
విజయవాడ: టీడీపీ చెప్పుకోవటానికి ఏదీ మిగలదని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత కృష్ణం రాజు వ్యాఖ్యానించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానం వల్ల దేశంలో మోదీ పట్ల ఎంత విశ్వాసం ప్రజలు చూపుతున్నారో అర్ధమైందని అన్నారు. అవిశ్వాసం కోసం 18 పార్టీల మద్ధతు కూడగట్టాం అన్నారు కానీ ఒక్క పార్టీతో కూడా సభలో ఏపీకి అన్యాయం జరిగిందని మాట్లాడించలేకపోయారని విమర్శించారు. ప్రజల బాగుకోరుకునే నాయకులు వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. పోలవరం, దుగ్గరాజపట్నం పోర్టు, కడప ఉక్కు కర్మాగారం, విశాఖపట్నం రైల్వే జోన్, ట్రైబల్ యూనివర్సిటీలపై త్వరలోనే కేంద్రం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించబోతుందని వెల్లడించారు.
కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించి ప్రజలకు వాస్తవాలు చెబుతారని తెలిపారు. జాతీయ విద్యాసంస్థలు అన్నీ తాత్కాలిక భవనాలలోనే నిర్వహిస్తున్నారని.. త్వరిగతిన శాశ్వత భవనాలు నిర్మించి వీటిని అందులోకి మార్చేందుకు కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తుందని చెప్పారు. అమరావతి నిర్మాణం కోసం నిధులు కేటాయించామని, మరిన్ని నిధులు కావాల్సి వస్తే వాటికి వనరులని కేంద్రం చూపిస్తుందని వివరించారు. మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడం భావ్యం కాదని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఢిల్లీలోని పార్టీ పెద్దలకు నివేదికలు సిద్ధం చేసి పంపుతున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment