సాక్షి, సిద్దిపేట: ‘తెలంగాణ వస్తే ఇక్కడి ప్రజల బతుకులు మారతాయని, ఉద్యోగాలు వస్తాయని భావించి శ్రీకాంతాచారి, యాదిరెడ్డి, కిష్టయ్య, వేణుగోపాల్‌రెడ్డి ప్రాణాలు త్యాగం చేశారు. కానీ వచ్చిన తెలంగాణను ఆ నలుగురే పాలిస్తున్నారు. గరీబోళ్ల రాజ్యం రావాలంటే భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రావాలి’అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ తలపెట్టిన జనచైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో అణచివేతలు, నిర్బంధాలు, బెదిరిం పుల పర్వం నడుస్తోందని ధ్వజమెత్తారు. నిజాంను తలదన్నేలా కేసీఆర్ పాలన సాగుతోందని, ఈ పాలనకు చరమగీతం పాడేం దుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇసుక, ల్యాండ్‌మాఫియాలు రా జ్యం ఏలుతున్నాయని.. ఇదేంటని ప్రశ్నించినందుకు నేరెళ్లలో దళితులను చితక బాది కేసులు పెట్టారని ఆరోపించారు. పంటకు గిట్టుబాటు ధర అడిగిన పాపానికి ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొని త్యాగాలు చేసిన వారిని విస్మరించి, తెలంగాణను వ్యతిరేకించిన వారికి మంత్రి పదవులు అప్పగించి అందలం ఎక్కించారని విమర్శించారు. గల్లీలకే పరిమితమైన మజ్లిస్ పార్టీని టీఆర్‌ఎస్ నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తోందని మండిపడ్డారు. ఇదంతా కేసీఆర్ ఓట్ల కోసం ఆడే నాటకం అన్నారు. హిందువుల కోరిక రామ మందిరం నిర్మాణమని.., దానిని ఎవ్వరూ ఆపలేరని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌కు దమ్ముంటే మందిరంపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని సవాల్ విసిరారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి..
ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 63 సీట్లతో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు 90 మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చారని లక్ష్మణ్ ప్రశ్నించారు. నిజంగా టీఆర్‌ఎస్‌కు ప్రజాబలం ఉంటే.. ఫిరాయింపులకు పాల్పడిన వారిచే రాజీనామాలు చేయించి మళ్లీ గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాకముందు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, కాంగ్రెస్ నాయకులను జైల్లో పెడతామని చెప్పిన కేసీఆర్ తర్వాత ఎందుకు చల్లబడ్డారని ప్రశ్నించారు. సూరత్‌లో చీరె రూ.50 చొప్పున కొనుగోలు చేసి బతుకమ్మ కానుక అంటూ ఆడపడుచుల ఆత్మగౌరవం దెబ్బతీశారని విమర్శించారు.
రాష్ట్రంలో సచివాలయానికి వెళ్లడానికి తీరిక లేదని చెప్పే ముఖ్యమంత్రి థర్డ్‌ఫ్రంట్ పెట్టి ఢిల్లీకి వెళ్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఒక్క తాను ముక్కలే అనే విషయం కర్ణాటక ఎన్నికల్లో తేలిపోయిందని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నాలుగు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారని, కేసీఆర్ గడీల రాజ్యం కూలదోసే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన మహా నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు మోదీ పలు పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు.
పేద మహిళలకు ఇబ్బంది కలగకుండా ఉజ్వల గ్యాస్, మహిళల ఆత్మగౌరవం కోసం ఇంటింటికీ మరుగుదొడ్లు, ఆడపిల్ల పుడితే రూ. 6వేలు.. ఇలా పేదలకు ఉపయోగపడే పథకాలు ప్రవేశపెట్టిన నరేంద్ర మోదీ ప్రజల పక్షపాతిగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌లో కుటుంబ పాలన నడుతోందని విమర్శించారు. ఇప్పటికే 20 రాష్ట్రాల్లో బీజేపీ పాలన సాగుతోందని, తెలంగాణలో కూడా భారతీ య జనతాపార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఈ యాత్ర చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో యాత్ర ఇన్‌చార్జి ధర్మారావు, పార్టీ రాష్ట్ర నాయకులు యాదగిరిరెడ్డి, పూనం రాజిరెడ్డి, సుధాకర్‌శర్మ, ఆకుల రాజయ్య, బుచ్చిరెడ్డి, మనోహర్‌రెడ్డి, జిల్లా అ«ధ్యక్షుడు నరోత్తంరెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు తోకల ఉమారాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment