మోదీ మంత్రం.. కాషాయ విజయం | BJP Clean Sweep in Karnataka | Sakshi
Sakshi News home page

మోదీ మంత్రం.. కాషాయ విజయం

Published Fri, May 24 2019 11:03 AM | Last Updated on Fri, May 24 2019 11:03 AM

BJP Clean Sweep in Karnataka - Sakshi

ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా ప్రజా తీర్పు వెలువడింది. ఎవరి అంచనాలకు అందని రీతిలో అధికార కాంగ్రెస్‌– జేడీఎస్‌లు మట్టికరిచాయి. కాషాయం దెబ్బకు హేమాహేమీలు ఇంటి ముఖం పట్టారు. దీని ప్రభావమేమిటో రానున్న రోజులే తేటతెల్లం చేయవచ్చు.

సాక్షి, బెంగళూరు: ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కనీవినీ ఎరుగని స్థాయిలో 25 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీ హవా ముందు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ముఖ్య నేతలు మల్లికార్జున ఖర్గే, మునియప్ప, వీరప్పమొయిలీ, మాజీ ప్రధాని దేవెగౌడ వంటి హేమాహేమీలే మట్టికరవక తప్పలేదు. ఇక దేశంలో ఎంతో ఆసక్తి కలిగించిన మండ్య లోకసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సుమలతా అంబరీష్‌ విజయం సాధించగా, ఇక్కడ సీఎం కుమారస్వామి  కుమారుడు నిఖిల్‌ నేలకరిచారు. ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు డీవీ సదానందగౌడ, అనంత్‌ కుమార్‌ హెగ్డే, రమేశ్‌ జిగజిణగిలు విజయం సాధించారు. రాష్ట్రంలోని 28 లోకసభ నియోజకవర్గాల్లో సుమారు 25 చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్‌ పార్టీలు ఘోర ఓటమిని చవిచూశారు. ఇరుపార్టీలు చెరొక స్థానాన్ని దక్కించుకున్నాయి. 

గతం కంటే ఎక్కువ  
బీజేపీ 2014 లోకసభ ఎన్నికల కంటే కూడా 8 స్థానాలు ఎక్కువగా విజయం సాధించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 17 ఎంపీ సీట్లను గెల్చుకుంది. ఇటీవల ఉప ఎన్నికల్లో ఓటమి పాలయిన బళ్లారిని తిరిగి కైవసం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్పపై బీజేపీ అభ్యర్థి దేవేంద్రప్ప విజయం సాధించారు. గతసారి ఉత్తర కర్ణాటకలో మాత్రమే అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి దక్షిణ కర్ణాటకలోనూ చాలా చోట్ల పాగా వేసింది. సాధారణంగా కాంగ్రెస్‌ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మైసూరులోనూ బీజేపీ విజయం సాధించడం విశేషం. 

దక్షిణ భాగంలోనూ పట్టు  
దక్షిణ కర్ణాటక, చిక్కబళ్లాపు, చిత్రదుర్గ, తుమకూరు, కోలారు వంటి కాంగ్రెస్, జేడీఎస్‌ కంచుకోట నియోజకవర్గాల్లో సైతం బీజేపీ తన విజయదుంధుబి మోగించింది. ఇక ఉత్తర కర్ణాటక, హైదరాబాద్‌–కర్ణాటక, ముంబై–కర్ణాటకలో నియోజకవర్గాల్లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. కాంగ్రెస్, జేడీఎస్‌ పార్టీలు ఉత్తర కర్ణాటకలో ఒక్క చోట కూడా ఖాతా తెరవకపోవడం విశేషం. బీజేపీ ఘన విజయంతో అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల వద్ద సంబరాలు మిన్నంటాయి.

ట్రబుల్‌ షూటర్లకు గుణపాఠం
శివాజీనగర:  ఈసారి లోక్‌సభా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన హేమాహేమీలు ఓటమి పాలు కావడంతో ఆ పార్టీలో ట్రబుల్‌ షూటర్లుగా పేరుపొందిన మంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యలకు ముఖభంగమైంది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అనుకూల నియోజకవర్గాలైన మైసూరు, బాగలకోట, కొప్పళ జిల్లాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పరాజయం పాలు కావడంతో ఆయన హవా సాగలేదని అర్థమైంది. మంత్రి డీ.కే.శివకుమార్‌ ఇన్‌చార్జిగా నియమించిన శివమొగ్గ, బళ్లారి రెండూ స్థానాల్లోను కాంగ్రెస్‌ మట్టికరిచింది. ఈ అన్ని నియోజకవర్గాల్లో ట్రబుల్‌ షూటర్ల ఆటలు సాగలేదు. కోలారులో ఓటమి ఎరుగని నాయకునిగా పేరు గాంచిన కాంగ్రెస్‌ నేత కే.హెచ్‌.మునియప్పకు తొలిసారిగా ఆ రుచిని చూపించారు.

జిల్లాలో అనేకమంది నాయకుల వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మునియప్ప, సొంత పార్టీవారే ఆయన పరాజయానికి సహకారం అందించారని తెలిసింది. ప్రముఖ నాయకుడైన మల్లికార్జున ఖర్గే గుల్బర్గా నియోజకవర్గంలో నేలకరవడానికి ఆయన కుమారుడు, మంత్రి ప్రియాంక ఖర్గే దుందుడుకు వైఖరే కారణమని చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మర్యాదను బెంగళూరు రూరల్‌ ఎంపీ డీ.కే.సురేశ్‌ గెలుపొందటం ద్వారా కొంత కాపాడారు. జేడీఎస్‌ కూడా కాంగ్రెస్‌ తరహాలానే ఈ ఎన్నికల్లో ముఖ  భంగానికి గురైంది. ఆ పార్టీ దళపతి, మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమి నిజానికి జేడీఎస్‌కు చెంపపెట్టు అయిందని వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ కుమారస్వామి మండ్యలో ఓడిపోవడం జేడీఎస్‌కు పుండుమీద కారం చల్లినట్లు అయ్యింది. కుమారుని ఓటమి ముఖ్యమంత్రి కుమారస్వామిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ముఖ్యమంత్రిగా తన కుమారుడిని ఎన్నికల్లో గెలిపించుకోవటానికి కుమారస్వామికి సాధ్యం కాకపోవటం నిజానికి శోచనీయమైన సంగతని చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement