కడప కార్పొరేషన్: తన సంపదను పెంచుకోవడానికి చంద్రబాబు రహస్య అజెండాతోనే విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య విమర్శించారు. మంగళవారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో తన రూ.రెండు లక్షల కోట్ల ఆస్తులు పోతాయనే బెంగతోనే చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేయిస్తున్నారని మండిపడ్డారు. కేవలం సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న వ్యక్తిగత ద్వేషాలతోనే ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించి, సొంత సామాజికవర్గాన్ని రెచ్చగొట్టి చేసే ఇలాంటి ఉద్యమాలు ఎక్కువ కాలం కొనసాగవని చంద్రబాబును హెచ్చరించారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు, వర్గాలు ప్రయోజనం పొందుతాయన్నారు.
ఒకేచోట అభివృద్ధినంతా కేంద్రీకరించడం వల్లే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. ఫలితంగా విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయి ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. ఇదే ఫార్ములాను చంద్రబాబు అమరావతిలో కూడా అమలు చేయాలని చూశారన్నారు. రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులన్నీ తీసుకుపోయి అమరావతిని అభివృద్ధి చేసి, ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా తన అనుచరులు కొన్న భూములకు విలువ పెంచాలని ప్రయత్నించారన్నారు. తన సంపదను పెంచుకోవడం, సృష్టించుకోవడమే ఆయనకు తెలుసని ఎద్దేవా చేశారు.
శివరామకృష్ణన్ కమిటీ రాజధానిని కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య పెట్టాలని చెప్పినట్లు చంద్రబాబు ప్రచారం చేయడం దారుణమన్నారు. ఆ కమిటీ నివేదిక రాక ముందే నాటి మంత్రి నారాయణతో కమిటీ వేసి అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారన్నారు. మార్టూరు–వినుకొండల మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని.. గుంటూరు, విజయవాడ మధ్య వద్దే వద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందన్నారు. అమరావతిపై చంద్రబాబు చేయిస్తున్న ఆందోళన భోగి మంట మాత్రమేనని కొట్టిపారేశారు. టీడీపీకి, బీజేపీకి తడికెలాగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తయారయ్యారని విమర్శించారు.
రహస్య అజెండాతోనే అమరావతి ఏర్పాటు
Published Wed, Jan 15 2020 4:54 AM | Last Updated on Wed, Jan 15 2020 4:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment