సాక్షి, అమరావతి: నాలుగేళ్ల పాలనలో వైఫల్యాలు, అవినీతిపై ప్రతి వారం ఐదు ప్రశ్నలతో సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖలు రాయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించారు. తొలిగా ఐదు ప్రశ్నలను సంధిస్తూ బుధవారం ఆయన సీఎంకు రాసిన లేఖను విడుదల చేశారు.
- 2014 ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్ నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పాలంటూ మొదటి ప్రశ్నను సంధించారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే అలా చేశారా అని ప్రశ్నించారు.
- అధికారంలోకి వచ్చిన తొలిరోజు సంతకాలు చేసిన రైతు, డ్వాక్రా రుణమాఫీ, బెల్టుషాపుల మూత, ప్రతి ఇంటికీ శుభ్రమైన తాగునీరు పంపిణీ హామీల అమలు తీరేమిటి అని ప్రశ్నించారు. వీటిని అమలు చేయలేదనే విషయాన్ని మీ ధర్మపోరాట దీక్షలో ప్రజలకు వివరించి, వారికి క్షమాపణ చెప్పే ధైర్యం మీకు ఉందా?
- ఓటుకు కోట్లు వ్యవహారంలో నిజాలను ప్రజలకు వివరించి, మీరూ, మీ పార్టీ ఏ నేరానికి పాల్పడలేదని ఒక బహిరంగ ప్రకటన చేయగలరా? ఫోను సంభాషణలో బయటపడ్డ ‘బ్రీఫ్డ్ మీ’ అన్న మాటలు మీవి కాదని ప్రజలకు చెప్పగలరా?
- గ్రామ పంచాయతీ, మండల ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయిన నేతలతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి.. ప్రతి పథకం వారి ద్వారా అమలు చేయిస్తూ కమీషన్లు, లంచాలు చెల్లిస్తే గానీ సంక్షేమ కార్యక్రమాలు అందని పరిస్థితి కల్పించింది నిజం కాదా?
- విశాఖ భాగస్వామ్య సదస్సుల ద్వారా రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. వాటన్నింటిపై వాస్తవాలను ప్రజలకు బహిర్గతం చేసే ధైర్యం ఉందా? అని సీఎంను నిలదీశారు.
‘కన్నా’ పై చెప్పు విసిరిన టీడీపీ కార్యకర్త
కావలి: కావలిలో బీజేపీ బుధవారం ర్యాలీ నిర్వహించింది. ర్యాలీ ట్రంకురోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరుకోగానే ఓపెన్ టాప్ జీపులో ఉన్న కన్నా లక్ష్మీనారాయణపైకి ఓ టీడీపీ కార్యకర్త చెప్పు విసిరి దాడికి పాల్పడ్డాడు. అది తగలకపోవడంతో రెండో చెప్పును విసరగా అది కన్నా తలకు రాసుకొంటూపోయింది. దీంతో కంగుతిన్న బీజేపీ కార్యకర్తలు వెంటనే తేరుకుని అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ధర్నా చేశారు. చెప్పు విసిరిన వ్యక్తిని ప్రకాశం జిల్లా ఎం.నిడమనూరుకు చెందిన గొర్రెపాటి మహేశ్వరచౌదరిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment