బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు (ఫైల్‌ఫొటో)
సాక్షి, హైదరాబాద్: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాకపోవడంపై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మండిపడ్డారు. టీఆర్‌ఎస్ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీకి భయపడే ముఖ్యమంత్రి భద్రాచలం రాలేదా అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సీతారాముల కళ్యాణానికి రాకపోవడాన్ని రాష్ట్ర ప్రజలు అవమానంగా భావిస్తున్నారని అన్నారు. నిజాం కాలం నుంచి కళ్యాణం రోజు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ అని ఆయన తెలిపారు.
భద్రాచలంలో గులాబీ రంగు జెండాలు కట్టుకోవడం గుర్తుంది కానీ, దేవుడికి పట్టువస్త్రాలు సమర్పించడం గుర్తు లేదా అని ప్రశ్నించారు. మజ్లిస్‌కు భయపడి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించని ముఖ్యమంత్రి, దీన్ని కూడా అలాగే చేస్తున్నారని విమర్శించారు. రాజకీయల కోసం భారీగా ఖర్చు చేసే కేసీఆర్‌కు సెలవు రోజున భద్రాద్రికి రావడానికి ఏం అడ్డం వచ్చిందని ప్రశ్నించారు. దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని సీఎం కేసీఆర్ తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రభుత్వ వ్యవహారాల వల్లే నిర్మల్‌లో అల్లర్లు జరుగుతున్నాయని తాము భావించాలా అని ప్రశ్నించారు. అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి రాజీనామా ప్రభుత్వ వైఖరికి నిదర్శనం అని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు విషయంలో వీడియో ఫుటేజ్‌ను హైకోర్టుకు అందిస్తానని అని హామీ ఇచ్చిన ప్రకాశ్‌ను ఆ కేసు నుంచి తప్పించడంతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోందని ఆరోపించారు. ఈ కేసు విషయమై సుప్రీంకోర్టు లాయర్ హరీశ్ సాల్వేను రంగంలోకి దించడంతోనే ప్రభుత్వం తప్పు చేసినట్టు పరోక్షంగా ఒప్పుకున్నట్లే అని అన్నారు. అడ్వకేట్ జనరల్ చేయలేని పనిని హరీశ్ సాల్వే ఏం చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తీరును చూసి ప్రభుత్వ ఉద్యోగులు భయపడుతున్నారని, త్వరలోనే వాళ్లు సహాయ నిరాకరణకు సిద్ధమవుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment