
మాట్లాడుతున్న సి. రామచంద్రయ్య
కడప కార్పొరేషన్: రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వం చంద్రబాబు సృష్టించిన ట్రాప్‌లో పడినట్లుగా కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య విమర్శించారు. మంగళవారం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని స్థానిక వైఎస్సార్ ఆడిటోరియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నిర్మాణాత్మకంగా వ్యవహరించి, రాష్ట్రాభివృద్ధికి తగిన సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. చంద్రబాబు ఏది మాట్లాడితే వారూ అదే మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి 75 రోజులు మాత్రమే అయిందని, ఈ దశలోనే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. బాబు పాలన తమకు వారసత్వంగా వచ్చిందని, దివాళా తీసిన ప్రభుత్వాన్ని తాము చేపట్టామని చెప్పారు.
టీడీపీ మొదలు పెట్టిన అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయాలనే తలంపుతో ఉన్నామని, ఇందుకు బీజేపీ సహకరించాలని కోరారు. ఇసుక పాలసీ చాలా క్లిష్టతరమైనదని, దీనిపై అధ్యయనం చేసి అమలు చేసేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. చంద్రబాబు కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులకు ప్రతినిధి అయితే.. జగన్ ప్రజలకు మాత్రమే ప్రతినిధి అన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్ 370 రద్దుకు తాము మద్దతు ఇచ్చామని, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బీజేపీ తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోలేదని, బాబు దోపిడీ మాత్రమే ఆగిపోయిందన్నారు. టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపిందే చంద్రబాబని, తద్వారా జైళ్లకు పోకుండా ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేశారన్నారు. టీడీపీ నేతలకు బీజేపీ షెల్టర్ జోన్‌లా తయారైందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని రామచంద్రయ్య వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment