాయకులపై వేటు వేసింది. వీరంతా సుందర్‌గఢ్ బరిలో నిలవడంతో అన్ని పార్టీలకు గండంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment